బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం
ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో తగ్గిన వరి సాగు విస్తీర్ణం
న్యూఢిల్లీ: ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం 10 12 మిలియన్ ఎకరాల మేర తగ్గనున్న నేపథ్యలో రిటైల్ ధరలు పెరగకుండా చూడడంతో పాటుగా దేశీయంగా సరఫరాలు పెంచడం కోసం కేంద్రం బియ్యం నూకల ఎగుమతులను శుక్రవారం నిషేధించింది. అలాగే ఉప్పుడు బియ్యం తప్ప బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం మేర ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూకల ఎగుమతులు అనూహ్యమైన రీతిలో గణనీయంగా పెరగడంతో పాటుగా పశువుల దాణాతో పాటుగా ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమానికి తృణధాన్యాల నూకలు తగిన మోతాదులో అందుబాటులో లేని కారణంగా నూకల ఎగుమతులను నిషేధించినట్లు కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే చెప్పారు. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న వాటికి మాత్రం ప్రభుత్వం ఈ ఆంక్షలనుంచి ఉపశమనం కల్పించింది. ఈ నెల 15 వరకు ఈ మినహాయింపులు ఉంటాయని తెలిపింది. ఇప్పటికే ట్రక్కుల్లోకి లోడింగ్ ప్రారంభమైన, నౌకాశ్రయాలకు చేరుకున్న నిల్వల ఎగుమతులను కూడా ఆంక్షల పరిధినుంచి తప్పించింది.
2021 22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 3.89 మిలియన్ టన్నుల నూకలను ఎగుమతి చేసినట్లు పాండే తెలిపారు. 2018 19 నాటి ఎగుమతులు 1.22 మిలియన్ టన్నుల ఎగుమతితో పోలిస్తే 42 రెట్లు పెరిగాయని, ఇది ఏ విధంగా చూసినా అసాధారణమని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క చైనాయే 1.58 మిలియన్ టన్లున నూకలను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత అత్యధికంగా వరి పండించే దేశమైన భారత్ గత ఏడాది 21.2 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది. ఇందులో 3.94 మిలియన్ టన్నులు బాస్మతి బియ్యం ఉన్నాయి.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో బియ్యం, గోధుమల నిల్వలు తగ్గిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గోధుమల నిల్వలు 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు ఇటీవల ఓ ఉన్నతాధికారి చెప్పారు.
బియ్యం నిల్వలు కూడా పడిపోయినప్పటికీ ఇంకా కేంద్రం విధించిన పరిమితికంటే రెండితలు ఎక్కువగా ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. ఈ నెల 2వ తేదీనాటికి ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 5.62 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో తగినంతగా వర్షాలు కురవకపోవడమే సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం. దీని ఫలితంగా ఈ ఖరీఫ్‌లో వరి దిగుబడి 10 12 మిలియన్ టన్నుల మేర తగ్గే అవకాశం ఉందని పాండే చెప్పారు. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, మొత్తం మీద మిగులు ఉత్పత్తి ఉండవచ్చని ఆయన చెప్పారు. వర్షాలు బాగా కురిసిన రాష్ట్రాల్లో దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని కూడా పాండే చెప్పారు.