హైదరాబాద్: ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్ల తాగునీరు అందిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉభయ సభలు ప్రారంభమైన సందర్భంగా శాసన మండలిలో కెటిఆర్ మాట్లాడారు. ఈ పథకం కోసం ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలన్నారు. అందరికీ ప్రపంజ జలదినోత్సవం శుభాకాంక్షలు అని తెలిపారు. జలదినోత్సవం రోజున ఉచిత తాగునీటిపై చర్చ జరగడం సంతోషకరమైన విషయమన్నారు. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి కృష్ణా జలాలను తరలిస్తామన్నారు. ఉచిత తాగునీటికి రూ.5oo కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నీటి మీటర్లు పెట్టుకోవడానికి ఏప్రిల్ చివర వరకు గడువు పెంచుతున్నామన్నారు. గతంలో హైదరాబాద్‌లో నీటి కోసం కుండలు, బిందెలతో ప్రదర్శనలు జరిగేవని, తెలంగాణ ఏర్పడిన తరువాత అలాంటి ప్రదర్శనలు జరగడం లేదని పేర్కొన్నారు.
2050 వరకు నీటి సమస్య రాకుండా సిఎం కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రూ.4700 కోట్లతో కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. జిహెచ్‌ఎంసిలోని మురికి వాడలన్నింటికీ ఉచితంగా తాగు నీరు అందిస్తామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయని, ప్రతి ఇంటికి నీటి సంరక్షణ పిట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆదిభట్లలో డెడికెటెడ్ ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారుతోందన్నారు. ఏరోస్పేస్ తయారీ, ఇంజనీరింగ్, మెటీరియల్ విభాగాల్లో మూడు నుంచి ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో 7 ఎస్‌ఇజడ్‌లతో ఏరోస్పేస్ కార్యకలాపాలు ఉంటాయన్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణకు డిఫెన్స్ కారిడర్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.