Thursday, January 16, 2025

ఘనీభవించే నెత్తుటి జాడల గాజా

- Advertisement -
- Advertisement -

గాజాస్ట్రిప్ : నెలల తరబడి సాగుతోన్న యుద్ధంలో ఇప్పటికే దాదాపు 20,000 మంది సామాన్య పాలస్తీనియన్లు బలి అయ్యారు. హమాస్‌ను నామరూపాలులేకుండా చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు పంతంతో ధట్టించిన బాంబుల మోతలతో స్వైరవిహారం సాగిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే 2000 పౌండ్ ంబులను కురిపించింది. దీనితో తమకు ఇప్పుడు కళ్ల ముందు మారణహోమం తలపిస్తోందని హమాస్ అధీన గాజాస్ట్రిప్ అధికారులు తెలిపారు. సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరం అయింది. వీధుల్లోకి వెళ్లితే బాంబుల దాడులు, ఇండ్లల్లో ఉంటే ఇజ్రాయెల్ సేనల నుంచి వెళ్లిపోవాలనే హుంకరిపులు ఎదురవుతున్నాయి. ఇతర దేశాల నుంచి అందుతోన్న మానవీయ సాయానికి కూడా బాంబుల వర్షం, క్షిపణుల దాడులతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. చివరికి ఇజ్రాయెల్ తాము రూపొందించే సరికొత్త మారణాయుధాల పరీక్షల ప్రయోగస్థలిగా ఇప్పుడు గాజాను వాడుకుంటున్నారని అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

చనిపోయిన వారు చనిపోగా, గాయపడ్డ వారు అరకొర సౌకర్యాల ఆసుపత్రుల పాలుకాగా , మిగిలిన జనం దాదాపు 5 లక్షలకు పైగా ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. ఐరాస రూపొందించిన తాజా నివేదికతో ఈ జీవన్మరణ సమస్య వెలుగులోకి వచ్చింది. ఇతర సంస్థలు కూడా గాజాలో ఇప్పుడు తలెత్తిన మానవీయ దారుణ పరిస్థితుల గురించి నివేదికలు రూపొందించాయి. రోజురోజుకీ సామాన్యుడి బతుకు మరింత దిగజారుతోందని, చావుబతుకుల నడుమ ఎటూ తేలని స్థితికి చేరిందని ఆందోళన వ్యక్తం అయింది. ఇజ్రాయెల్ తమ వద్ద ఉన్న అత్యంత విధ్వంసకర , భయానక 2000 పౌండ్ బాంబులు, అమెరికా తయారీ ఎంకె 84 ఆయుధాలను ప్రయోగిస్తోంది. దీనితో పాలస్తీనియన్లపై ఇది పిచ్చుకపై బ్రహ్మస్త్రం అయింది. బాంబుల మోతలతో దారితెన్నూ తెలియని, ఎటువంటి ఆసరాలేని స్థితిలో ఇప్పుడు ప్రతి నలుగురు పాలస్తీనియన్లలో ఒక్కరు స్థాయిలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు అక్కడ నెలకొన్న ఆకలి విలువ కట్టాలంటే ఏకంగా అఫ్ఘనిస్థాన్, యెమెన్‌లలో ఇటీవలి కాలంలో తలెత్తిన కరువుకాటకాలలో

నెలకొన్న కడుదయనీయ ఆకలి దప్పుల పరిస్థితిని తలపిస్తోంది. గాజాలోకి ఎప్పటికప్పుడు ఇతర దేశాల నుంచి సాయం అందడం సన్నగిల్లుతోంది. దీనితో సగటు పాలస్తీనియన్ ఆకలితో కళ్లు తేలేసే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు ప్రజలకు సరైన లేదా కనీస ఆహారం అందని స్థితి నెలకొనడం మించిన దారుణ పరిస్థితి తన దృష్టికి ఇంతవరకూ రాలేదని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ప్రధాన ఆర్థికవేత్త అరిఫ్ హుస్సేన్ తెలిపారు. అక్కడ సంభవించిన తీవ్రస్థాయి పరిణామం మరింత వేగంగా విస్తరించడం బాధాకరం అవుతోందన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి సాగించిన నరమేధం తరువాత ఇజ్రాయెల్ ఎదురుదాడులు , ఇప్పుడు సాగిస్తోన్న భూతల దాడులు చివరికి ఇది ఈ గడిచిపోతున్న 2023 సంవత్సరం మిగిల్చివెళ్లుతున్న నెత్తుటిగడ్డగా మారింది. ఇప్పుడు గాజాలో 20వేల మందివరకూ చనిపోగా, దాదాపు రెండు లక్షల మంది గాజా నివాసితులు తమ ఇళ్లు వదిలివెళ్లాల్సి వచ్చింది. నిర్వాసితుల జాబితాలో చేరాల్సి వచ్చింది. మొత్తం జనాభాలో ఇది 80 శాతాన్ని మించింది. అక్కడక్కడ వెలిసి ఉన్న ఐరాస సహాయక శిబిరాలలో పాలస్తీనియన్లు ఇప్పుడు నరకం చూపించే చలిలో జీవితాలు నెట్టుకొస్తున్నారు.

