Wednesday, January 22, 2025

నీట్ పరీక్ష రద్దుకై సరికొత్త పిటిషన్

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి 2024 పరీక్ష రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో సరికొత్త పిటిషన్ దాఖలైంది. మే 5న నిర్వహించిన పరీక్షలో అక్రమాల ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐతో గాని, వేరే ఇతర స్వతంత్ర సంస్థతో గాని దర్యాప్తు జరిపించాలని ఆ పిటిషన్‌లో కోరారు. వైద్య ప్రవేశ పరీక్షకు హాజరైన 20 మంది విద్యార్థులు పిటిషన్‌ను దాఖలు చేశారు. సరికొత్తగా పరీక్ష నిర్వహించవలసిందని జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ)ను ఆదేశించాలని కూడా వారు పిటిషన్‌లో కోరారు. నీట్ యుజి 2024 పరీక్షలపై ఫిర్యాదులు చేసిన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తూ, పరీక్షలో ప్రశ్న పత్రం లీక్, ఇతర అక్రమాలపూ సిబిఐ దర్యాప్తు కావాలన్న వినతిపై కేంద్రం, ఎన్‌టిఎ నుంచి స్పందనలను కోరింది. ‘పెద్ద ఎత్తున అవకతవకలు, మోసపూరిత పద్ధతుల అనుసరణ’ దృష్టా తిరిగి పరీక్ష నిర్వహించడం వైద్య సంస్థల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేయడానికి వీలు కలుగుతుందని కొత్త పిటిషన్ సూచించింది.

‘మీడియా వార్తల ప్రకారం ప్రశ్న పత్రం లీకేజి కేసులు, ఎఫ్‌ఐఆర్ దాఖలు, పలువురు వ్యక్తుల అరెస్టు దృష్టా పరీక్ష పవిత్రత ప్రశ్నార్థకమైందని న్యాయవాది ధీరజ్ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌టిఎ ప్రకటించిన ఫలితాల్లో 67 మంది అభ్యర్థులు గరిష్ఠంగా 720/720 మార్కులు సాధించినట్లు వెల్లడైందని, 620 నుంచి 720 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్యలో అసాధారణ రీతిలో 400 శాతంపైగా పెరుగుదల ఉందని సునిశిత విశ్లేషణలో తేలిందని పిటిషన్ పేర్కొన్నది. ‘ప్రతిభావంతులైన విద్యార్థులు అనేక మందికి న్యాయం చేయడానికి వీలుగా సదరు అక్రమాలపై సిబిఐతో గాని, ఈ కోర్టు పర్యవేక్షణలో వేరే ఇతర స్వతంత్ర సంస్థతో గాని, కమిటీతో గాని సమగ్ర దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉంది. సక్రమంగా పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగత వైఫల్యం వల్ల అటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది’ అని పిటిషన్ తెలిపింది. ‘620, అంతకు మించి మార్కులు సాధించిన అటువంటి అభ్యర్థులు అందరి విద్యా విషయక నేపథ్యాన్ని పరిశీలించడం,

ఫోరెన్సిక్ విశ్లేషణ, దర్యాప్తుతో సహా పరీక్ష అనంతర విశ్లేషణ’ జరపాలని కోర్టు నియమించిన కమిటీని లేదా ఈ కోర్టు పర్యవేక్షణలో వేరే ఇతర స్వతంత్ర సంస్థను ఆదేశించవలసిందని పిటిషన్ కోరింది. భవిష్యత్తులో నీట్ యుజిలో మోసపూరిత విధానాలు, ప్రశ్న పత్రాల లీకేజి, బోగస్ వ్యక్తులు పరీక్ష రాయడం, అక్రమ పద్ధతులు అనుసరించడానికి సంబంధించిన ఆందోళనలను పరిహరించాలని, పరీక్ష ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత ఉండేటా సమర్థమైన చర్యలు తీసుకోవలసిందిగా ఎన్‌టిఎకు, ఇతరులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్ కోరింది. మే 5న 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్ యుజి పరీక్షకు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను ఈ నెల 14న ప్రకటిస్తారని భావించారు. కానీ సమాధాన పత్రాల మూల్యాంకనం ముండుగానే పూర్లి అయినందున ఫలితాలను ఈ నెల 4న వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News