Sunday, December 22, 2024

డెవిల్ డేనియల్ ..

- Advertisement -
- Advertisement -

ట్రిపోలి : ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ భీకర తుపాన్ డెర్నా నగరంలో జలవిలయాన్ని సృష్టించింది. ఇక్కడ డ్యామ్‌లు తెగి వాడి నది కట్టలు తెంచుకున్న క్రమంలో వేలాదిగా ఇళ్లకు ఇళ్లే నిద్రిస్తున్న కుటుంబాలతో పాటు వరదలలో సముద్రంలోకి కొట్టుకుపొయ్యాయి. మృతుల సంఖ్య 18,000 నుంచి 20000 వరకూ ఉంటుందని ఇది అత్యంత బాధాకరమైన విషాదం అని నగర మేయర్ అబ్దుల్‌మెనామ్ అల్ ఘైతీ గురువారం తెలిపారు. ఆదివారం రాత్రి భీకర తుపాన్‌తో ఏకబిగిన కుండపోత వర్షాలతో డ్యామ్‌లు బద్దలు అయ్యాయి. ఈ నీటి ప్రవాహాలు నది మధ్య నుంచి వెళ్లే నదిలోకి చేరుకోవడంతో చాలా దూరం వరకూ చుట్టుపక్కల ఉన్న వేలాదిగా బహుళ అంతస్తుల భవనాలు రెప్పపాటులోనే మధ్యధరా సముద్రంలోకి పడవలలాగా జారుకున్నాయి. ఆదివారం సంభవించిన ఈ పరిణామంతో ఈ పాంతం అంతా రెండు మూడు రోజుల వరకూ మిగితా ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయింది. కేవలం కొన్ని భవనాలు ఒకటి రెండు చోట్ల రోడ్డు తప్పితే అంతా శిథిలాల దిబ్బగా మారింది. వీటి మధ్య ఎటుచూసినా మృతదేహాలే కన్పిస్తున్నాయని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.

ఈ నగరంలో ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పుడు దీనంగా తమ దెబ్బతిన్న కొన్ని చోట్ల కన్పించకుండా పోయిన తమ నివాసాల వద్ద నిలుచుని ఉన్నారు. చనిపోయిన తమ ఆప్తుల భౌతికకాయాల కోసం వెతుక్కుంటున్నారు. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. కుళ్లిపోతున్న మృతదేహాలతో ఏ క్షణంలో అయినా కలరా ఇతరత్రా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పొంగిన నది వీధులలోకి దూసుకువచ్చింది. అడ్డుగా ఉన్న పలు అంతస్తుల భవనాలన్ని ఈ నీటిధాటికి సుడులు తిరుగుతూ సముద్రంలోకి కొట్టుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అంతా నిద్రలో ఉండగా ఆకస్మికంగా నది ఉధృతితో పరవళ్లు తొక్కింది. ఇప్పటివరకూ ఎందరు చనిపోయ్యారనేది అధికారికంగా నిర్థారించలేకపోతున్నారు. ఇప్పటికీ వేలాది మంది జాడ తెలియడం లేదని, మృతుల సంఖ్య 20000 దాటే ఉంటుందని , ఇది మహా విషాదంగా మారిందని నగర మేయర్ తెలిపారు. చాలా మృతదేహాలు శిథిలాల మధ్య, నీళ్లల్లో పడి ఉన్నాయి. దీనితో ఈ భౌతికకాయాలను వెలికితీయడానికి , ఒక్కచోట చేర్చడానికి, ఖననానికి సంబంధిత నైపుణ్య బృందాలు అవసరం అని మేయర్ తెలిపారు.