వైద్య ఆరోగ్య వ్యవస్థ పతనం
గాజాలోని ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలింది. ఆసుపత్రులలో హమాస్ మిలిటెంట్లు తలదాచుకుని ఉన్నారనే కారణంతో ఇజ్రాయెల్ సేనలు వీటిని తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఇక అవసరం అయిన ఏర్పాట్లు లేకపోవడంతో పలు చికిత్సాలయాలు మూతపడ్డాయి. దీనితో దాడులలో గాయపడే వారు దిక్కులేని స్థితిలో ఉన్నారు. గాజాలో ఇప్పుడు కేవలం 9 ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి కూడా అత్యంత కీలకమైన ఆపరేషన్లు , చికిత్సలు చేసే పరిస్థితిలో లేవు. ఆసుపత్రులే గాయపడ్డ పరిస్థితి ఉందని, ఇక గాయపడి ఆసుపత్రుల దాకా వచ్చే వారి దీన స్థితి ఏ విధంగా ఉంటుందని ప్రశ్నలు వెలువడ్డాయి. ఇప్పుడు గాజా దక్షణ ప్రాంతంలోనే చికిత్స కేంద్రాలు పనిచేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఆసుపత్రులలో దయనీయ పరిస్థితులు
గాయాలతో, తీరని దాహంతో పడిగాపులు
దాడులలో గాయపడ్డ వారిలో కొందరు ఆసుపత్రులలో చికిత్సలకు చేరినా వారికి ఎటువంటి చికిత్సలు జరగడం లేదు. ఉత్తర గాజాలో బెడ్స్‌పై క్షతగాత్రులు రోజుల తరబడి గాయాలతో తల్లడిల్లుతున్నారు. నీళ్ల కోసం అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని డబ్లుహెచ్‌ఒ సహాయక బృందాలు ఆసుపత్రులకు వెళ్లి వచ్చిన తరువాత తెలిపారు. కొందరు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తమ విధి నిర్వహణకు సిద్ధంగా ఉన్నా , అందుబాటులోలేని మందులు, కరెంటు లేని పరిస్థితుల్లో ఏమి చేయలేని నిస్సహాయతలో ఉన్నారు. ముందుగా మానవీయ సాయం అందాల్సి ఉంది. లేకపోతే జనం గాయాలతో, ఆకలితో చనిపోయే పరిస్థితి ఉందని, తక్షణ కాల్పుల విరమణ చేపట్టాలని ఐరాస పిలుపు నిచ్చింది. ఈ దిశలో అరబ్ దేశాలు భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానం ఇప్పుడు అమెరికా వీటో ప్రయోగంతో వెనుకపడిపోయింది.

తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ రోజుల తరబడి ఆగిపోతోంది. ఏదో విధంగా తీర్మానానికి అమెరికా నుంచి సానుకూలత వ్యక్తం అయ్యేలా చేసేందుకు పలు దేశాలు , ప్రత్యేకించి ఐరాస ఉన్నత స్థాయి కమిటీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే హమాస్‌ను అంతమొందించడానికి చేపట్టిన ఆపరేషన్ మధ్యలో వదిలేసే ప్రసక్తే లేదని, రాజీకి దిగితే యుద్ధం ఆపితే హమాస్ తిరిగి బలం పుంజుకుంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీనికి అమెరికా నుంచి పూర్తి స్థాయి మద్దతు దక్కుతోంది. కాల్పుల విరమణ ప్రక్రియతో సంబంధం లేకుండా సురక్షిత రీతిలో గాజా ప్రాంతాలకు ఈజిప్టు నుంచి సాయం అందేలా చేయాల్సి ఉంటుందని అమెరికా సూచిస్తోంది. ఈజిప్టు ద్వారా సాయం మార్గాలను ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం తొలుత అడ్డుకుంది. అయితే చివరికి అమెరికా జోక్యంతో సరఫరాలకు వీలేర్పడింది. అయితే ఇప్పుడు గాజా బాధితుల కీలక అవసరాలలో కేవలం పది శాతం ఆహారం కూడా అందడం లేదని ఐరాస నివేదించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News