చెన్నై : తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న వారిని డైరెక్టరేట్ ఆఫ్‌రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు అరెస్టు చేసి వారి నుంచి 20 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.12.5 కోట్లు ఉంటుందని అంచనా. సోమవారం మూడు వేర్వేరు సంఘటనల్లో ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ప్రకటనలో తెలిపారు.
శ్రీలంక నుంచి ఫిషింగ్ బోట్‌లో తంగచిమడం ( రామనాథపురం లో ) ద్వారా విదేశీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దాన్ని అక్కడే డెలివరీ చేస్తారని అధికారులు తెలుసుకుని గట్టి నిఘా ఉంచారు. తంగచిమడం ఉత్తర తీరానికి సమీపంలో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.37 కోట్ల విలువైన 9.063 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే డీఆర్‌ఐ అధికారుల బృందం సోమవారం షార్జా నుంచి కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసి వారి నుంచి 5.17 కిలోల బంగారం సీజ్ చేసింది.
ఈ బంగారం విలువ రూ. 3. 17 కోట్లు ఉంటుంది. ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. అలాగే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల సుమారు రూ. 3.8 కోట్ల విలువైన 6.275 కిలోల బంగారం పేస్ట్ తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. జనవరి నుంచి ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 29 కేసుల్లో 163 కిలోల బంగారం సీజ్ చేశామని, దీని విలువ రూ.97 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.