క్రికెట్ మైదానంలో ప్రాణాలు కోల్పోతున్న ఆటగాళ్ల ఉదంతాలు ఇటీవల ఎక్కువగా వినవస్తున్నాయి. కొందరు పరుగెత్తుతూ గుండెపోటుతో చనిపోతే, ఇంకొందరు బంతి తగిలి దుర్మరణం పాలవుతున్నారు. తాజాగా కశ్మీర్ కు చెందిన ఓ 20 ఏళ్ల కుర్రాడు బౌలింగ్ చేస్తూ, గుండెపోటుకు గురై మరణించాడు.
బారాముల్లాలోని హంజీవెరా ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో సుహైబ్ యాసీన్ అనే పేస్ బౌలర్ బౌలింగ్ కోసం రనప్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు.
ఇటీవల నోయిడాలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ కుర్రాడు గుండెపోటుతో చనిపోయాడు. గతంలో టీమిండియా ఆటగాడు రమణ్ లాంబా మైదానంలో క్రికెట్ బంతి తలకు తగిలి తీవ్రంగా గాయపడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన బ్యాటర్ ఫిల్ హ్యూస్.. బౌలర్ వేసిన బౌన్సర్ కు గాయపడి మరణించాడు.