Monday, January 20, 2025

2019 ఎన్నికల్లో గోల్‌మాల్

- Advertisement -
- Advertisement -

సోనీపట్ : హర్యానాలోని అశోక యూనివర్శిటీలో పరిశోధనా పత్రం కలకలం రేపింది. అధికారులు, బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము సామూహికంగా రాజీనామాలు చేస్తామని విద్యాలయం పాలక వర్గం సభ్యులు హెచ్చరించారు. యూనివర్శిటీలో ఆర్థికశాస్త్ర అధ్యాపకులు సవ్యసాచి దాస్ 2019 లోక్‌సభ ఎన్నికలను ప్రధానంగా తీసుకుని ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామిక విద్రోహం అనే శీర్షికతో తన రిసర్చ్ పేపరు సమర్పించారు. ఈ అధ్యయన పత్రంలో దాస్ అప్పటి ఎన్నికలలో బిజెపి విజయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తీవ్రమైన పోటీనెలకొన్న దశలో బిజెపి అసమంజస రీతిలో గెలుపు వాటాను దక్కించుకుందని, ప్రత్యేకించి బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విజయం స్థాయి పలు సందేహాలను రేకెత్తించిందని ఈ పత్రాలలో తెలిపారు. ఈ రిసర్చ్ పత్రాలపై రాజకీయ దుమారం నెలకొంది. ఈ దశలో యూనివర్శిటీ వర్గాలు తమకు దీనితో సంబంధం లేదని తేల్చాయి.

తరువాత తనపై వచ్చిన ఒత్తిడి ఫలితంగా దాస్ తమ పదవికి రాజీనామా చేశారు. అయితే అన్యాయంగా ఈ ప్రొఫెసర్‌పై వేటుపడేలా చేశారని పేర్కొంటూ ఇద్దరు ఫ్యాకుల్టీ సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఇకపై తాము కూడా ఇదే బాటలో వెళ్లుతామని , వర్శిటీలో రాజకీయ జోక్యం ఉంటే సహించేది లేదని వర్శిటీకి చెందిన వివిధ విభాగాల అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత అంశంపై వర్శిటీ విసి సొమక్ రేచౌదరి స్పందించారు. ప్రస్తుతం దాస్ లీవ్‌లో ఉన్నారని, పుణేలోని మరో విద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేరారని, ఆయన రాజీనామా చేయకుండా తాము ప్రయత్నించామని , అయితే ఆయన వినలేదని , దీనితో రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందన్నారు. అయితే ఆయనను తిరిగి ఫ్యాకుల్టీలోకి తీసుకోవాలని లేకపోతే తాము కూడా తగు విధంగా స్పందించాల్సి వస్తుందని వర్శిటీ అధ్యాపకులు, సిబ్బంది హెచ్చరించడం ఇప్పుడు పలుమలుపులకు దారిచూపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News