న్యూఢిల్లీ: గ్రూప్ ఆఫ్ 20(జి 20)కి అధ్యక్షత వహించనున్న భారత్ తన ఏడాది పదవీకాలంలో 200కి పైగా జి20 సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో జరిగే వార్షిక సదస్సుతో భారత్ ఆతిథ్యం వహించే సమావేశాలు ముగుస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ 1న జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనున్నది. ఏడాది పాటు ఉండే భారత్ అధ్యక్ష పదవీకాలం 2023 నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై వచ్చే ఏడాదిలో పదవీకాలం ముగిసేవరకు భారత్ 200కి పైగా జి20 సమావేశాలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నదని విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం తెలిపింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే వార్షిక సదస్సుకు జి20 సభ్యదేశాల ప్రభుత్వాధినేతలు హాజరవుతారని మంత్రిత్వశాఖ తెలిపింది. జి20 సభ్యదేశాలలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి.