25 ఎకరాల్లో ఆలయం నిర్మించాలని ప్రదిపాదించిన ఇస్కాన్
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన ఇస్కాన్ ప్రతినిదులు
హైదరాబాద్: హైదరాబాద్ నగర సమీపంలో రూ. 200 కోట్లతో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన మందిరానికి భూమిని కేటాయించాలంటూ ఇస్కాన్ ప్రతినిదులు శుక్రవారం అరణ్య భవన్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ కు సమీపంలో సంగారెడ్డి జిల్లాలో సాధరణధరకు లీజు పద్ధతిలో అనువైన స్థలాన్ని కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ అంశాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సర్వాంగ సుందరగా.. చరిత్రలో కలకాలం నిలిచిపోయేలా.. ఆధ్యాత్మికంగా హైదరాబాద్ ను విశ్వవ్యాప్తంగా చూపించాలనే ఆశయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించామని, మందిర ప్రాంగణంలో గురుకులం, వృద్దాశ్రమం, గోశాల కూడా నిర్మించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిదులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇస్కాన్ విశాఖనగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభుజీ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఇతర ఇస్కాన్ ప్రతినిదులు పాల్గొన్నారు.