Saturday, November 23, 2024

మృత్యుంజయుడు ఆ రెండేళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

విజయపుర(కర్నాటక): బోరు బావిలో పడిపోయిన ఒక రెండేళ్ల బాలుడిని సహాయక సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి సురక్షితంగా వెలుపలికి తీశారు. మృత్యుంజయుడిగా విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాకు చెందిన లచ్యన గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను కలిగించింది. సాత్విక్ సతీష్ ముజగోండ్ అనే రెండేళ్ల బాలుడు బుధవారం సాయంత్రం తెరచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు.

16 అడుగుల లోతున బాలుడు చిక్కుకుని ఉన్నట్లు గుర్తించిన సహాయక సిబ్బంది బుధవారం సాయంత్రం నుంచి సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ బోరు బావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వి బాలుడిని 16 అడుగుల లోతు నుంచి రక్షించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నంత సేపు బాలుడి ఏడుపు లోపలి నుంచి వినిపిస్తూనే ఉంది. బోరు బావి నుంచి వెలుపలికి తీసిన వెంటనే ఆ బాలుడిని అక్కడే నిలిపి ఉన్న అంబులెన్సులోకి తరలించి వైద్య బృందం చేత పరీక్షలు చేయించారు.

బాలుడి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇండిలోని ప్రభ్తువ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు. బోరు బావిలో పడిన బాలుడు సురక్షితంగా బయటపడడం పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని సురక్షితంగా వెలుపలికి తీయడ కోసం శ్రమించిన సహాయక సిబ్బందిని ఆయన అభినందించారు. తమ కుమారుడిని కాపాడిన సహాయక సిబ్బందికి ఆ బాలుడి తల్లిద్రంపలు కృతజ్ఞతలు తెలిపారు. ఖాళీగా వదిలేసిన ఆ బోరు బావిని మంగళవారం నాడే ఎవరో తవ్వి వదిలేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News