మాకు న్యాయం చేయాలని కోరుతూ 2008 డిఎస్సీ బాధితులు సిఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ‘నిరసనలు వద్దు వచ్చి కలవండి మీ రేవంతన్నగా సమస్యలు తీరుస్తా’ అని ఓ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను వారు బ్యానర్‌గా ప్రదర్శించారు. ఈ సందర్భంగా 2008 డిఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటన చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
అయితే తమకు త్వరగా పోస్టింగ్ ఇచ్చి పాఠశాలకు పంపించాలని వారు కోరారు. ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి నియామక పత్రాలు అందజేసి ఆదుకోవాలని వారు విన్నవించుకున్నారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరారు. అలాగే తమది ధర్నా కాదని, విన్నపం మాత్రమే అని 2008 డిఎస్సీ కి ఎంపికైన బాధితులు స్పష్టం చేశారు.