Friday, December 20, 2024

పోలీసులే మమ్మల్ని అల్లరిమూకకు వదిలేశారు!

- Advertisement -
- Advertisement -

గౌహతి: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికి పోతున్న మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించడమే కాకుండా లైంగిక దాడికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన బుధవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. గురువారం ఈ ఘటన అటు పార్లమెంటుతో పాటుగా ఇటు సుప్రీంకోర్టును కూడా కుదిపేసింది. అయితే పోలీసులే తమను అల్లరి మూకలకు వదిలేసి వెళ్లిపోయారని దాడికి గురయిన బాధిత మహిళల్లో ఒకరు ఒక జాతీయ దినపత్రికకు తెలిపారు. బాధిత మహిళల్లో ఒకరు 20 ఏళ్ల యువతి కాగా మరొకరు 40 ఏళ్ల మహిళ. ఈ ఇద్దరు మహిళలను అల్లరిమూక నగ్నంగా రోడ్డుపైన, అటు తర్వాత ఓ పంటపొలం వైపుగా నడిపిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. కొంతమంది ఇద్దరు మహిళలను పంటపొలం వైపు బలవంతంగా లాగుతున్నట్లు, వారిని బలవంతంగా ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది.

అంతేకాదు, ఇరవై ఏళ్ల యువతిపై పట్టపగలు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మే 18న పోలీసులకు వారు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. మే 3వ తేదీన మణిపూర్‌లో అల్లర్లు మొదలయ్యాయి. ఆ రోజు కకాంగ్‌పోక్రి జిల్లాలోని తమ గ్రామంపై జనం గుంపు దాడి చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం తాము అడవిలోకి పారిపోయామని, ఆ తర్వాత తౌబల్ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు తమను కాపాడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తూ ఉండగా పోలీసు స్టేషన్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో వందలాది మంది జనం మధ్యలో అడ్డగించి పోలీసులనుంచి తమను బలవంతంగా తమ అధీనంలోకి తీసుకున్నారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తమ గ్రామంపై దాడి చేసిన గుంపులో పోలీసులు కూడా ఉన్నారని, పోలీసులు తమను దగ్గర్లో ఉన్న ఓ ఇంటినుంచి గ్రామానికి కొద్ది దూరానికి తీసుకెళ్లి రోడ్డుపైన జనం గుంపుకు అప్పగించి వెళ్లిపోయారని,

పోలీసులే తమను గుంపునకు అప్పగించారని తన భర్త ఇంటినుంచి ఫోన్‌లో ఆ పత్రికతో మాట్లాడిన ఇరవై ఏళ్ల యువతి చెప్పింది. తాము అయిదుగురం ఉన్నామని, తమతో ఉన్న మరో మహిళను కూడా బట్టలూడదీయించారని, ఇరవై ఏళ్ల యువతి తండ్రి, సోదరుడ్ని అల్లరి మూక చంపేసిందని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. మగవాళ్లందరినీ చంపేసిన తర్వాత జనం తాము చేయాల్సినదంతా చేసేశాక, తమను అక్కడే రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారని ఆ బాధిత యువతి తెలిపింది. ఈ సంఘటనను చిత్రీకరించిన వీడియో ఉన్నట్లు తనకు, తన కుటుంబానికి తెలియదని కూడా ఆ యువతి తెలిపింది. మణిపూర్‌లో ఇంటర్‌నెట్ లేకపోవడంతో తమకు ఈ వీడియో గురించి తెలియదని ఆమె చెపింది. దాడికి పాల్పడిన వారు చాలా మంది ఉన్నారని, వారిలో కొంతమందిని మాత్రమే తాను గుర్తు పట్టగలిగానని, వారిలో తన సోదరుడికి స్నేహితుడయిన వ్యక్తి ఒకరని ఆమె చెప్పింది.
మణిపూర్‌లో భారీ నిరసన ర్యాలీ
కాగా ఈ ఘటనపై మణిపూర్‌లో గురువారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. చురచంద్‌పూర్‌లో వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ర్యాలీలో చేపట్టారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఒకరి అరెస్టు
కాగా ఘటన జరిగిన రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలకు దారి తీయడంతో ప్రభుత్వం, పోలీసులు కూడా దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ధ్రువీకరించగా, దాడికి పాల్పడిన మరికొంతమందిని అరెస్టు చేయడానికి ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు గురువారం మధ్యాహ్నం చెప్పారు. అయితే మే నెలలో కేసు నమోదయినప్పటికీ రెండున్నర నెలలుగా పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News