Friday, December 27, 2024

వైద్యశాస్త్రంలో స్వాంటె పాబోకు 2022 నోబెల్ బహుమతి

- Advertisement -
- Advertisement -

2022 Nobel Prize in Medicine for Svante Pabo

స్టాక్‌హోం : వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను స్వీడిష్ జన్యుశాస్త్రవేత్త స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం 2022 వరించింది. మానవ పరిణామక్రమంతోపాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్ లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం దీనిని ప్రకటించింది. నోబెల్ కమిటీ ఫర్ ఫిజియాలజీ (మెడిసిన్ ) సెక్రటరీ థామస్‌ఫెర్ల్‌మాన్ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోం లోని కారోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు.

పాబో తన మార్గదర్శక పరిశోధన ద్వారా అసాధ్యంగా అనిపించే దాన్ని సాధించారు. ఇప్పటి మనుషులకు అంతరించిపోయిన బంధువైన నియాండర్తల్ జన్యువును క్రమం చేయడం, డెనిసోవా అనే ఇంతకు ముందు తెలియని హోమినిన్‌కు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణను చేసిన పాబో … 70 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తరువాత ఇప్పుడు అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్‌లకు జన్యు బదిలీ జరిగిందని కూడా కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. గతేడాది మాత్రం ఉష్ణగ్రాహకాలు, శరీర స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా నోబెల్ బహుమతి అందుకున్నారు.

వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం రోజున సాహిత్య విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 10న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News