Friday, November 22, 2024

ప్రగతిశీల రాష్ట్రాలపై పగెందుకు?

- Advertisement -
- Advertisement -

కేంద్రం మంచిచేస్తే మెచ్చుకుంటాం.. లేకపోతే తాటతీస్తాం

ఆరు పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే ఒక్కదానికీ
దిక్కులేదు సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్ నినాదాన్ని చేతల్లో చూపాలి
కేంద్ర సహకారం లేకున్నా కెసిఆర్ ముందుచూపుతో అన్నిరంగాల్లో
తెలంగాణ అగ్రస్థానం టిఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2.32లక్షల
కోట్ల పెట్టుబడులు, 16.48లక్షల మందికి ఉద్యోగాల కల్పన అభివృద్ధి
అంటే ఒక్క గుజరాతే కాదు : మంత్రి కెటిఆర్ 2021-22 పరిశ్రమల
శాఖ వార్షిక నివేదిక విడుదల నాలుగు కంపెనీలతో కీలక ఎంఒయూలు

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధే కేంద్రానికి ప్రధాన అజెండా కావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. నిత్యం రాజకీయాలు చేస్తే భారత్ ఎప్పటికీ మూడో ప్రపంచ దేశంగానే ఉంటుందన్నారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. మిగిలిన సమయంలో ఆర్థ్ధిక రంగాన్ని ముందు వరసలో పెట్టి రాజకీయాలను వెనుక బెంచీలో ఉంచాలన్నారు. అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అలాగే రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. రాష్ట్రాలు పరిపుష్టిగా ఉన్నప్పుడే దేశం కూడా ఆర్థికంగా మరింత పటిష్టమవుతుందన్నారు. కానీ ప్రస్తుత పాలకులు ఆ దిశగా పాలన చేయడం లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో విధంగా కేంద్రం చూస్తోందన్నారు. ప్రధానంగా తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. సోమవారం నాడిక్కడ 2021-2022 ఆర్థ్ధిక సంవత్సరంలో పరిశ్రమల శాఖ సాధించిన వార్షిక నివేదికను కెటిఆర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయు కుదుర్చుకున్నది. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ కేంద్రం మంచి పనిచేస్తే తప్పకుండా మెచ్చుకుంటామన్నారు. అలాగే చెడ్డపని చేస్తే కేంద్రంపై విమర్శలే కాదు.. తాటతీస్తామని హెచ్చరించారు. రాష్ట్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదన్నారు.

అభివృద్ధిలో రాజకీయ జోక్యం ఉండొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలని కోరినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కెటిఆర్ విమర్శించారు. రాష్ట్రానికి ఆరు
పారిశ్రామిక కారిడార్లకు ప్రతిపాదనలు పంపితే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహిస్తోందన్నారు. కనీసం రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా ఇంకా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై ఎనిమిదేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదో మోడీ ప్రభుత్వానికే తెలియాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమి గొంతెమ్మ కోరికలు తీర్చమని అడగడం లేదన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన వాటినే కేంద్రాన్ని అడుగుతున్నామని కెటిఆర్ అన్నారు.

గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకూ కూడా గిఫ్ట్ ఇవ్వండి! అనే అడుగుతున్నామని కెటిఆర్ అన్నారు. సబ్ కా సాత్.. కా వికాస్ నినాదాన్ని కేంద్రం తన చేతల్లో చూపాలన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ కొత్త రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం సిగ్గుచేటని కెటిఆర్ విమర్శించారు. కేంద్రం సహకారం లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఒంటరిగానే….సిఎం కెసిఆర్ ముందుచూపుతో అనేక రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హరిత, శ్వేత, నీలి, పింక్‌తో పసుపు విప్లవం మొదలైందని ఆయన స్పష్టం చేశారు.

