Sunday, December 22, 2024

తగలబడుతున్న భవనాలు -బిజెపి, కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

2022 Indian presidential election

భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మును గెలిపించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఎంపిలు, ఎంఎల్‌ఎలకు ఇచ్చిన పిలుపు ప్రకటనలో కమలానికి లేని సుగుణాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. చాలా గమ్మత్తుగా దీనదయాళ్ ఉపాధ్యాయ్‌తో పాటు అంబేడ్కర్, మహాత్మాగాంధీల ఆశయాలను కూడా ఆచరణలో పెడుతున్నామని, నడ్డా చెప్పుకోవడం “నోటితో చెప్పి నొసటితో వెక్కిరించడం” అనే సామెతను రాజకీయ ఆలోచనపరులందరికీ గుర్తు చేస్తుంది. నడిచి వచ్చిన తొవ్వలో నాటి వచ్చిన విష విత్తనాలను నరేంద్ర మోడీ, పరివార్ దాచిపెట్టాలనుకున్నా సాధ్యపడదు కదా…! కమలం పురిట్లోనే తన నుదిటి మీద సువర్ణాక్షరాలతో చెక్కుకున్న మూల సిద్ధాంతాన్ని మూసిపెట్టుకొని, నేటికీ న్యాయం ఆశిస్తున్న జనరాశులను వంచిస్తామనుకోవడం విచిత్రంగానే ఉంది.అంకెల లెక్కల్లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అన్నది ఏనాడో తేలిపోయింది. ఆ మాటకొస్తే ఎన్నికల సమరంలో గెలుపు, ఓటమిలు కొత్త కథలేమి కాదు. కానీ ‘కర్ణుడి కవచకుండలాలు’ దానమడిగి నెగ్గినట్లుగా, బిజెపి వేస్తున్న ఎన్నికల ఎత్తుగడలపట్ల సమాజం జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఏర్పడింది.

వలలో పడటానికి వేటగాడు తన కపటత్వాన్ని దాచుకొని విసిరే మాంసపు ముక్కల్లానే కమలం మనకు నలుగురిని చూపెడుతున్నది. కానీ ముత్తాత మనువు నుంచి మొదలుకొని తరాల పొడుగునా రహస్యంగా ‘చెవిలో నూరిపోసిన’ నాటు వైద్యాన్ని కాషాయదళం వదులుకుంటుందా..? బలవంతుడిదే రాజ్యమనే సిద్ధాంతమే రాజీలేని సూత్రంగా సాగాలని, గురూజీ గోల్వాల్కర్ “సంఘేయులకు” ఉపదేశించిన మనుగడ మర్మాన్ని విసిరేసి నరేంద్ర మోడీ వందిమాగధులు ముందుకు నడవగలరా..? ‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానే పోదు’ అన్నట్లుగా, ఆవిర్భావంలోనే బిజెపి సరిచేసుకోలేని మనో వైకల్యాన్ని పొందిం ది.దాన్ని అధిగమించి అట్టడుగు వర్గాలవైపు, అన్నార్తుల ఆశలదిశగా భారతీయ జనతాపార్టీ హృదయం స్పందిస్తుందని లోతైన దృష్టికోణం కలిగిన వారెవ్వరూ భ్రమపడజాలరు.

దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అయినా పొందాల్సింది విస్తారాన్ని కాదు ప్రశంసనీయమైన స్థానాన్ని. కానీ “నోట్లో బెల్లం కడుపులో కత్తులు”తత్వాన్ని వంటబట్టించుకున్న భారతీయ జనతా పార్టీ నాయకగణం ఆక్రమణ కోసం వలలు విసురుతున్నది. ఫలాలెన్ని వడ్డించినా… పంజరంలో పావురం బతుకెంత దుర్భరమో, బిజెపిలో కూడా బడుగుల భవిష్యత్ అంతే వాస్తవము. గురుదక్షిణగా ఏకలవ్యుడి బొటన వేలు ఆశించిన గురువులాగా, భారతీయ జనతా పార్టీ పేద వర్గాల వసంతాన్ని బలి కోరుతున్నదనే రాజకీయ సత్యాన్ని అసమానతలు మోస్తున్న సమాజం అర్థం చేసుకోవాలి. “గోముఖ వ్యాఘ్రంతో” గడపల్లోకి చొరబడాలని చూస్తున్న కమలం పార్టీ కుయుక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా బడుగు వర్గాల్లోని వివేకవంతులందరిదే. మూల స్వభావాన్ని వదిలిపెట్టకుండానే, అవసరాల కోసం ఊసరవెల్లి వేషాలు వేస్తున్న బిజెపి బుట్టలోపడితే, దెబ్బతినేది, మధ్యయుగాల నాటి అంధకారంలోకి జారిపడేది, బడుగు జనాల రేపటి తరమేనన్న నిజాన్ని, నిత్యం ఎరుకలో ఉంచుకోవాలి. జనం లో బలం పెంచుకోవడానికి జనతా పార్టీతో జట్టుకట్టిన జనసంఘ్, ద్విసభ్యత్వం విషయంలో జయప్రకాశ్ నారాయణ అంతటి నేతకే మాటిచ్చి ముంచింది.

ఇప్పుడు “తొండ ముదిరి ఊసరవెళ్ళి” అయ్యినట్లుగా జనసంఘ్ బిజెపిగా ఎదిగినా, నమ్మిన చేతులను తెగనరకడంలో మిత్రపక్షాలైనా లేదా మహజనులైనా దానికి ఒక్కటే. ముంబాయి శివాజీ పార్క్ మైదానంలో 1980 డిసెంబర్ 29న జరిగిన బిజెపి మొదటి బహిరంగ సభలో తొలి అధ్యక్షుడు వాజ్‌పేయి ప్రసంగిస్తూ కోరుకున్నట్లుగానే “కమలం వికసించింది, కానీ దళమే వాడిపోతున్నది. ఆవిర్భావం నుంచే ఆధిపత్యం, ఆక్రమణ, అధికారమే అంతిమ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రస్థానం సాగిందేకాని దేశంలోని అంతరాలను సరిచేసే దిశగా ఏనాడు ప్రయత్నించలేదు. కాంగ్రెస్ పార్టీ తప్పిదాల నిచ్చెన ఆసరాగా ఎదిగిందే కానీ దేశం కన్నీళ్ళను తుడుస్తూ బలపడలేదు. అసమాన వ్యవస్థకు తరాల పాటు వేలాడిన బాధితులు, స్వతంత్ర దేశంలో భాగస్వామ్యం కోసం తండ్లాడిన ప్రతి సందర్భంలోను బిజెపి కళ్ళకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడిలానే వ్యవహరించింది. పైగా దారి తప్పించే మాయోపాయాలను ఆచరణలో పెట్టి తరించింది. దేశంలోని 50 శాతంపైగా కలిగిన బిసిలు న్యాయం కోసం రాజేసిన మండల్ మంటలను, కమండల్ వైపు మళ్ళించేందుకు కుట్రలు చేసింది భారతీయ జనతాపార్టీ. ఇప్పటికీ బిసిల అసలు డిమాండ్‌లను అణచిపెడుతూనే ఉన్నది. అలాగే షెడ్యూల్డ్ కులాలపైన అత్యాచారాలు, అమానవీయ దాడులు సాగుతున్నా అండగా నిలిచే దిశగా కమలానికి కాళ్ళురావు. వర్గీకరణతో పాటు అనేక డిమాండ్‌ల పట్ల అవసరాల ప్రేమనే వొలకబోస్తున్నది. ఇక ఎస్‌టిలపైన ఉక్కుపాదం మోపుతున్నదే కాని కమలం ఏనాడు చెయ్యందించిందిలేదు.

