Monday, December 23, 2024

స్వర్ణయుగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధ్యక్షతన జరిగిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడారు.

ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమిష్టి కృషితో గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామీణ నేపథ్యం కలిగి ఉండడం వల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెల ప్రగతికి కావాల్సిన వనరులు, వసతుల గురించి లోతైన ఆలోచనలతో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, హరితహారం అమలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికి శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని కేంద్రం అందించే అవార్డులు తెలంగాణకు కోకొల్లలుగా వరిస్తున్నాయని మంత్రి కెటిఆర్ హర్షం వెలిబుచ్చారు.
* తెలంగాణను 79 జాతీయ గ్రామీణ అవార్డుల వరించాయి..
2015 నుండి 2022వ సంవత్సరం వరకు ఏకంగా తెలంగాణ రాష్ట్రం 79 జాతీయ గ్రామీణ అవార్డులను సాధించిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. 2022లో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయని గుర్తు చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలోనూ తెలంగాణ రాష్ట్రమే అగ్రతాంబూలం దక్కించుకుందన్నారు. పక్కా ప్రణాళిక, సునిశిత పర్యవేక్షణ, సమర్థవంతమైన పాలన యంత్రాంగం, పకడ్బందీ చట్టాల అమలు వల్లే తెలంగాణలో సమీకృత, సమ్మిళిత అభివృద్ధి వేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేశారు.

పర్యావరణంతో పాటు పరిశ్రమలు, పల్లె ప్రగతి తో పాటు పట్టణ ప్రగతి, వ్యవసాయ విస్తరణతో పాటు ఐటీ ఎగుమతులు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తేల్చి చెప్పారు. అభివృద్ధిలో అగ్రగామిగా, అవినీతిలో అట్టడుగున ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రశంసలు అందుకుంటోందని, సర్వేలు ఈ విషయాన్ని చెబుతున్నాయన్నారు.
* పల్లె ప్రగతి కింద 14వేల 235 కోట్ల వ్యయం..
పల్లె ప్రగతి కార్యక్రమం కింద తెలంగాణలో ఇప్పటి వరకు 14వేల 235 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని మంత్రి కెటిఆర్ వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించిన అనంతరం తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,000 ఉండగా, అది నేడు మూడు రెట్లు పెరిగి మూడు లక్షల 17 వేల కు పెరిగిందన్నారు. రైతుబంధు అమలుతో వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగిందన్నారు. 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
* అధికార వికేంద్రీకరణతో పాలన సౌలభ్యం..
అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయవచ్చని 8796 పంచాయతీలను 12,769కి పెంచడం జరిగిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొత్త పంచాయతీల ఏర్పాటుతో గిరిజన తండాలు గూడెం వాసుల దశాబ్దాల కాలం నాటి స్వయంపాలన కల నెరవేరిందన్నారు. పది జిల్లాలను 33 జిల్లాలకు, 68 మున్సిపాలిటీలను 142 మున్సిపాలిటీలుగా చేశామని, కొత్తగా 50 రెవెన్యూ డివిజన్లు 140 మండలాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదెంచెల పరిపాలన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తెరిగి సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

తమ భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే రీతిలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ దిశగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమర్థవంతమైన నాయకత్వం వహించేలా, వారి బాధ్యతలను, విధులు, అధికారాలను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకునేలా శిక్షణ తరగతులు నిర్వహించాలని మంత్రి కెటిఆర్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించారు.
* ఉత్తమ అవార్డులు సాధించిన గ్రామాలను ప్రోత్సాహిద్దాం..
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించిన గ్రామ పంచాయతీలకు కనీసం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయల చొప్పున అదనపు నిధులు కేటాయిస్తే బాగుంటుందని మంత్రి కెటిఆర్ సిఫార్సు చేశారు. దీనివల్ల అవార్డులు సాధించిన పాలకవర్గాలను ప్రోత్సహించినట్లు అవుతుందని, ఇతరులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.అవార్డులు గెలుస్తున్న గ్రామాలకు ప్రోత్సాహకాలు… ఇస్తే బాగుంటుందన్నారు. గ్రామ పంచాయతీలకు 707 కోట్లు విడుదల చేసినమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు తెలిపారు.

