మరింత ముదిరిన పుదుచ్చేరి సంక్షోభం
పాలక కూటమికి చెందిన మరి ఇద్దరు ఎంఎల్‌ఎలు రాజీనామా
కాంగ్రెస్-డిఎంకె ప్రభుత్వం బలపరీక్ష నేడే
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో కాంగ్రెస్ డిఎంకె సంకీర్ణ ప్రభుత్వం మరింత సంక్షోభంలో పడింది. అధికార పక్షానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. దీనితో ముఖ్యమంత్రి వి నారాయణస్వామికి అసెంబ్లీలో బలపరీక్షకు ఒక్కరోజు ముం దు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె లక్ష్మినారాయణన్, డిఎంకె ఎమ్మెల్యే వెంకటేశన్‌లు ఇప్పుడు రాజీనామాలు సమర్పించారు. దీనితో అసెంబ్లీలో అధికార కూటమి బలం 11కు పడిపోయింది. 33మంది సభ్యుల అసెంబ్లీలో ప్రతిపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ విపి శివకోలుంధుకు నివాసంలో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు ఆదివారం రాజీనామాలు సమర్పించారు. అధికార పక్షానికి సభలో మద్దతు పోయిందని తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మినారాయణన్ చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తున్నట్లు, డిఎంకెలోనే కొనసాగనున్నట్లు ఆ పార్టీకి చెందిన వెంకటేశన్ విలేకరులకు తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రులు మల్లాది కృష్ణారావు, ఎ నమాశ్శివాయమ్ సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. మరో లెజిస్లేటర్ అనర్హత వేటుకు గురయ్యారు. సిఎం అత్యంత విధేయుడు ఎ జాన్‌కుమార్ కూడా ఈ వారం రాజీనామా చేశారు. సిఎం అసెంబ్లీలో ఈనెల 22న విశ్వాస పరీక్షకు దిగాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశించారు. తెలంగాణ గవర్నర్ అయిన తమిళసై అదనంగా పుదుచ్చేరి గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిసున్నారు.
2 more MLAs resigns before floor test in Puducherry