Saturday, January 18, 2025

హిమాచల్‌లో ఇద్దరు ట్రెక్కర్ల మృతి.. మృతదేహాలకు శునకం కాపలా

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని బీర్ బిల్లింగ్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు రోజుల పాటు వారి ఆచూకీ తెలియలేదు. అయితే వారి మృతదేహాలను పోలీసులు గుర్తించేంత వరకు 48 గంటల పాటు ఒక శునకం వాటిని కాపలా కాసింది. మరణించిన ట్రెక్కర్లను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన అభినందన్ గుప్తా(30) మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రణీతా వాలా(26)గా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ మంచుకొండలపై నుంచి జారిపడి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే పోస్టు మార్టం నివేదికలో వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు చెప్పారు. సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉండే బీర్ బిల్లింగ్ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ చేసే పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. కాగా..అభినందన్ గుప్తా గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలోనే ఉంటూ పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని కంగ్రా జిల్లా పోలీసు అధిపతి వీర్ బహదూర్ తెలిపారు. ప్రణీత వాలా కొద్ది రోజుల క్రితమే ఇక్కడకు వచ్చారని, హిమపాతాన్ని చూసేందుకు బయల్దేరారని ఆయన తెలిపారు.

ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మొత్తం నలుగురు ఒక బృందంగా బయల్దేరారని ఆయన చెప్పారు. ఒక ప్రదేశం వద్ద నుంచి కారు ముందుకు సాగలేదని, దీంతో వారు నడక సాగించారని ఆయన చెప్పారు. వాతావరణం మారిపోవడంతో బృందంలోని ఇద్దరు వ్యక్తులు వెనుదిరిగి కారు వద్దకు చేరుకున్నారని, అభినందన్ గుప్తా, ప్రణీత ముందుకు సాగారని ఆయన తెలిపారు. తనకు ఈ మార్గం బాగా తెలుసునని ఆమెకు గుప్తా చెప్పాడని, ప్రణీతతోపాటు శునకం కూడా గుప్తా వెంట ఉన్నారని ఆయన వివరించారు. గుప్తా, ప్రణీత ఎంతకూ తిరిగి రాకపోవడంతో బృందంలోని ఇతరులు పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. వారిద్దరి కోసం రెండు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. పారాగ్టైడర్లు టేకాఫ్ అయ్యే ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో వారిద్దరి మృతదేహాలు లభించినట్లు ఆ అధికారి తెలిపారు.

ఆ మృతదేహాలకు 18 గంటలకు పైగా ఆ శునకం మొరుగుతూ ఇతర జంతువులు ఏవీ దగ్గరకు రాకుండా కాపలా కాసిందని పోలీసులు తెలిపారు. కంగ్రా జిల్లాలో హిమపాతం అధికంగా ఉందని, వాతావరణం కూడా వేగంగా మారిపోతూ ఉందని సీనియర్ పోలీసు అధికారి బహదూర్ తెలిపారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు స్థానికుడు లేదా గైడ్ సహాయంతో మాత్రమే బయటకు వెళ్లాలని ఆయన సూచించారు. రోడ్లు కూడా మంచులో మూసుకుపోతున్నాయని, మార్గాన్ని గుర్తించడం పర్యాటకులకు అసాధ్యమని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందువల్ల సెల్ ఫోన్లు కూడా పనిచేయవని, వాతావరణ అనుకూలంగా లేనపుడు బయటకు వెళ్లడం మానుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News