కనీస అవసరాల కోసం యుద్ధం చేస్తున్న ఆదివాసుల ఊపిరి తీస్తున్న నరేంద్ర మోడీ పరివారం, ద్రౌపది ముర్మును చూసి ఆనందపడమనటం ఆవేదన కలిగించదా…? ఇక దేశంలోని మైనారిటీల పట్ల భారతీయ జనతా పార్టీ దృక్పథం నగ్నంగానే వెల్లడౌతున్నది. విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, న్యాయస్థానాలు అన్నింటిలో 75 ఏండ్లుగా అసమానతలు పెరిగిపోతుంటే మౌనం అంగీకార పత్రం అన్నట్టుగానే బిజెపి వ్యవహరించింది. కమలం పాలిత రాష్ట్రాలలో దళితులపైన అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, నిలువరించే పాలనా చర్యలు శూన్యం. పైగా విశ్వగురువు స్వంత గడ్డ గుజరాత్‌లో నిర్భాగ్యుల గుండె గాయాలపైన, నిలదీసిన జిగ్నేష్ మేవానికి బిజెపి సర్కార్ బేడీలే బహుకరించింది. దేశం ఆకాంక్షల పట్ల బాధ్యతలేని తనంతో, రాజ్యాంగ విలువలపట్ల విశ్వాసంలేని బిజెపి నాయకులు హక్కుల ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపుతున్న తీరు మీద మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మేధావులు వందలాది మంది ఆవేదనాస్త్రాలు సంధిస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ సర్కార్, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ, ప్రైవేట్‌కు దేశాన్ని అప్పగిస్తూ భవిష్యత్ తరాలకు ఖాళీ కుండలను మిగిలుస్తున్నది.

ఈ అన్యాయమైన పాలనలో అట్టడుగు జనానికి అన్నీ అందని ద్రాక్షలేకాని అనుభవంలోని వచ్చేది ఏమీ ఉండవు. గడిచిన ఎనిమిదేండ్ల భారతీయ జనతాపార్టీ పరిపాలనా కాలంలో దేశంలో అమలైన దళిత, ఆదివాసి, మైనారిటీ, బిసి వర్గాల వ్యతిరేక పాలనా చర్యలను గ్రంథస్తం చేస్తే అతిపెద్ద “మహాదుర్నీతి భారత” గ్రంథమౌతుంది.చరిత్రకు వేలాడిన గబ్బిలాలలాగ కాంగ్రెస్, బిజెపిలు అవసరమైన వర్గాలకు కావాల్సింది అందివ్వటంలో పాపాల పిసినారులుగానే ప్రవర్తించారు. పేద వర్గాల ప్రజలు ప్రతిదాని కోసం ప్రాణం పెట్టి పోరాడాల్సిన దిక్కులేని దుస్థితిని జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు కల్పించాయి. ఈ రెండు పార్టీల పాలనలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కనీస అవసరాల డిమాండ్ సాధన కోసం ప్రజల నెత్తురు ధారపోసేలా చేశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కోవటానికి గంగా, బ్రహ్మపుత్ర నదుల్లోని నీరు కూడా సరిపోదు. “ఉండబట్టలేక ఓటేస్తే ఉన్న బట్టా లాక్కునట్టు” అని తెలంగాణ కవి చెరబండరాజు అన్నట్లుగానే భారతీయ జనతాపార్టీ ఎనిమిదేండ్లుగా అట్టడుగు జాతుల నుంచి అన్నీ లాగేసుకునే విధానాలనే అమలు చేసింది. అది దాచిపెట్టి అన్ని వర్గాలకు అందలాలు అప్పగిస్తున్నామని కమలం పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సంపన్న వర్గాల ఒడిలో కూర్చున్న బిజెపి, సామాన్యుల జేబులు దోచిపెడుతున్న సత్యాన్ని కప్పిపెట్టలేరు కదా..! అస్తవ్యస్త విధానాలతో జాతులను కబేళాకు తరలిస్తూ, అందులోంచి నలుగురిని చూపుడు గుర్రాలుగా తీర్చిదిద్దుతామంటే న్యాయమా..?

