Sunday, January 19, 2025

వాకపల్లి న్యాయానికి సమాధి

- Advertisement -
- Advertisement -

2007 ఆగస్టు 20న ఉదయం 6 గం॥లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్‌కు చెందిన 21 మంది పోలీసులు నక్సలైట్ల కోసం కూంబింగ్‌లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా జిమాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామంపై దాడి చేసి 11 మంది ఆదివాసీ మహిళలపై సామూహిక లైంగిక దాడిని కొనసాగించారు. వైద్య పరీక్షల పట్ల నిర్లక్ష్యంతో పాటు హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానానికి బాధితులే వచ్చి న్యాయ పోరాటం చేసినా 16 ఏండ్ల తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన గ్రే హౌండ్స్ పోలీసుల నేరాన్ని రుజువు చేయలేకపోయాయి. చివరికి ఆరోపితులకు శిక్ష వేయలేకపోతున్నామని న్యాయస్థానాలు చేతులెత్తేశాయి. వాకపల్లి అత్యాచార సంఘటన జరిగిన వెంటనే మీడియాలో వచ్చిన వార్తలను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిజిపి ఎంఎ బాసిత్ ఎటువంటి విచారణ చేపట్టకుండానే విషయాన్ని ఖండించారు. ఆ తరువాత రెండు రోజులకు ఆగస్టు 22న ఆనాటి విశాఖ ఎస్‌పి అకున్ సబర్వాల్ ఆ 21 మంది పోలీసులను విడివిడిగా విచారణ జరిపి నేరం జరగలేదనే ప్రకటన జరిపారు.

కానీ సమాజంలో మరీ ముఖ్యం గా ఆదివాసీ సమాజంలో గౌరవంగా జీవించే హక్కుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఘటన జరిగిన తరువాత సుమా రు వారం రోజుల పాటు ఈ బాధిత మహిళలను భర్తలు తమ ఇళ్ళలోకి రానివ్వలేదు. అక్కడ స్థానిక ఆదివాసీ పెద్దలు అనేక విధాలుగా నచ్చజెప్పిన తరువాతనే వాళ్ళను ఇళ్ళల్లోకి రానిచ్చారు.అప్పటి వరకు పిల్లలకు పాలు పట్టడం కూడా నిరాకరించబడిన కట్టుదిట్టమైన సమాజంలో ఆదివాసీల జీవనం ఉంది.కానీ సుదీర్ఘ 16 ఏళ్ళ న్యాయ పోరాటం కూడా బాధిత ఆదివాసీ మహిళలకు న్యాయాన్ని అందించలేకపోయింది.ఈ కేసు విచారణ మధ్యలోనే ఒక ఆదివాసీ మహిళ అనారోగ్యంతో చనిపోతే, మరొక మహిళ న్యాయం ఇంకా దొరకడం లేదని చెప్పి రోజులుగా తిండి మానేసి బలవంతంగా చనిపోయింది. ఈ ఘటన 2007లో వైఎస్‌ఆర్ రాజశేఖర రెడ్డి సమయంలో బాక్సైట్ వెలికితీతకు సామ్రాజ్యవాద కంపెనీలకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆదివాసీలపై ఎన్‌కౌంటర్, హత్యాకాండ మహిళలపై అత్యాచారకాండ ఆయుధంగా నిర్బంధం కొనసాగింది.

తండ్రి నేరం చేపిచ్చాడు, కాని కొడుకైన జగన్ కేసే లేకుండా చేశారు. ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో బాక్సైట్ ఖనిజం నిలువ ఉన్న ప్రాంతాలన్నీ యుద్ధ ప్రాంతాలుగా మార్చబడుతున్నాయి. ఒడిశా నియాంగిరిలో ఈ బాక్సైట్ వెలికితీతకు వేదాంత కంపెనీ అనుమతి పొందినప్పటికీ అక్కడ ఉన్న ఆదివాసీలు 1996 పేసా చట్టం ప్రకారం వెలికితీతను నిరాకరించడంతో న్యాయస్థానం కూడా ఆదివాసీలకు అండగా నిలబడి నిన్నటి వరకు బాక్సైట్ వెలికితీత ఆగిపోయింది. నేడు నియాంగిరి సురక్ష సమితి పేరుతో పోరాడుతున్న ఆదివాసీలందరినీ నక్సలైట్లుగా పేర్కొంటూ వారందరిపై ఊపా కేసు నమోదు చేసి జైళ్ళలో నిర్బంధిస్తున్నారు. నేడు ఆంధ్రా సరిహద్దులో బాక్సైట్ వెలికితీతకు పూర్తి సన్నాహాలు సిద్ధమైపోయాయి. వాకపల్లి బాధితులకు న్యాయం జరగకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.చరిత్రలో జరిగిన బాక్సర్ యుద్ధాన్ని మనందరం మరచిపోవచ్చు. కాని నేడు ఒడిశా ఆంధ్రాలో జరుగుతున్నటువంటి బాక్సైట్ యుద్ధాన్ని మాత్రం మనం ఎవరం మరచిపోలేం. ప్రధానంగా వాకపల్లి భల్లుగూడ సామూహిక అత్యాచారాలను ముఖ్యంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు.

