ఐఐటి ఖరగ్‌పూర్ ఎఐ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని మొత్తం భూభాగంలో దాదాపు 20 శాతం భూగర్భ జలాల్లో విషతుల్యమైన ఆర్సెనిక్ స్థాయిలు నిండి ఉన్నాయని దీనివల్ల దేశం లోని 250 మిలియన్ కన్నా ఎక్కువ మంది విషప్రభావానికి గురవుతున్నారని ఐఐటి ఖరగ్‌పూర్ అధ్యయనం వెల్లడించింది. కృత్రిమ మేథో పరిజ్ఞానం ఆధారంగా ఈ అధ్యయనాన్ని అంచనా వేశారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం అత్యధిక శాతం ఆర్సెనిక్ విస్తరించిన జోన్లు, దీనికి గురవుతున్న జనాభా, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నివేదికలు ఇవన్నీ వీరు పరిశీలించారు. ఆర్సెనిక్ తన కర్బనేతర రూపంలో అత్యంత విషపూరితమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. తాగే నీటిలో లేదా పదార్థాలలో సుదీర్ఘకాలం ఇది వ్యాపించి ఉంటే క్యాన్సర్, చర్మ వ్యాధులు ఇతర అనారోగ్య లక్షణాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ వివరించింది. అయితే ప్రస్తుత అధ్యయనం ఈ ఆర్సెనిక్ అత్యధిక శాతం ఉన్న ఏరియాలు సింధుగంగబ్రహ్మపుత్ర నదీలోయలో విస్తరించి ఉన్నాయని వివరించింది.
రాష్ట్రాల వారీగా చూస్తే పంజాబ్‌లో 92 శాతం, బీహార్‌లో 70 శాతం, పశ్చిమబెంగాల్‌లో 69 శాతం, అసోంలో 48 శాతం, హర్యానాలో 43 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 28 శాతం, గుజరాత్‌లో 24 శాతం, వరకు భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ విస్తరించింది. మధ్యప్రదేశ్(9 శాతం), కర్నాటక (8 శాతం),ఒడిశా (4 శాతం), మహారాష్ట్ర (1 శాతం), జమ్ముకశ్మీర్ ఆగ్నేయ ప్రాంతం (1 శాతం), వరకు అక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లోను ఆర్సెనిక్ కనిపిస్తోంది. భూగర్భ జలాలను వ్యవసాయానికి విపరీతంగా తోడివేయడం, ప్రాంతీయ భూగర్భతత్వం ఈ ఆర్సెనిక్ విస్తరించడానికి కారణమౌతోందని ఖరగ్‌పూర్ ఐఐటి అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ప్రస్తుతం 80 శాతం తాగునీటికి భూగర్భ జలాలే ఆధారం కాగా, ఇదివరకటి అధ్యయనాలు దాదాపు 90 మిలియన్ జనాభా భూగర్భ జలాల పైనే ఆధార పడి ఉన్నారని వీరంతా ప్రత్యక్షంగా, అప్రత్యక్షంగ ఆర్సెనిక్ విష ప్రభావానికి గురవుతున్నారని వెల్లడించాయి. ఆర్సెనిక్ పీడిత ప్రాంతాల్లో సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించేలా ప్రభుత్వ విధానాలు రూపొందించడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని పరిశోధకులు వివరించారు.