ఆటో డ్రైవర్స్, ట్రాఫిక్ పోలీసుల రక్తదాన శిబిరం
రక్తదానం చేసిన 200మంది ఆటో డ్రైవర్లు
ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
మనతెలంగాణ, హైదరాబాద్ : రక్తదానం చేయడం గొప్ప విషయమని, ఆటో డ్రైవర్లు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పనిచేస్తున్న 200మంది ఆటో డ్రైవర్లు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసేందుకు ఆటో డ్రైవర్లు ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. రక్తం పేదలకు, ధనికులకు తేడా ఉండదని అందరిలో ఒకటే ఉంటుందని అన్నారు. ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురి జీవితాలు బాగుపడుతాయని అన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని ఆపద నుంచి గట్టెక్కించవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో రెండు, మూడు రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్, డిసిపి ఎల్‌ఎస్ చౌహాన్, ఎడిసిపిలు కరుణాకర్, భాస్కర్, ఎసిపి బిఆర్ నాయక్, ఎసిపి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.