Monday, December 23, 2024

కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!

- Advertisement -
- Advertisement -

నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా వెళ్ళాయి. ప్రభుత్వం ఇలా సెన్సార్‌షిప్ అమలు చేయడం కొత్తకాదు. జమ్ముకశ్మీర్‌లో ‘మీడియా విధానాన్ని’ 2020 జూన్ 2వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘తప్పుడు వార్తలు, చౌర్యం, అనైతికం, జాతి వ్యతిరేక సమాచారాన్ని అదుపు చేయడానికని చెప్పి ఈ విధానాన్ని తెచ్చింది. ఇదెలా ఉందంటే కశ్మీర్‌లో భద్రతా వ్యవస్థ తుమ్మితే, దేశమంతటికీ జలుబు చేసేలా ఉంది.ఈ ప్రయోగాన్ని పత్రికా రంగానికి పరిమితం చేశారు.

దీన్ని తొలుత కశ్మీర్ అనే ప్రయోగశాలలో ఉక్కు బూట్లు తొడుక్కున్న ల్యాబ్ టెక్నీషియన్లు నిర్వహించారు. హద్దులు దాటిన ఈ మార్గం మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవేనని స్పష్టమవుతుంది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే 370వ అధికరణాన్ని రద్దు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయి, త్వరలో అయిదవ ఏడాదిలోకి అడుగిడబోతున్నాం. ఈ రద్దుకున్న రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపైన సుప్రీంకోర్టు కూడా చివరి విచారణకు సిద్ధమైంది. రాజ్యాంగపరమైన విచారణను ఆలస్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు విచారణకు జులై 11న విధివిధానాలను రూపొందించింది. కశ్మీర్ లో ప్రభుత్వ విధానాన్ని రూపొందించడంలో పత్రికలను ఎలా అదుపు చేయాలనేది ప్రధాన సమస్యగా తయారైంది.

పత్రికలను అదుపు చేయడం, సైన్యాన్ని సమీకరించడం రెండూ నాలుగేళ్ళ క్రితం కలగలిసి పని చేశాయి. ఒక స్థూల అంచనా ప్రకారం కశ్మీరులో అదనపు బలగాలుగా ఏడు లక్షల సైన్యాన్ని శాశ్వతంగా దించాలని భావించారు. ఉన్నట్టుండి ఆ ప్రాంతమంతా పత్రికా రంగం చూడడానికి వీలులేని స్థితికి తెచ్చారు. ఈ పని చాలా క్రూరంగా, అపనమ్మకంతో కూడుకున్నవిగా చేసింది. రాజకీయ నాయకుల అరెస్టు బహిర్గతమైన వార్తను 2019 ఆగస్టు 4వ తేదీన బాగా పొద్దుపోయాక ఎలా పంపాలో తెలియక స్థానిక జర్నలిస్టులు చాలా ఇబ్బందిపడ్డారు. రాత్రి పన్నెండున్నర నుంచి స్థానికంగా ఇంటర్‌నెట్ పనిచేయడం ఆగిపోయింది. ల్యాండ్‌లైన్లు సహా ఫోన్లన్నీ మూగవోయాయి. టెలివిజన్ స్క్రీన్లు మాత్రం కాస్త కనిపిస్తున్నాయి. “చీకటిపడడానికి కొన్ని గంటల ముందు ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిపోయింది. తెల్లారేసరికల్లా ఒకరి ద్వారా ఒకరికి, ప్రతి కశ్మీరీ పౌరుడికీ పరిస్థితి తెలిసిపోయింది’ అని ఆ రోజు రాశాను. జర్నలిస్టులకు మాత్రం వృత్తిపరంగా మృత్యువు ఒడిలోకి జారుకుంటున్నట్టే అనిపించింది. కర్వ్యూ పాసుల కోసం, వార్తా సేకరణకు అవసరమైన పాస్‌ల కోసం పరుగులు పెడుతున్నారు.

