ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమంటే మాటలు కాదు. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే చాలదు… అక్కడి వాతావరణ పరిస్థితులపై అవగాహన ఉండాలి. హిమపాతాలకు, చలిగాలులకు తట్టుకుని ముందడుగు వేయాలి. ఇంత కష్టమైన ఎవరెస్ట్ అరోహణలో ఓ చిన్నారి రికార్డు సృష్టించింది. ఆ చిన్నారి పేరు సిద్ధి మిశ్రా. ఆమె వయసు రెండున్నరేళ్లే కావడం విశేషం. సిద్ధి మిశ్రా తన తల్లి భావనా దేహరియాతో కలసి లుక్లా అనే గ్రామం నుంచి పది రోజులపాటు 53 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకుని, రికార్డు సృష్టించింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉంటుంది.
సిద్ధిమిశ్రా తల్లి భావన 2019లో ఎవరెస్ట్ ను అధిరోహించారు. తన కూతురుతో కలసి బేస్ క్యాంప్ చేరుకోవడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్న భావన, తమ సాహస కృత్యాన్ని బేటీ బచావ్ బేటీ పఢావ్ కార్యక్రమానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు.