Monday, December 23, 2024

సరైన సస్యరక్షణతో 20శాతం అధిక దిగుబడులు

- Advertisement -
- Advertisement -

నేటి నుంచి అంతర్జాతీయ సదస్సు

మనతెలంగాణ/హైదరాబాద్:  వ్యవసాయ రంగంలో సరైన సస్యరక్షణ చర్యలను పాటించటం వల్ల మొక్కల ఆరోగ్యం మెరుగుపడి 20శాతంపైగా అధిక దిగుబడులు ఇస్తాయని ప్లాంట్ ప్రోటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డా.బి.శరత్ బాబు తెలిపారు. భారతదేశ వ్యవసాయరంగంలో ప్రతిష్టాత్మక శాస్త్ర పరిశోధనా సంఘమైనా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(పీపీఏఐ) ఆధ్వర్యం లో మొక్కల ఆరోగ్య నిర్వహణ- ఆవిష్కరణలు -సుస్థిరత ప్రధానాంశం గా అంతర్జాతీయ సదస్సుని బుధవారం నుండి నాలుగు రోజుల పాటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు పీపీఏఐ అధ్యక్షులు డాక్టర్ బి.శరత్ బాబు తెలిపారు. మంగళవారం నాడు డా.శరత్‌బాబు అంతర్జాతీయ సదస్సు వివరాలను మీడియాకు వెల్లడించారు. పంటల సాగులో మొక్కల ఆరోగ్య సమ్రక్షణ,నిర్వహణ అత్యంత కీలకమైన అంశమని,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా చీడపీడలు,తెగుళ్ళు వల్ల పంట దిగుబడులు 20 నుంచి 40 శాతం తగ్గుతున్నాయని ఐక్యరాజ్యసమితి కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక వెల్లడించిందన్నారు.వాతావరణ మార్పులు పంటల సాగు పై గణనీయమైన ప్రభావాలని చూపుతున్నాయని,చీడపీడలు,తెగుళ్ళ ఉధృతి పెరుగుతుండటం తో పంటలకి తీవ్ర నష్టం వాటిల్లనుందని శరత్ బాబు చెప్పారు.

పంటల సాగులో చీడపీడలు,తెగుళ్ళ ప్రభావాన్ని సమర్ధవంతం గా నివారించడం,నియంత్రించడం,మొక్కల ఆరోగ్య నిర్వహణ,ఆవిష్కరణలు సుస్థిరత ప్రధానాంశం గా ఈ అంతర్జాతీయ సదస్సు బుధవారం నుండి నాలుగు రోజుల పాటు జరగనుందని తెలిపారు.ఈ సదస్సుని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి,ఇన్ ఛార్జి ఉప కులపతి ఎం.రఘునందన రావు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీ దేవి,భారత వ్యవసాయ పరిశోధన మండలి ప్లాంట్ ప్రొటెక్షన్ ఏడీజీ డాక్టర్ సునీత్ చంద్ర దూబే,ధనూక అగ్రిటెక్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్ ఎస్ అగర్వాల్,శ్రీ బయోటెక్ ఆస్థటిక్స్ ఛైర్మన్ కే ఆర్ కే రెడ్డిలు పాల్గొంటారని ఆయన తెలిపారు. పీపీఏఐ ఏర్పాటై 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ వేడుకలు ఘనం గా నిర్వహిస్తున్నామని ప్రత్యేక పోస్టల్ కవర్,తపలా బిళ్ళని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.ఈ సదస్సులో నార్మన్ బోర్లాగ్ అవార్డు విజేత డాక్టర్ స్వాతినాయక్,ఇండోనేషియా కి చెందిన డాక్టర్ మైకేల్ తదితర్ జాతీయ,అంతర్జాతీయ నిపుణులు సుమారు 500 మంది పాల్గొంటున్నారని వివరించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపర్చిన శాస్త్రవేత్తలకి పురస్కారాలని,ఫెలో షిప్ లని ప్రధానం చేస్తామన్నారు.ఈ సదస్సు నిర్వహణకి అంగ్రూ,పీ జే టీ ఎస్ ఏ యూ,ఎన్ ఐ పీ ఏ ఎం సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయన్నారు.ఈ మీడియా సమావేశంలో డాక్టర్ జెల్లా సత్యనారాయణ,టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ సి.నరేంద్ర రెడ్డి, డా.టివికే సింగ్, డా.కట్టి, డా.వై శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News