Wednesday, January 22, 2025

యూపీ గొలుసు దొంగల కోసం 20 పోలీసు బృందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు గొలుసు దొంగలను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు 20 బృందాలను ఏర్పాటుచేశారు. వారు హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ పరిధుల్లో అనేక దొంగతనాలు చేశారు. సిసిటివిల్లో లభించిన ఫుటేజ్‌ల ఆధారంగా వారిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన పింకు, అశోక్‌లుగా గుర్తించారు. హైదరాబాద్‌లో శనివారం కేవలం మూడు గంటల వ్యవధిలోనే వారు ఏడు దొంగతనాలు చేశారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన గొలుసు దొంగతనాలలో కూడా వారి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. వారు హైదరాబాద్‌లోకి వచ్చాక బైకును దొంగిలించి మహిళలనే లక్షంగా చేసుకుని ఏడు ప్రదేశాలలో గొలుసులు దొంగిలించారు. కాగా వారు దొంగిలించిన వాహనాన్ని పారడైజ్ సమీపంలో వదిలేసిపోయారు. ఆ తర్వాత వారు రైలు ద్వారా వరంగల్‌కు పారిపోయారు. అటు నుంచి వారు ఢిల్లీ లేక ఉత్తరాదిన ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు.

స్టేషన్లలో, ఇతర ప్రదేశాలలో వారి కోసం సిసిటివి లను పోలీసులు స్కాన్ చేస్తున్నారు. వారు బెంగళూరులో కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 10 గొలుసులు దొంగిలించారు. వారు రైలు ద్వారానే హైదరాబాద్ వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వచ్చాక వారు శనివారం తెల్లవారు జామున నాంపల్లిలో మోటార్‌బైక్‌ను దొంగిలించారని సమాచారం. ఆ తర్వాత వారు మాస్కులు ధరించి ఉప్పల్ చేరుకున్నారు. రాజునగర్‌లో వారు ఉదయం 6.20కి మొదటి దొంగతనం చేశారు. కేవలం 10 కిలో మీటర్ల పరిధిలో ఏడు చోట్ల వారు మహిళలనే లక్షంగా చేసుకుని దొంగతనాలు చేశారని పోలీసులు తెలిపారు. దాదాపు 21 తులాల బంగారపు గొలుసులు వారు దొంగిలించి ఉంటారని తెలుస్తోంది.

వారి వరుస దొంగతనాలు హైదరాబాద్, రాచకొండ పోలీసులకు కునుకు లేకుండా చేశాయి. వారిని పట్టుకోడానికి పోలీసులు ఇప్పుడు 20 టీమ్‌లను రూపొందించారు. పింకు, అశోక్‌లు అలవాటు పడ్డ దొంగలని తెలిసింది. 2017లో వారిని బెంగళూరులో అరెస్టు చేశారు. కానీ వారు జైలు నుంచి విడుదలయ్యాక కూడా దొంగతనాలను కొనసాగిస్తున్నారని తెలిసింది. వారు ఏ నగరంలోనైనా కేవలం 4 నుంచి 5 గంటలే ఉండి దొంగతనాలకు పాల్పడి ఉడాయించేస్తుంటారు. ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలే వారి లక్షం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News