న్యూయార్క్ : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఇటీవల 10 వేల మందిని తొలగింవచ్చనే నివేదికలు రాగా, ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే లేఆఫ్‌లు ఉంటాయని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, అమెజాన్ రాబోయే కొద్ది నెలల్లో 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. కంపెనీ పలు విభాగాల్లో ఉద్యోగులను, పలువురు టాప్ మేనేజర్లను కూడా తొలగించే అవకాశముందని సమాచారం. కంపెనీ టెక్నాలజీ, కార్పొరేట్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌తో సహా అనేక విభాగాల ఉద్యోగులు తొలగింపు జాబితాలో ఉన్నారు. తొలగింపు ఈ నెలాఖరు వరకు లేదా కొత్త సంవత్సరం తర్వాత చేయవచ్చు. కోవిడ్‌లో ఆర్థిక మాంద్యం, ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ ఈ కోతలకు సిద్ధమైందని మీడియా వర్గాలు తెలిపాయి.
కొద్ది రోజుల క్రితం అమెజాన్ సిఇఒ ఆండీ జాస్సీ కంపెనీ 2023 వరకు ఉద్యోగులను తొలగింపును కొనసాగిస్తుందని వెల్లడించారు. అయితే కంపెనీ ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందో ఆయన అప్పుడు చెప్పలేదు. అయితే నవంబర్ మధ్యలో అమెజాన్ 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని కొన్ని నివేదికలు చెప్పాయి. ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు సంఖ్య మరింత పెరిగింది. మేనేజర్లు ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తారు. అమెజాన్ ఉద్యోగులు లెవల్- 1 నుండి లెవెల్- 7 వరకు ఉంటారు. అన్ని స్థాయిలలోని ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. 20,000 మంది ఉద్యోగులు కంపెనీ కార్పొరేట్ సిబ్బందిలో 6 శాతం, మొత్తం 15 లక్షల ఉద్యోగులలో 1.3 శాతానికి సమానంగా ఉంటారు. 20,000 మంది ఉద్యోగుల తొలగింపు అమెజాన్ చరిత్రలో అతిపెద్ద తొలగింపు అవుతుంది.