మనతెలంగాణ/హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి ఉదయం 1,67,780క్యూస్కెక్కులు చేరుతున్న వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రాజెక్టు 20 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తివేశారు. ఎగువ నుంచి 2.10లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, గేట్ల ద్వారా 1.65లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలిపెడుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు16వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 1.47లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు నుంచి 1.58లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1.47లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.38లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 1.71లక్షల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో వరద ప్రవాహం నికలడగా కొనసాగుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 24718 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అంతే నీటిని ప్రాజెక్టు నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 58,420క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 59384క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
20 Gates of Nagarjuna Sagar Project lifted