భగ్నం చేసిన యుపి ఎటిఎస్ పోలీసులు
అల్‌ఖైదాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
విదేశీ తుపాకులు, పెద్ద మొత్తంలో పేలుడు సామగ్రి స్వాధీనం
లఖ్నో: లఖ్నోసహా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు నగరాల్లో సీరియల్ బాంబు పేలుళ్లకు అల్‌ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వత్‌ఉల్‌హింద్ చేసిన భారీ కుట్రను యుపి ఎటిఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఆ ముఠాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు ఆ రాష్ట్ర పోలీస్ ఎడిజి(శాంతి,భద్రతలు) ప్రశాంత్‌కుమార్ తెలిపారు. లఖ్నోసహా పలు చోట్ల బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు ఆయన తెలిపారు. దీంతో, హర్దోయి, సీతాపూర్, బారాబంకీ, ఉన్నావో, రాయ్‌బరేలీ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో లఖ్నో కాకోరీ ప్రాంతంలోని రెండు ఇండ్లపై యుపి యాంటీ టెర్రరిజమ్ స్కాడ్(ఎటిఎస్) దాడులు నిర్వహించగా ఈ ఉగ్ర కుట్ర వెలుగు చూసింది. ఎటిఎస్ పోలీసుల దాడుల్లో మసీరుద్దీన్, మిన్హాజ్ అనే ఉగ్రవాదులు పట్టుబడగా, మరో ఐదుగురు తప్పించుకున్నారు.
అల్‌ఖైదా యుపి విభాగానికి చెందిన ఉమర్ హల్‌మందీ ఈ ఉగ్ర ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్టు ప్రశాంత్‌కుమార్ తెలిపారు. హల్‌మంది తన ఉగ్ర కార్యకలాపాలను పాకిస్థాన్‌ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని క్వెట్టా, పెషావర్ ప్రాంతాల నుంచి కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆగస్టు 15న లఖ్నోతోపాటు యుపిలోని పలు నగరాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు ఆయన వెల్లడించారు. విదేశీ తుపాకులు, రెండు ప్రెషర్ కుక్కర్ బాంబులు, పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు లఖ్నో చుట్టుపక్కల జిల్లాల్లో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.
ఆది, సోమవారాల్లోనే (11,12 తేదీల్లో) లఖ్నోసహా పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారని మరో అధికారి, ఎటిఎస్ ఐజి జికె గోస్వామి తెలిపారు. సీరియల్ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు గోస్వామి తెలిపారు. వీరికి కాశ్మీర్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్నారు. ఉగ్రవాదులు చాలా కాలంగా స్లీపర్ సెల్స్‌గా ఉంటూ ఇప్పుడు తమ కార్యకలాపాల్ని విస్తరించే యత్నాల్లో ఉన్నారని ఆయన తెలిపారు. అనుమానితులపై మరిన్ని దాడులు కొనసాగుతాయన్నారు.