జాప్యం చేస్తే జరిమానా వేసేది ఒక్క తెలంగాణే

టిఎస్ ఐపాస్ ద్వారా రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటి వరకు 16.48 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. వీధి వ్యాపారులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. తాను దేశ, విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా టిఎస్ ఐపాస్ గురించి మాట్లాడుతున్నారన్నారు. దీని కింద పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంలో పదిహేను రోజులకు మించి జాప్యం చేస్తే జరిమానా వేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ ఒక్కటే అని మంత్రి కెటిఆర్ అన్నారు. కొత్త పథకాలు తేవడం కాదు వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందువరసలో ఉందన్నారు. సిఎం కెసిఆర్ ఆలోచనలకు తగినట్లుగా ముందుకు సాగుతున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

పారిశ్రామిక అభివృద్ధికి త్రిబుల్ ఐ తప్పనిసరి

రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. దీని కోసం అనేక పారిశ్రామికవేత్తలతో నిత్యం మాట్లాడుతున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల పాత్ర కూడా కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. కానీ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడి అనేక పరిశ్రమలు తెచ్చుకున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి మూడు ఐలు కీలకంగా గుర్తించామని తెలిపారు. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ తమ నినాదమని ఆయన తెలిపారు.

పాకిస్థాన్, బంగ్లాతోనూ పోటీపడలేకపోతున్నాం

అభివృద్ధి అంటే….. ఒక్క గుజరాత్ రాష్ట్రం ఒక్కటే కాదని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. భారత్‌లో ముంబై, తమిళనాడు, బెంగళూరు వంటి మహానగరాలతో పాటు హెదరాబాద్‌కు కూడా ఉందన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలని సూచించారు. వాటిని మరింత అభివృద్ధి చెయ్యాలి కోరారు. పరిశ్రమలు పర్యావరణ హితంగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు..రాష్ట్రంలో ఐటి,అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ గ్రోత్ పెరుగుతూనే ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని…అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. దేశం శరవేగంగా అభివృద్ధి చెందాల్సిందేనని అన్నారు. మనం ముందు భారతీయులమని……ఆ తర్వాతే ఆయా ప్రాంతాల వాళ్ళమని కెటిఆర్ అన్నారు. 1987 వరకు చైనా, భారత దేశ ఆర్ధిక వృద్ధి సమానంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుతం చైనా గ్రోత్ 16 శాతంగా ఉంటే భారత్‌దేశం మాత్రం ఇంకా 3 శాతంగానే ఉందన్నారు. చైనా అమెరికా వంటి దేశాలతో పోటీ పడుతుంటే…… భారత దేశం పాకిస్థాన్,బాంగ్లాదేశ్ తో పోటీకి పడుతున్నట్లుగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో చైనా తరహాలో అభివృద్ధికి కోసం అందరం కలిసి పని చెయ్యాలని కోరారు.

ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాభివృద్ధి పైనే చర్చ

దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని కెటిఆర్ అన్నారు. ఇది ఒకరిద్దరివాళ్ళ సాధ్యపడలేదు. ఒక రోజులో సాధించిన ప్రగతి కాదన్నారు. ఈ అభివృద్ధి వెనకాల ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాత్ర ఉందన్నారు. అలాగే రాష్టాభివృద్ధిలో పరిశ్రమల పాత్ర కూడా మరవరానిదన్నారు. 2014లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐడి,ఇండస్ట్రీలలోని అన్ని విభాగాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం అయ్యారన్నారు. ఈ సమావేశంలో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆదారంగానే సింగిల్ విండో సిస్టమ్, టిఎస్ ఐపాస్, టిఎస్ బిపాస్, టెక్స్‌టైల్స్, మైనింగ్, ఇండస్ట్రియల్ పాలసీలను తీసుకొచ్చామన్నారు. వీటిని తీసుకరావడం చాలా సులువని…కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టమన్నారు. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్క్ మన దగ్గర ఉందన్నారు. అభివృద్ధిలో వ్యక్తులు ముఖ్య కాదన్నారు. కేంద్రంకు తమకు సహకరిస్తే…అది కెసిఆర్, కెటిఆర్‌కో ప్రయోజనం చేకూర్చినట్లు కాగన్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసినట్లు అవుతుందన్నారు. అందువల్ల కేంద్రం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా తెలంగాణకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.