పత్రికలు వార్తలతో రెండు పేజీలు నింపడానికి కూడా చాలా అవస్థలు పడుతున్నాయి. వివాహాల రద్దు గురించిన ప్రకటనతో పత్రికలు నిండిపోయాయి. వార్తల ప్రసారంలో అనేక ఆటంకాలు ఏర్పడ్డాయని గమనించారు. సందేశం స్పష్టమైపోయింది.కశ్మీర్ పూర్తిగా దిగ్బంధంలోకి, ఏకాంతంలోకి వెళ్ళిపోయిందన్న మాట సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘ద కశ్మీరి టైవ్‌‌సు’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా బాసిన్ ‘ఎ డిస్‌మాంటల్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ ఆర్టికల్ 370’ అన్న తన పుస్తకంలో క్లుప్తంగా ఇలా రాశారు. “లోపల, బైటా కశ్మీర్‌ను అవమానపరచడానికి 2019 ఆగస్టు 5వ తేదీన పత్రికలను స్తంభింపచేశారు.దాంతో జర్నలిస్టులు, జర్నలిజం అదృశ్యమైపోయింది”. క్రమంగా జర్నలిస్టులకు సమన్లు పంపి, పోలీసులు మాటిమాటికీ వారిని వేధించడం సర్వసాధారణమైపోయిందని ఆమె రాశారు. “ఎంత మంది జర్నలిస్టులు ‘కార్గో’ అనే కౌంటర్ ఇన్‌సర్‌జెన్సీ కేంద్రం కోపాన్ని చవిచూశారో కచ్చితమైన లెక్కలు లేవు. కానీ, మూడు డజన్ల కేసులు మాత్రం వెలుగు చూశాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చు. కానీ, బహిరంగంగా చెప్పలేకపోతున్నారు”అని ఆమె పేర్కొన్నారు.

కశ్మీర్‌పైన వివరంగా రాయడాన్ని ఒక్క దెబ్బతో ప్రభుత్వం అడ్డుకుంది. కేంద్ర ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి, ప్రతిఘటనకు సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా బయటికి రాకుండా నొక్కేసింది. జాతీయ మీడియా మోడీ చర్యలను సమర్థించినా, స్తుతించినా కూడా ఆ వార్తలను కూడా రానీయకుండా చేసింది. ప్రైవ్‌ుటైవ్‌ు వార్తల్లో ‘కశ్మీరు మనది’ అని అందమైన కథనం, సామాజిక మాధ్యమాల్లో 370 ఆర్టికల్ గురించిన కథనం వైరల్ అయ్యాయి. రాష్ర్టంలో పత్రికల నోరు నొక్కేస్తున్నారనే ఆరోపణను ప్రభుత్వం ఏకపక్షంగా తిరస్కరించింది. జమ్ము కశ్మీర్‌లో పత్రికల స్వేచ్ఛ కొరవడడంపై కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ప్రశ్నించారు. “ఇది వాస్తవం కాదు. దూరదర్శన్ పని చేస్తోంది. ఆకాశవాణి అన్ని భాషల్లో ప్రసారమవుతోంది” అని ఆయన సమాధానం చెప్పారు.
కశ్మీర్ శాంతియుతంగా ఉందనే విషయాన్ని ప్రచారం చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. విజయవంతంగా 370వ అధికరణం రద్దు అయిపోయిందనే మాటను ప్రచారం చేస్తున్నారు.

