Thursday, January 23, 2025

మణిపూర్‌లో అదృశ్యమైన విద్యార్థుల దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాల ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లర్లు, ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను గతవారం మణిపూర్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ క్రమం లోనే సోమవారం నుంచి ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించినట్టు ఒక ఫోటోలో ఉండగా, వారి వెనుక ఇద్దరు సాయుధులు కన్పించారు. పొదల మధ్యలో విద్యార్థుల మృతదేహాలను పడేసిన మరో ఫోటో కూడా వైరల్ అయింది.

దీంతో ఈ ఘటన మరోసారి దుమారం రేపింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు, మైతేయ్ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్టు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు. జులై 6న ఆంక్షలు సడలించడంతో అమ్మాయి నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు సద్దు మణిగాయని భావించిన ఆమె, తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడ లేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపం లోని నంబోల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీస్‌లు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే సిబిఐ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు మణిపూర్ ప్రభుత్వం తమ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మణిపూర్ ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య మణిపూర్‌లో ఇంటర్నెట్ ఆంక్షలను సడలించినప్పుడు కూడా ఇద్దరు మహిళలపై జరిగిన అమానుషం వెలుగు లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆ ఘటనపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. వీటితోపాటు అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న మరో 9 హింసాత్మక ఘటనలను సీబీఐ విచారిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News