సాధించిన ప్రగతి

రాష్ట్ర జిఎస్‌డిపిపి రూ. 19.1 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది రూ. 11.54 లక్షల కోట్లు. జాతీయ జిడిపిలో రాష్ట్రం వాటా 5.0శాతానికి పెరిగింది. మలబార్ గోల్డ్, డైమండ్స్, పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్, డ్రిల్‌మెక్ స్పా, ఇవాన్హో కేంబ్రిడ్జ్, జాంప్ ఫార్మాస్యూటికల్స్, కిటెక్స్ గ్రూప్, గ్లోస్టర్ లిమిటెడ్, ట్రిటాన్ ఇవి, లిటౌటో, గ్రావ్టన్ మోటార్స్ వంటి జాతీయ, ప్రపంచ కంపెనీల నుంచి రాష్ట్రానికి పెద్ద పెట్టుబడులు తరలివచ్చాయి.

టిఎస్..ఐపాస్ ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 3938 కొత్త పరిశ్రమల ద్వారా రూ.17,867 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 96,863 మందికి ఉపాధిని కల్పించింది. మొత్తంగా ఎనిమిదేళ్లలో రూ.2,32,311 కోట్ల పెట్టుబడులను సాధించినట్లు అయింది. 16.48 లక్షల ఉద్యోగాలను కల్పించింది. ఇక టిఎస్‌ఐఐసి ద్వారా 13 కొత్త ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసింది. ఇందులో 526 పరిశ్రమలకు 810 ఎకరాల భూమిని రూ. 6,123 కోట్లను రాబట్టింది. ఇక లైఫ్ సైన్సెస్, ఫార్మా – రంగంలో రూ. 6,400 కోట్లు ప్రతిపాదనలను రాబట్టింది. ఇది 2020…2021 ఆర్ధిక సంవత్సరం కంటే సుమారు 200 శాతం ఎక్కువ. ఇక జీనోమ్ వ్యాలీ క్లస్టర్లో మొత్తం రూ. 500 కోట్లు సాధించింది.

ఇక 10వేల ఎకరాల ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. అలాగే అమూల్ పాల ఉత్పత్తి సంస్థ రూ. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. కాగా ఫిషిన్ కంపెనీ రూ. 1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద పూర్తి సమీకృత మంచినీటి చేపల పెంపకం పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. హిందూస్తాన్ కోకకోల బ్రివరేజస్ సిద్దిపేటలోని బండతిమ్మాపూర్ పార్కులో రూ. 1000 కోట్ల పెట్టుబడిని పెట్టేందుకు సముఖతను వ్యక్తం చేసింది. ఇవి టెక్నాలజీస్ సంస్థ సంగారెడ్డిలో రూ. 1000 కోట్ల పెట్టుబడితో సమీకృత క్షిపణి సముదాయాన్ని ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో అధునాతన డిజైన్, తయారీ సంస్థను సుమారు రూ.1500 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ జర్మన్ కంపెనీ అయిన లిటియుటో జిఎంబిహెచ్ సంస్థ ముందుకు వచ్చింది. వన్‌మోటో సంస్థ రూ. 250 కోట్లు దేశంలో తన మొదటి ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సముఖతను వ్యక్తం చేసింది. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్) రూ. 1000 కోట్లతో తన వ్యాపారాన్ని రాష్ట్రంలో విస్తరించనుంది.

నాలుగు కంపెనీలతో ఎంఒయులు చేసుకున్న ప్రభుత్వం

వార్షిక నివేదిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కంపెనీలతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో మ్యాన్‌కైండ్ కన్సుమర్ హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 159 కోట్లతో ప్రపంచ స్థాయి పెంపుడు జంతువుల ఆహార తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ ఏరియాలో నాణ్యమైన చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఒక హై ఎండ్ యూనిట్‌ను స్థాపించడానికి 3ఎఫ్ పరిశ్రమల సంస్థ రూ. 123 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రవి ఫూడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 115 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులో బిస్కెట్లు, వేఫర్లు, చాక్లెట్ల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

మోటా ఫోర్ సంస్థ రాష్ట్రంలో ఇవి కంపెనీ విస్తరణ కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్‌ఐఐసి చైర్మెన్ బాలమల్లు, టిఎస్‌ఐఐసి ఎండి వెంకట నరసింహా రెడ్డి, రాష్ట్ర ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్‌తో పాటు పలువురు పారిశ్రమికవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News