బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో భారీ వర్షాల కారణంగా 20 మంది మృతి చెందారు. 27 మంది గల్లంతయ్యారు. రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదనీరు ముంచెత్తడంతో రైల్వేస్టేషన్లను మూసివేశారు. ముంపు ప్రాంతాల నుంచి బాధితులను స్కూల్ జిమ్స్‌కు, రైల్వే స్టేషన్లకు తరలిస్తున్నారు. వరద నీటికి కార్లు కొట్టుకు పోయాయి. ఇంత భారీగా వర్షాలు కురియడం బీజింగ్‌లో చాలా అరుదు. బీజింగ్‌లో సాధారణంగా పొడి వాతావరణం ఉంటుంది. అలాగే ఉత్తర చైనాలో వరదలు బాగా ముంచుకొచ్చాయి.
సీజన్ వారీగా ప్రతి వేసవిలో చైనాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈ ఏడాది కొన్ని ఉత్తర చైనా ప్రాంతాల్లో గత ఏభై ఏళ్లలో లేని విధంగా వర్షాలు భారీగా కురిశాయని చెబుతున్నారు. దేశాధ్యక్షుడు అత్యవసర స్థాయిని గుర్తించి స్థానిక ప్రభుత్వాలను అందరూ బాధితుల సహాయ కార్యక్రమాలను చేపట్టాలని హెచ్చరించారు. బీజింగ్ సిటీ సెంటర్ పశ్చిమ ప్రాంతంలో 27 మంది గల్లంతు కాగా, 11 మంది చనిపోయారు. హెబెయి ప్రావిన్స్‌లో మరో తొమ్మిది మంది మృతి చెందారు. దాదాపు ఐదు లక్షల మందిపై వరద ప్రభావం చూపించింది. జులై మొదటి వారంలో చాంగ్‌పింగ్ ప్రాంతంలో వరదలకు 15 మంది చనిపోగా, లియోనింగ్ ప్రావిన్స్‌లో 5590 మందిని వేరే ప్రాంతాలకు తరలించారు.