Monday, November 18, 2024

కొండచరియలు విరిగిపడి 2 వేల మందికి పైగా సజీవ సమాధి

- Advertisement -
- Advertisement -

పపువా న్యూ గినీ దేశంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో రెందు వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని ఆ దేశంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆ ప్రాంతం అంతా భౌగోళిక అస్థిరత్వం ఉండడం, సమీపంలో గిరిజనుల ఘర్షణలు జరుగుతున్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంస్థ సూచించింది. ఎంగా ప్రావిన్స్‌లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడిన విషయం విదితమే. కాగా, కొండచరియల కింద చిక్కుకుని 670 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి (యుఎన్) తెలియజేసింది. అయితే, మృతుల సంఖ్య రెండు వేలు దాటిందని స్థానిక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యుఎన్‌కు లేఖ రాసింది. అనేక భవంతులు, వనాలు నాశనం అయినట్లు సంస్థ ఆ లేఖలో తెలిపింది. విపత్తు సంభవించిన ప్రాంతంలో సుమారు నాలుగు వేల మంది ఉంటున్నారు. అయితే, స్థానిక జనాభా ఎంత అనేది చెప్పడం కష్టమని అక్కడి అధికారులు అంటున్నారు. చివరి సారి జనాభా లెక్కలను 2000లో తీసుకున్నారని వారు తెలిపారు.

ఈ ఏడాది మరొక సారి జన గణన నిర్వహించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఘటన జరిగిన ప్రాంతంలో భౌగోళిక అస్థిరత్వం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతం సుదూరాన ఉండడం మరొక ప్రధాన అడ్డంకిగా మారిందని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులే రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలికితీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పలుగు, పారలతో కొండచరియలను తవ్వుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విపత్తు కారణంగా ఇప్పటి వరకు 1250 మంది నిరాశ్రయులుగా మారారు. 150 ఇళ్లు నేల మట్టం కాగా మరి 250 ఇళ్లు నివాసయోగ్యం కాకపోవడంతో ప్రజలు వాటిని విడిచి వెళ్లిపోయారు. విరిగిపడిన కొండచరియలను తొలగించడం ప్రస్తుతం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని అని ఐక్యరాజ్య సమితి అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, విధ్వంసం, ప్రాణ నష్టం స్థాయి గురించి సమాచారం ఎప్పుడు తమకు అందితే అప్పుడు విడుదల చేస్తామని పపువా న్యూ గినీ ప్రధాని జేమ్స్ మరాపె కార్యాలయం వాగ్దానం చేసింది.

తీవ్ర విచారకరం : జైశంకర్
ఈ సంక్లిష్ట సమయంలో పపువా న్యూ గినీ ప్రజల పట్ల భారత్ సంఘీభావం ప్రకటిస్తున్నదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. ఆ ద్వీప దేశంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణ నష్టానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘పపువా న్యూ గినీలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణ నష్టానికి తీవ్రంగా విచారిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. ‘ఆ ప్రభుత్వం, ప్రజలపైనే మా ఆలోచనలు అన్నీ. ఈ సంక్లిష్ట సమయంలో తమ మిత్రుల పట్ల భారత్ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నది’ అని జైశంకర్ తన పోస్ట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News