శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం సైన్యానికి చెందిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీపై దాడి చేసేందుకు కుట్రపన్నిన ఇద్దరు స్థానిక జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు శుక్రవారం తెల్లవారుజామున పట్టాన్‌లోని యెడిపురా ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారని బారాముల్లా ఎస్‌ఎస్‌పి రయీస్ భట్ తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని ఆయన చెప్పారు. గురువారం పట్టాన్‌లోని హైదర్‌బేగ్‌లో ముగిసిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీపై దాడికి ఈ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసిందని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఎకెఎస్ 74యు రైఫిల్‌తోపాటు మూడు మ్యాగజైన్లు, ఒక పిస్టల్, ఒక పిస్టల్ మ్యాగజైన్, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
2 Terrorists killed in Encounter in Baramulla District