దీనికి సాక్ష్యంగా ‘తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల’లో జాతీయ భద్రతా సలహాదారు ఎ.ఎస్.దోవెల్ పర్యటించినట్టు జాతీయ మీడియాలో విశేషంగా చూపించారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో ఇంటర్‌నెట్ ఆపేశారు. 2019 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు ప్రపంచంలోనే దీర్ఘకాలం కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ ఆపేసినట్టు నమోదైంది. ఒకసారి ‘శాంతి’ నెలకొన్నట్టయితే, తరువాతి దశ ‘సాధారణ స్థితి’ ఏర్పడుతుంది. నేటి వరకు ఈ పరిస్థితి కొనసాగడానికి చర్యలు చేపట్టారు. శ్రీనగర్‌లో గడిచిన మేలో జి20 దేశాల సమావేశంలో హాజరవడానికి ప్రతినిధులు వస్తున్న సందర్భంగా ‘సాధారణ స్థితి’ ఏర్పడిందని చెప్పడానికి నానాయాతనపడ్డారు. పోలీస్ ఔట్ పోస్టులున్న బోర్డులన్నీ ప్రతినిధులకు స్వాగత బోర్డులుగా తయారయ్యాయి. రాత్రి పగలు షాపులు తెరిచి ఉంచారు. కశ్మీర్‌ను ‘సాధారణ స్థితి’ని తీసుకువచ్చామని చెప్పడానికి ఒక ఎత్తుగడగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నిరసనలు, ప్రదర్శనలు, రాళ్ళు విసరడం ఎక్కువకాలం జరగలేదని, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు సాధారణంగా జరిగిపోతున్నాయని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చింది. “తీవ్రవాద చర్యలు చేపట్టడం వల్ల తీవ్రవాద వాతావరణాన్ని తుడిచిపెట్టేశాం.

ఫలితంగా 2018లో టెర్రరిస్టుల భర్తీ సంఖ్య 199 ఉండగా, 2023 నాటికి అది 12కు పడిపోయింది” అని పేర్కొంది. పత్రికలను తమ వైపు తిప్పుకోవడంలో భాగంగా ప్రభుత్వం వారి చేత ‘తీవ్రవాద వ్యతిరేక చర్యల తీర్మానం’ చేయించింది. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం పత్రికల వారిని దగ్గరకు చేర్చుకోవడానికి అనేక చర్యలు చేపట్టింది. తీవ్రవాద చట్టాలను ఉపయోగించి జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి ప్రెస్‌క్లబ్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. అన్ని స్వతంత్ర సమాచార ప్రవాహాల్ని అడ్డుకోవడమే ‘సాధారణ స్థితి’ అని నిర్వచిస్తే, బెదిరించడం ద్వారా ప్రజల నోర్లు మూయించడం, అరెస్టులు చేయడం, ఇంటర్‌నెట్‌ను నిలిపివేయడం (జమ్ము, కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ను 24 సార్లు నిలిపివేశారు), ఏళ్ళ తరబడి ఎన్నికలు నిర్వహించకపోవడమే ‘సాధారణ స్థితి’ అయితే కశ్మీర్‌లో సాధారణ స్థితి ఏర్పడినట్టే లెక్క. ఇలాంటి ‘సాధారణ స్థితి’నే ప్రజాస్వామ్యంగా నిర్వచిస్తామా అనేది ప్రశ్న.

పాకిస్థానీ జర్నలిస్టుల నిస్సహాయత
కరాచీకి చెందిన ‘డెయిలీ జెంగ్’ అన్న పత్రికకు పని చేస్తున్న పాకిస్థాన్ సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ మహ్మద్ అస్కరిని ఈనెల 8వ తేదీ అర్ధరాత్రి మఫ్టీలో ఉన్న పోలీసులు ఎత్తుకుపోయారు. పాకిస్థాన్‌లోనే కాకుండా మొత్తం దక్షిణాసియా అంతా అతని అదృశ్యం హెచ్చరిక గంటలా మోగింది. ఇలాంటి అదృశ్య సంఘటనలు విషాదాంతమవుతాయి. హాంగ్‌కాంగ్ కేంద్రంగా పని చేసే ‘ఆసియా టైవ్‌‌సు’ కు పని చేస్తున్న సలీవ్‌ు షాహజాద్ 2011 మేలో అదృశ్యమవడంతో రెండు రోజుల తరువాత అతని శవం ఒక కాలువ గట్టుమీద కనిపించింది. చిత్రహింసలు పెట్టి చంపినట్టు అతని శరీరంపై ఉన్న ఆనవాళ్ళ ద్వారా తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారుల్లో ఉన్నతస్థాయిలో అతనికి శత్రువులు ఉన్నారన్న సూచనలు వెల్లడయ్యాయి.