నది లో కలిసిన నగరం సగభాగం
ఇప్పుడు ఈ నగరం మధ్యగా వెళ్లే ‘వాడి’ నది మునుపటితో పోలిస్తే విశాల రూపం సంతరించుకుంది. కేవలం కొన్ని బిల్డింగ్‌లు, రాదార్లు తప్పితే మధ్యలో నది, పక్కన మహాసముద్రం కన్పిస్తున్నాయి. డెర్నాను ఇప్పుడు ఓ అవశేషంగా భావించుకోవల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. 52 సంవత్సరాల డ్రైవర్ ఉసామా అల్ హుసాది ఇప్పుడు అంతటా కలియతిరుగుతున్నాడు. విపత్తు నాటి నుంచి తాను భార్య , ఐదుగురు పిల్లల కోసం వెతుకుతున్నానని , కాలినడకన తిరుగుతూ , ప్రతి ఆసుపత్రి, స్కూళ్లు, ఇతర సహాయక శిబిరాలలో ఆశగా చూస్తున్నానని తెలిపాడు. ఇప్పటికైతే తన వారు ఎవరూ కన్పించలేదని విధిని తిట్టుకున్నాడు. తుపాన్ దశలో ఉసామా నైట్‌షిఫ్ట్‌లో ఉండటంతో బతికి బయటపడ్డాడు.

దూరంగా మరో చోట డ్రైవర్ డ్యూటీలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. తన కుటుంబ సభ్యులు ఇతరత్రా సమీప బంధువులను లెక్కచూసుకుంటే తాను కనీసం 50 మందిని పోగొట్టుకున్నట్లు వాపొయ్యారు. నగరం శివార్లలోనివసించే వారు, పనులలో ఉన్న వారు ఈ ముప్పు నుంచి తప్పించుకున్నారు. 24 ఏండల ఆదామ్ శివార్లలోని ఇటుకల బట్టిలో పనిచేస్తున్నాడు. తాను పనిచేస్తూ ఉండగా ఉపద్రవం ముంచుకు వచ్చిందని పసికట్టి నగరం నడిబొడ్డుకు తన వారికోసం ఉరుకులు పరుగులపై వచ్చాడు. అయితే నగరం దాదాపుగా సముద్రంలో కలిసినట్లుగా కన్పించిందని , తనతో పాటు పనిచేసే తొమ్మండుగురు కూలీలు చనిపోయినట్లు, పలు కుటుంబాలు నామరూపాలు లేకుండా పోయినట్లు తెలిపారు. ఈ లోయ నగరం ఇప్పుడు దాదాపుగా సముద్రంలో కలిసిపోయినట్లే అన్నారు.

పలు దిక్కుల నుంచి అంతర్జాతీయ సాయం
సహాయక బృందాలకు దిక్కుతోచని స్థితి
కనివిని ఎరుగని జల విలయంతో దెబ్బతిన్న లిబియాకు క్రమేపీ అంతర్జాతీయ స్థాయి సాయం అందుతోంది. అత్యంత కష్టంగా డెర్నాలో పునరావాసానికి చేరుకోగల్గిన సహాయక బృందాలు అత్యంత విపత్కర పరిస్థితుల నడుమ రంగంలోకి దిగుతున్నాయి. ఈజిప్టు, ట్యూనిషియా, యుఎఇ, టర్కీ, ఖతార్ దేశాల నుంచి సహాయక బృందాలు తరలివచ్చాయి. టర్కీ నుంచి వైద్య పరికరాలు, సిబ్బందితో కూడిన ఓ నౌక బయలుదేరింది. టర్కీ బృందం బాధిత నగరంలో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తుంది. ఇటలీ నుంచి మూడు విమానాలను, సిబ్బందిని పంపించారు. కొన్ని దేశాల నుంచి సహాయక నౌకలు తీరానికి వచ్చినా కేవలం శిథిలాలే ఉన్న రేవు వద్ద వీటిని నిలిపి ఉంచడం కష్టం అయింది.

ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు రాజకీయ వైరుద్థాలతో ఉన్న ఈ దాదాపు కోటి జనాభా ఉన్న దేశంలో చాలాకాలంగా జాతీయ స్థాయిలో అభివృద్థి లేకుండా పోయింది. 2011లో లిబియా ఉక్కు మనిషి మువమ్మర్ గడాఫీని నాటో మద్దతుతో జరిగిన తిరుగుబాటుతో గద్దె దింపిన నాటి నుంచి పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఇప్పుడు లిబియాపై ఏ పక్షానికి పూర్తిస్థాయి ఆధిపత్యం లేకుండా పోవడం వల్ల జరుగుతున్న దుష్పరిణామాలు ఇప్పటి ఉపద్రవంతో మరోసారి వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News