Thursday, December 19, 2024

పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం .. 20 మంది పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

జార్జ్‌టౌన్: దక్షిణ అమెరికాలోని గయానాలో పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు 20 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. రాజధాని జార్జ్‌టౌన్‌కు దక్షిణ దిశగా 320 కిమీ దూరంలో నైరుతి సరిహద్దులో గల సెకండరీ స్కూలు వసతి గృహంలో ఈ ప్రమాదం సంభవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. అర్ధరాత్రి తరువాత ప్రారంభమైన ఈ ప్రమాదం 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల్ని బలిగొందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జెరాల్డ్ గౌవియా పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం అప్పుడే చెప్పలేమని, కారణాలపై ఆరా తీస్తున్నామని ఆ ప్రాంతంలో భారీ తుపాను గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయని చెప్పారు.

ప్రభుత్వం, అత్యవసర సహాయ బృందాలు, పైలట్లు సాహసంతో రంగం లోకి దిగి బాధితులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాలికల వసతి గృహంలో మొదట మంటలు చెలరేగాయని స్థానిక వార్తాపత్రిక స్టాబ్రోయెక్ పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు సమగ్రంగా జరగాలని విపక్ష పార్లమెంట్ సభ్యులు నటషా సింగ్ లూయిస్ డిమాండ్ చేశారు.ఈ ఘోర ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నామని, ఇలాంటి విషాద సంఘటన భవిష్యత్తులో మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సంఘటనపై దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక మంది విద్యార్థులు స్థానికంగా చికిత్స పొందుతున్నారని, ఏడుగురిని రాజధాని ఆస్పత్రులకు తరలించామని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News