నౌకాదళ అధికారులతో కలిసి ఆల్‌ఖైదాతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల మూల్యంగా ప్రాణాలను పోగొట్టుకోవలసి వచ్చింది. ‘డాన్ న్యూస్’, ‘ఆజ్ న్యూస్’, ‘ఎఆర్‌వై టీవి’ లకు రిపోర్టరుగా పని చేసిన అనుభవమున్న అర్షద్ షరీఫ్‌ను కెన్యాలోని నైరోబీలో కాల్చి చంపేశారు. సైన్యంలోని ఉన్నతాధికారుల్లో ఉన్న అవినీతిని బట్టయలు చేసే కథనాలను ఆయన రాశాడు. కాల్చి చంపడానికి ముందు అతన్ని చిత్రహింసలు పెట్టారు. నిజాయితీ గల జర్నలిస్టులకు పాకిస్థాన్ ఒక ప్రమాదకరమైన ప్రాంతం. మాయం చేయడం, కిడ్నాప్ చేయడం, జైళ్ళలో నిర్బంధించడం, చిత్రహింసలు పెట్టి చంపే అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో పాకిస్థాన్ అయిదవ స్థానంలో ఉందని ‘ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్’ వెల్లడించింది.

వేరే దేశాలకు వెళ్ళిపోయినా రక్షణ ఉంటుందన్న నమ్మకం లేదు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో తలదాచుకుంటున్న తహ సిద్ధికి అనే జర్నలిస్ట్ 2019లో ‘ద వాషింగ్టన్ పోస్ట్’ లో ఇలా రాశాడు. “2018 జనవరి 10న ఇస్లామాబాద్‌లోని జాతీయ రహదారిపైన నేను ప్రయాణిస్తున్న టాక్సీని సాయుధులు ఆపి నన్ను ఎత్తుకుపోవడానికి, చంపడానికి ప్రయత్నించారు. అయినా నేను తప్పించుకున్నాను. ఈ దాడికి పాకిస్థాన్ సైన్యం రూపకల్పన చేసింది. పాకిస్థాన్ సైన్యంలో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేయడం వల్లనే ఏళ్ళ తరబడి అతన్ని బెదిరిస్తోంది. సిద్ధిఖి పాకిస్థాన్ సైన్యంలో అవినీతిని బహిర్గతం చేయడం వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. ‘అజ్ఞాతంలో ఉన్నా.. అభద్రతలోనే ఉన్నా’అని అతను వెల్లడించాడు. పాకిస్థాన్‌లో ఈ విధంగా స్వతంత్ర జర్నలిజం వర్ధిల్లుతోంది.

ప్రముఖ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా ఇలాంటి నిర్బంధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కీలక సమయంలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ ‘పాకిస్థానీ టైవ్‌‌సు’కు ఎడిటర్‌గా పని చేశాడు. తిరుగుబాటుకు యత్నిస్తున్నాడని ఫైజ్‌ను అరెస్టు చేశారు. అది రావల్పిండి కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది. ఫలితంగా మరణశిక్ష విధించవచ్చన బెదిరింపుల మధ్య నాలుగేళ్ళు జైల్లో గడిపాడు. సయ్యద్ మొహమ్మద్ అస్కరీని ఒక రోజు తరువాత తిరిగి పంపించేశారు. అతనొక టెలివిజన్ ఛానల్‌లో మాట్లాడుతూ, తన కళ్ళకు గంతలు కట్టి, ఒక వాహనం నుంచి మరొక వాహనంలోకి ఎలా మార్చి, తిప్పులు తిప్పి ఒక గదిలో ఎలా బంధించారో వివరించాడు. తనను ఎందుకు నిర్బంధించింది, ఎందుకు ఒదిలేసిందీ తెలియదని చెప్పాడు.

మూలం పామెలా ఫిలిపోస్
అనువాదం రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News