ఫ్రీజింగ్ లో పెట్టిన 250 కోట్ల నిధులను కూడా విడుదల అయ్యేట్లు చేస్తామన్నారు. ఈ పంచాయతీల కోసం 12,769 గ్రామ పంచాయతీలకు కొత్త కంప్యూటర్లు అందజేస్తామన్నారు. కరోనా కారణంగా లక్ష కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నారు. కేంద్రం, మన రాష్ట్రంపై శత్రు దేశం మీద లాగా అనేక ఆంక్షలు విధిస్తున్నది. ఎన్నో రకాల బాధలు భరించుకుంటూ పోతున్నామని వెల్లడించారు.
* కేంద్రానికి సమానంగా రాష్ట్ర నిధులు : ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కెసిఆర్ పాలనలో పల్లెల్లో తొంభై శాతానికి పైగా పాలనా వ్యవస్థ మెరుగుపరచడం జరిగినదని అన్నారు. ప్రధానంగా కృష్ణ, గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చి ఇంటింటికి రక్షిత మంచినీటిని అందిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. ఫలితంగా మిగులు నిధులు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగించే వెసులుబాటు కలిగిందన్నారు. కేంద్రం కేటాయిస్తున్న నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుండడంతో తెలంగాణ పల్లెలు అన్ని మౌలిక సదుపాయాలను సంతరించుకుంటూ, జాతీయ అవార్డులను సాధిస్తున్నాయని తెలిపారు. ఉపాధి హామీని రద్దు చేసే కుట్ర కేంద్రం చేస్తోందన్నారు.

15 కోట్ల పనిదినాలను 6 కోట్లకు కుదించిందన్నారు. గ్రామాల పురోగతి కోసం గత ప్రభుత్వాలు 12వేల 173 కోట్ల ఖర్చు చేస్తే, 8 ఏండ్లల్లోనే తెలంగాణ ప్రభుత్వం 60వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో జాతీయ అవార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెస్తే… ప్రపంచంలోని అవార్డుల మంత్రి కెటిఆర్ చొరవతో వస్తున్నాయన్నారు. నిజాయితీగా పనిచేస్తూ కష్టపడితే ఆశించిన ఫలితం తప్పక దక్కుతుందని నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాల ప్రాతిపదికన ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన పాలకవర్గాలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అట్టహాసంగా అవార్డులను అందజేశారు.

