Monday, December 23, 2024

గుజరాత్‌లో బయటపడిన నకిలీ ఆధార్, పాన్ కార్డుల కుంభకోణం

- Advertisement -
- Advertisement -

సూరత్: ఒక వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆధార్, పాన్ కార్డులతోపాటు ఓటర్ గుర్తింపు కార్డులు వంటి గుర్తింపు కార్డులను నకిలీవి సృష్టించిన ఇద్దరు వ్యక్తులను గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఈ చర్యను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ డాటాబేస్‌లోకి చట్టవిరుద్ధంగా చొరబడిన ఈ ఇద్దరు నిందితులపై తీవ్రమైన నేరారోపణలను నమోదు చేయనున్నట్లు సోమవారం పోలీసులు తెలిపారు.

నిందితులు దాదాపు 2 లక్షల గుర్తింపు కార్డులను ఫోర్జరీ చేశారని, ఒక్కో కార్డును రూ. 15 నుంచి రూ.200 వరకు విక్రయించారని పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాల ఆధారంగా కొందరు వ్యక్తులు బ్యాంకు రుణాలు పొంది వాటిని బ్యాంకులకు తిరిగి కట్టకుండా ఎగ్గొట్టినట్లు ఒక ప్రైవేట్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ కుంభకోణం వెలుగుచూసింది.

నకిలీ పత్రాలను ఫోర్జరీ చేసి బ్యాంకులను మోసం చేసినందుకు గత రెండు వారాలలో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సహాయ పోలీసు కమిషనర్(ఆర్థిక నేరాలు) వికె పర్మార్ తెలిపారు. రూ. ఒక్కో గుర్తింపు కార్డుకు 15 నుంచి రూ. 50 చెల్లించి ఒక వెబ్‌సైట్ ద్వారా తన రిజిస్టర్ట్ పేరు, పాస్‌వర్డ్‌తో నకిలీ ఆధార్, పాన్ కార్డు పొందానని నిందితులలో ఒకరైన ప్రిన్స్ హేమంత్ ప్రసాద్ చెప్పినట్లు ఆయన తెలిపారు. దీని ఆధారంగా వెబ్‌సైట్‌పై దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసిన నకిలీ గుర్తింపు కార్డులను బ్యాంకు రుణాల మంజూరు, సిమ్ కార్డుల కొనుగోలుకు ఉపయోగించినట్లు ఆయన చెప్పారు.

వెబ్‌సైట్‌లో లభించిన అనేక మొబైల్ నంబర్లతో సంబంధమున్న రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందిన సోమనాథ్ ప్రమోద్‌కుమార్ అనే వ్యక్తిని ఇటీవలే సాంకేతిక నిఘా ద్వారా అరెస్టు చేసినట్లు ఎసిపి తెలిపారు. ఈ కుంభకోణంలో ఇతనే కీలక పాత్రధారిగా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. వెబ్‌సైట్‌ను సృష్టించిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్‌కు చెందిన ప్రేమ్‌వీర్‌సింహ్ ఠాకూర్‌ను కూడా కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు.

గత రెండేళ్లలో దాదాపు 2 లక్షల నకిలీ గుర్తింపు కార్డులను తయారుచేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. ఈ వెబ్‌సైట్ గత మూడేళ్లుగా పనిచేస్తోందని, 5వ తరగతి మాత్రమే చదువుకున్న సోమనాథ్‌కు కొందరు వ్యక్తులు సాంకేతిక సహాయం అందచేస్తున్నారని ఎసిపి తెలిపారు. ఈ కుంభకోనం ఇంకా చాలామంది వ్యక్తులు ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రమోద్‌కుమార్, అతని తల్లి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 25 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News