Sunday, December 22, 2024

నిరాశా చీకట్లలో పొద్దుపొడిచిన ఆశా కిరణాలు

- Advertisement -
- Advertisement -

మణిపూర్ నిర్వాసిత శిబిరాల్లో 200 మంది నవజాతల జననం

ఇంఫాల్ /చురాచాంద్‌పూర్ : మణిపూర్‌లో మెయిటీ, కుకీ తెగల మధ్య గత సంవత్సరం మొదలైన ఘర్షణల్లో 200 మంది కన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఇప్పటికీ అందరినీ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద నిర్వాసితుల కోసం 280 పునరావాస శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వీటిలో కొన్ని గర్భిణుల కోసం, బాలింతల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాంటి ఆరు శిబిరాల్లో 200 మంది పసికందులు జన్మించడం నిర్వాసితుల్లో ఆనందం కలిగిస్తోంది.

11 నెలలుగా అనుభవించిన భయంకర సంఘర్షణలకు తమ జీవితాలు తారుమారైనప్పటికీ అవన్నీ మరిచిపోయి నవజాతలకు స్వాగతం పలుకుతున్నారు. ప్రసవించిన నవజాతలు తమకు అపురూప కానుకలుగా తలచుకుని మురిసిపోతున్నారు. నిరాశా నిట్టూర్పుల సమయంలో ఆశా కిరణాలు ఉదయించాయని భావిస్తున్నారు. బాలింతలు ఎవరికి వారు తమ అనుభూతిని పంచుకుంటున్నారు. పుట్టిన 200 నవజాతల్లో ఎన్‌గన్‌థొయిబీ పేరు గల శిశువు తల్లి హేత్నియు తన బిడ్డకు పెట్టిన పేరు గురించి వివరిస్తూ ఈ పేరుకు తగిన అర్ధం ‘ప్రకాశించిన కాంతి’ అని వివరించింది. చురాచాంద్‌పూర్ శిబిరంలో ఆమె ఉంటోంది.

ఇంఫాల్ వ్యాలీలో వెదరువస్తువుల దుకాణం నడిపే ఈమె కుకీ తెగకు చెందినది. గత నెలలోనే ఆమె బిడ్డను ప్రసవించింది. కాక్‌చింగ్ జిల్లాలోని నిర్వాసిత శిబిరంలో ఉంటున్న 26 ఏళ్ల మహిళ మగ కవలలను ప్రసవించింది. వారికి ఇప్పుడు నాలుగు నెలల వయసు. నా బాధలన్నీ కరిగిపోయాయని సంతోషాన్ని వ్యక్తం చేసింది. చురాచాంద్‌పూర్ శిబిరంలోఉంటున్న మరో మహిళ లూ లామ్వా ఎన్‌గహ్‌జెంకిం ఘర్షణల సమయంలో ఎనిమిది నెలల గర్భిణి. నెల తరువాత ఆమె ఆడబిడ్డను ప్రసవించింది. ఈ శిశువుకు క్రిస్టీ అనే పేరు పెట్టింది. వెండివెలుగుల కాంతిగా తన బిడ్డను చూసుకుంటోంది. తొమ్మిది నెలల క్రిస్టీ ఇప్పుడు ప్రాకుతోంది.

ఆకంపట్ శిబిరంలో ఉన్న టిహెచ్ అంజలి గత అక్టోబర్‌లో ఆడబిడ్డను ప్రసవించింది. ఇంతవరకు తాము బతికి ఉన్నందుకు ధన్యవాదాలని తన గత భయానక సంఘటనలను తలచుకుంది. ఇంఫాల్ వ్యాలీలో గర్భిణుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో 168 మంది శిశువులు జన్మించడం గమనార్హం. గత మే 21న ప్రారంభించిన ఈ శిబిరంలో 164 మంది మహిళలు ఉండేవారు. అయితే అందరూ ప్రసవించిన తరువాత మరెవరూ లేక పోవడంతో ఈ శిబిరాన్ని మూసివేశారు. గత ఏడాది మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 168 మంది శిశువులు జన్మించారని మణిపూర్ బీజేపీ అధ్యక్షురాలు శారదాదేవి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News