ఎక్కడైతే దేశంలో వనరులు ఉంటాయో అక్కడ సామ్రాజ్యవాదులు ఉంటారు, వారి దోపిడీ ఉంటుంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అవి 1967 నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాల నుంచి నేటి వరకు భూమిపై హక్కు కోసం పోరాటాలు సాగుతున్నాయి. ఆదివాసీలకే అడవిపై హక్కు ఉందని ఒకవైపు చెబుతూనే మరొకవైపు నూతన చట్టాలను తీసుకొచ్చి అడవి నంతటినీ సామ్రాజ్యవాదులకు అప్పగించే ప్రక్రియ తీవ్రంగా కొనసాగుతున్నది. కాబట్టి ఇక ముందు ఎన్నో వాకపల్లిలు, భల్లుగూడలు మన కళ్ళముందరే జరగవచ్చు. న్యాయస్థానం వాకపల్లి బాధితుల విషయంలో చేతులెత్తేసినప్పటికీ ప్రజలు, ప్రజా సంఘాలు న్యాయం కోసం మరొక ప్రజా పోరాట రూపానికి సిద్ధం కావాల్సిన అవసరాన్ని ఇవే ఘటన జరిగిన రోజు ఆగస్టు 20న మనం పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. వాకపల్లి కేసులో లోతైన విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు సక్రమంగా జరపడంలో అధికారులు విఫలమైన కారణంగా 11 మంది గ్రే హౌండ్స్ పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది.

సరైన మార్గంలో దర్యాప్తు జరిపి సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంలో దర్యాప్తు అధికారులు విఫలమైనారు. దానితో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ బాధిత గిరిజన మహిళలు నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చి చెప్పి లైంగిక దాడికి బాధితులైన 9 మంది గిరిజన మహిళలకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. లైంగిక దాడికి, హత్యలకు నష్ట పరిహారాలనేవి వ్యవస్థల్లో ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి తప్ప కాని సమాజంలో ఆ రెండింటికీ ఎవరమూ విలువ నిర్ణయించలేము. కానీ నేరస్థులను శిక్షించలేక, నష్ట పరిహారం ఇవ్వడానికే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.నేరం జరిగిందని ఒక వైపు ఒప్పుకుంటూనే నేరస్థులను శిక్షించడానికి చిత్తశుద్ధితో వ్యవహరించకుండా బాధితులను నోరు మూయించే ప్రయత్నమే నష్ట పరిహారమని మేము భావిస్తున్నాము. న్యాయ వ్యవస్థ ఉదాసీనత, నిర్లక్ష్యం నేర నిరూపణ చేయడంలో తన అసక్తత నుండి ప్రభుత్వం తాను చేస్తున్న నేరానికి నష్టపరిహార విధానం అనే ప్రకటననీ తీసుకు వస్తుంది.

ప్రధానంగా ప్రభుత్వం తన సాయుధ బలగాలు కశ్మీర్ నుండి నేటి మణిపూర్ వరకు చేస్తున్న అత్యాచారాలకు, హత్యలకు శిక్షలు వేయించలేక న్యాయస్థానాలు నష్ట పరిహారాల వైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రభుత్వాలు సహజ వనరులను సామ్రాజ్య వాదులకు అప్పగించడం కోసం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ స్థానిక ఆదివాసీ మహిళలపై అత్యాచారమే ఏకైక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. చివరికి వాకపల్లి కూడా 17 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా కనీసం నేరస్థులను గుర్తించలేదు, సస్పెన్షన్ చేయలేదు. నేరమే జరగట్లుగానే మాట్లాడుతూనే నష్ట పరిహారం గురించి మాత్రం మాట్లాడింది. ఇది న్యాయ వ్యవస్థకు విలువ లేని తనం తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా బాధిత మహిళల బాధలను దృష్టిలో పెట్టుకొని న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు బాధితులకు న్యాయం అందించే ప్రక్రియలో భాగం కావాల్సిందిగా పౌర హక్కుల సంఘం కోరుకుంటున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News