ఎల్వివ్ : రెండో ప్రపంచ యుద్ధం తరువాత నేలపై సాగుతున్న భారీ భీకర రష్యా యుద్ధంలో ముట్టడైన రెండు నగరాలను విడిచిపెట్టి శరణార్థులు మంగళవారం నుంచి భారీ ఎత్తున వలసలు ప్రారంభించారు. వలస జనం రద్దీతో కిక్కిరిసిన బస్సులు రక్షిత కారిడార్ల ద్వారా గమ్యానికి బయలు దేరాయి. ఇంతవరకు ఉక్రెయిన్ నుంచి 20 లక్షల వరకు శరణార్థులు వెళ్లినట్టు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముట్టడైన నగరాల్లో ఆహారం, నీరు, మందులు అన్నిటికీ కరువై జనం అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్ లోని తూర్పునగరం సుమీ నుంచి మంచుతోదట్టంగా ఉండే రోడ్డు మీదుగా బస్సులు వెళ్తున్నాయని, అలాగే మరో దక్షిణ ముట్టడి రేవు పట్టణం మెరియుపోల్ నుంచి జనం కదిలివెళ్తున్నారని అధికారులు వివరించారు. సుమీలో గ్రీన్ కారిడార్ కేటాయించడంతో తరలింపు మొదటి దశ ప్రారంభమైందని ఉక్రెయిన్ కమ్యూనికేషన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక్కడి నుంచి బస్సులు ఉక్రెయిన్ లోని ఇతర నగరాలకు వెళ్తుండగా, చాలా మంది దేశాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారు. ఉక్రెయిన్ ను విడిచిపెట్టి ఇప్పుడు 20 లక్షల మంది శరణార్థులు వలస పోగా, వారిలో లక్ష మంది ఉక్రెయినేతరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితి లోని వలసల విభాగం అధికార ప్రతినిధి సఫా ఎంసెహ్లీ పేర్కొన్నారు.