కార్యక్రమంలో వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, పంచాయితీ సెక్రటరీలు, ఎంపిడివోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
* జాతీయ పంచాయతీ అవార్డుల అందుకున్న గ్రామాల జాబితా..
01. పేదరికం లేని జీవనోపాధులు మెరుగుపర్చిన పంచాయతీ (పిఎఫ్‌ఈఎల్‌పి) : మార్లవాయి ( జైనూర్, ఆసిఫాబాద్), మండొడ్డి ( జోగులాంబ గద్వాల్ ), సోలీపూర్ (ఘన్‌పూర్, వనపర్తి).
02. ఆరోగ్యకరమైన పంచాయతీ (హెచ్‌పి) : మరియాపురం ( గీసుగొండ, వరంగల్ ), గౌతంపూర్ ( చుంచుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం), ముజ్గి,(నిర్మల్).
03. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ (సిఎఫ్‌ఫి): అల్లాపూర్ (తాడూర్, నాగర్ కర్నూల్ ), హరిదాస్‌పూర్ (కొండాపూర్, సంగారెడ్డి), శ్రీనివాస్‌నగర్ ( మిర్యాలగూడ).
04.సమృద్ధి నీరు పంచాయతీ (డబ్లూఎస్‌పి) : కుకూనూర్ (వేల్పూర్, నిజామాబాద్), మజీద్‌పూర్ (అబ్దుల్లాపూర్‌మెట్, రంగారెడ్డి), నెల్లుట్ల (లింగాలఘనపూర్, జనగాం), చాప్లా తండా (డోర్నకల్, మహబూబాబాద్), వెల్చాల (రామడుగు, కరీంనగర్), కామారెడ్డిగూడెం (దేవరుప్పుల, జనగాం).
05. క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ (సిజిపి) : ముక్రా (కె)(ఇచ్చోడ, ఆదిలాబాద్), పర్లపల్లి (తిమ్మాపూర్ ఎల్‌ఎండి, కరీంనగర్),సుల్తాన్‌పూర్ (పెద్దపల్లి).
06. స్వయం సమృద్ధిలో మౌలిక సదుపాయాలు పంచాయతీ(ఎస్‌ఎస్‌ఐపి) : గంభీరావుపేట ( రాజన్న సిరిసిల్ల), యెల్లంకి (రామన్నపేట, యాదాద్రి భువనగిరి), మూడుచింతలపల్లె (మేడ్చల్ మల్కాజిగిరి). మల్లంపల్లి (ములుగు), దొంగల ధర్మారం (రామాయంపేట, మెదక్), తిమ్మాపూర్ (కరీంనగర్).
07. సామాజికంగా సురక్షితం పంచాయతీ (ఎస్‌ఎస్‌పి) : కొంగట్‌పల్లి (హన్వాడ, మహబూబ్‌నగర్), రైతునగర్ (బీర్కూర్, కామారెడ్డి),
గొల్లపల్లి (నెన్నెల్, మంచిర్యాల్ ), ముక్నూర్ (పలిమెల, జయశంకర్ భూపాలపల్లి).
08. పంచాయతీ విత్ గుడ్ పాలన (పిడబ్లూజిజి) : చీమలదరి (మోమిన్‌పేట్, వికారాబాద్), పాలైరు (కూసుమంచి,ఖమ్మం), చిప్పల్తుర్తి (నర్సాపూర్, మెదక్), ఖానాపూర్ (మక్తల్, నారాయణపేట).
09. స్త్రీలకు అనుకూల పంచాయతీ (డబ్లూఎఫ్‌పి) : ఇర్కోడ్ (సిద్దిపేట ),ఐపూర్ (ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట), హిమ్మత్‌రావుపేట (కొడిమ్యాల్, జగిత్యాల), పెంచికలపేట (ఆత్మకూర్, హనుమకొండ), మోహినికుంట (ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల).
** ప్రత్యేక కేటగిరీ అవార్డులు
* కార్బన్ తటస్థ విశేష పంచాయతీ పురస్కార్ (సిఎన్‌విపిపి) : కన్హా (నందిగామ, రంగారెడ్డి),ముక్రా (కె) (ఇచ్చోడ, ఆదిలాబాద్),
ఇబ్రహీంపూర్ (నారాయణరావుపేట, సిద్దిపేట), నవాబుపేట (చిట్యాల్ , జయశంకర్ భూపాలపల్లి), మరియాపురం (గీసుగొండ, వరంగల్).
* గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష పంచాయితీ పురస్కార్ (జియుఎస్‌విపిపి) : కన్హా (రంగారెడ్డి), ఎర్రవల్లి (మర్కూక్, సిద్దిపేట), ముక్రా (కె) (ఇచ్చోడ, ఆదిలాబాద్), పంతంగి (చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి), బంజేరుపల్లి (నారాయణరావుపేట, సిద్దిపేట).
* పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తం సంస్థాన్ పురస్కారం (పికెఎన్‌ఎస్‌ఎస్‌పి) : టిఎస్‌ఐఆర్‌డి, హైదరాబాద్, ఈటిసి రాజేంద్రనగర్, ఈటిసి హసన్‌పర్తి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News