సామాజిక న్యాయానికి ఛాంపియన్‌గా ఊరేగాలని ఉబలాటపడుతూ బిజెపి చేసుకుంటున్న ప్రచారం పన్నుతున్న వ్యూహాలు చూసి నమ్మితే “పులినోట్లో తలపెట్టినట్లే” అవుతుంది. హెడ్గేవరిజం అనుసరిస్తూ పెరియారిజం పాఠాలను వల్లిస్తున్న భారతీయ జనతాపార్టీ నాయకుల తీరు ప్రమాదకరంగా దాపురించింది. పేద కులాల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా నిలబడే సంక్షేమ పథకాలను నరేంద్ర మోడీ “జీడీ”లతో పోలుస్తున్నాడు. ఉచిత విద్య, వైద్యం, రైతాంగ సంక్షేమం లాంటి పథకాలను ప్రభుత్వాలు వదిలించుకోవాలని ప్రధాని పిలుపునిస్తున్నాడు. కార్పోరేట్‌లను కాపాడటం విధిగా సర్కార్‌లు మసలు కోవాలి కాని పేదల కోసం ఆలోచించడం నేరమని నరేంద్ర మోడీ సూత్రీకస్తున్నాడు. రెండు మూతుల విషనాగులాగా సంక్షేమాన్ని చంపేస్తూ, సామాన్యులను అధికారంలోకి తెస్తామనడం వారికే చెల్లుతుంది. పునాదుల్లో సామాజిక న్యాయాన్ని పేర్చకుండానే, పైపై మెరుపులతో ఆకర్షించాలనే అన్యాయమైన బిజెపి విధానాలు హాస్యాస్పదం. దేశ రాజకీయ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ తయారీలోనే లోపమున్నది. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, జాతి సమైఖ్యత, సమగ్రతల సాఫ్ట్‌వేర్‌ను కమలం యంత్రాగంలో పొందుపరచనే లేదు.

అందువల్ల బిజెపి ఎత్తుగడలన్నీ సామాన్యులను వంచించే దిశగానే ఉంటాయి. గుప్పెడు మందిని వర్తమానపు మోహజాలంలో బంధించడం ద్వారా, గుంపులన్నిటినీ మలుపుకోవాలని కమలం పార్టీ ప్రయత్నిస్తున్నది. కానీ బుద్ధిజీవులైన సామాన్యులందరూ దృష్టి సారించాల్సింది ఉపరితలంలో మెరుపులపైన కాదు పునాదిలో విధ్వంసంపైన. వేటగాడు ఒక జీవిని మచ్చిక చేసుకొని, మందను పట్టుకొని పోయే ఎత్తులు వేస్తున్నాడు. ఆ కుయుక్తులకు చిక్కితే దేశమే అనాగరిక నిలయంగా మారుతుంది. ఇదే తరహాలోనే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నెగ్గడానికి మాత్రమే వ్యూహాలు పన్నుతూ, దేశాన్ని గెలిపించే దిశగా మనసుపెట్టలేకపోయింది. ఆ విషవ్యూహాల ఫలితంగానే భారతదేశం భవిష్యత్‌ను కోల్పోయింది. ఇప్పుడు అవే పనికిమాలిన పన్నాగాలను పట్టుకొని బిజెపి అడుగులు వేస్తున్నది. కానీ సమాజం అవగాహనతో ఎదురు తిరిగే సమయం వచ్చి తీరుతుంది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ విశ్లేషించేట్లుగా నిన్న కాంగ్రెస్, రేపు బిజెపిలు తగలబడుతున్న భవనాలు అంతిమంగా కెసిఆర్ చెప్పినట్లు ప్రజలే చరిత్ర నిర్మాతలు.

డా. ఆంజనేయ గౌడ్ (రాష్ట్ర మాజీ
బిసి కమిషన్ సభ్యులు)
9885352242

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News