తాజాగా కొత్తగూడెంలో 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
ప్రారంభించిన సంస్థ డైరెక్టర్లు బలరామ్,సత్యనారాయణరావులు
మొత్తం 300 మెగావాట్ల ప్లాంట్లలో 209 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తి
అభినందనలు తెలిపిన సంస్థ చైర్మన్, ఎండి శ్రీధర్
మన తెలంగాణ/హైదరాబాద్ : సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి సంస్థ 200 మెగావాట్ల మైలురాయిని దాటింది. మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, తాజాగా కొత్తగూడెంలో నిర్మించిన 37 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించింది. దీంతో సింగరేణి సంస్థ తన సోలార్ ఉత్పాదనలో 200 మెగావాట్ల మైలురాయిని విజయవంతంగా దాటినట్లు అయింది. సంస్థ డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణ రావులు ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. దీనిపై సంస్థ ఛైర్మన్, ఎండి శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేస్తూ మూడో దశ నిర్మాణాలను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
ప్లాంటు ప్రారంభం సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ పర్యావరణహిత చర్యల్లో భాగంగా వ్యాపార విస్తరణను దృష్టిలో పెట్టుకొని సింగరేణి సంస్థ సోలార్ ప్లాంట్లను నెలకొల్పుతోందన్నారు. వీటి వలన ఏడాదికి సుమారు రూ. 120 కోట్లను ఆదా చేయనున్నామని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా ఉన్న 8 ఏరియాల్లో వివిధ సామర్థ్యాలు గల 13 ప్లాంట్ల ను నెలకొల్పాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఈ ప్లాంట్లను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. మొదటి దశలో 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదన కోసం నాలుగు ఏరియాల్లో ప్లాంట్ల నిర్మాణపు పనులను బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించామన్నారు. దీనిలో ఆర్‌జి..-3లో 40మెగావాట్లు, ఇల్లందులో 39 మెగావాట్లు, మణుగూరులో 30మెగావాట్లు, ఎన్‌టిపిసి ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి విద్యుత్ ఉత్పాదన చేస్తున్నాయన్నారు. ఈ దశలో మిగిలి ఉన్న ఆర్‌జి..-3 ఏరియాలో 10 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం మరో నెలలో పూర్తి కానుందన్నారు.
కాగా రెండో దశలో 90 మెగావాట్ల సామర్థ్యంతో 3 ఏరియాల్లో నాలుగు చోట్ల ప్లాంట్లను నిర్మించడం కోసం ఆదాని నిర్మాణ సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం జరిగిందన్నారు. ఇందులోకొత్తగూడెంలో 37 మెగావాట్లు, మందమర్రి- ఏ.. బ్లాక్‌లో 28 మెగావాట్లు, మందమర్రి-.. బి బ్లాక్‌లో 15 మెగావాట్లు, భూపాలపల్లిలో 10 మెగావాట్ల నిర్మాణం పూర్తికావడంతో పాటు విద్యుత్ ఉత్పాదన ప్రారంభమైందన్నారు. దీంతో సింగరేణి సోలార్ ఉత్పాదన 209 మెగావాట్లకు చేరింది.
దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇప్పటి వరకు సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలోకి దిగలేదన్నారు. ఈ విధంగా థర్మల్ విద్యుత్‌తో పాటు సోలార్ విద్యుత్ రంగంలో కూడా అడుగుపెట్టిన ఘనత దేశంలో సింగరేణి కాలరీస్‌కే దక్కుతుందన్నారు. సంస్థ ఛైర్మన్‌శ్రీధర్ గత రెండేళ్ల కాలంగా సోలార్ విద్యుత్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ నెలవారీ సమీక్షలు నిర్వహిస్తూ పనులు అత్యంత వేగవంతంగా పూర్తయ్యేలా చొరవ చూపారన్నారు.
ఇప్పటికే 122.3 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికే పూర్తయి గ్రిడ్‌కు అనుసంధానమైన సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఇప్పటి వరకు 122.3 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశామని డైరెక్టర్లు వివరించారు. ఈ ద్యుత్ సరఫరా సంస్థలైన ట్రాన్స్‌కో లైన్లకు అనుసంధానం చేసి సింగరేణి వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనకు అవసరమైనంత మేర విద్యుత్ ను సింగరేణి వినియోగించుకుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా నుంచి విద్యుత్ కొనుగోలును తగ్గించామన్నారు. ఈ చర్యల కారణంగా సింగరేణి సంస్థకు ఇప్పటి వరకు రూ.75 కోట్ల మేర ఆదా జరిగిందన్నారు. మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరిగితే సింగరేణి సంస్థకు ఏడాదికి రూ.120 కోట్ల ఆదా కానుందని వారు పేర్కొన్నారు.
ఈ ఏడాది చివరికల్లా మూడో దశలో 81 మెగావాట్లు
ఇదిలా ఉండగా మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని అదానీ, నోవాస్ గ్రీన్ అనే సంస్థలకు సింగరేణి అప్పగించింది. వీటిలో నీటిపై తేలియాగే 15 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం లోని జలాశయంపై నోవాస్ గ్రీన్ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. కాగా, అదానీ గ్రూప్ వారు ఆర్‌జి..3 ఒపెన్ కాస్టుడంప్‌పై 22 మెగావాట్లు, డోర్లీ ఓపెన్ కాస్టు డంప్‌పై 10 మెగావాట్ల నిర్మాణం తోపాటు కొత్తగూడెం, చెన్నూరులో నేలపై నిర్మించే 34 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలను చేపడుతోంది. ఈ ఏడాది చివరికల్లా నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.