హరారే: వరల్డ్‌కప్ క్వాలిఫయర్ టోర్నీలో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన జింబాబ్వే 40.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు జైలార్డ్ గుంబి, క్రెగ్ ఇర్విన్ శుభారంభం అందించారు. గుంబి ఐదు ఫోర్లతో 40 పరుగులు చేశాడు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఇర్విన్ 9 ఫోర్లతో వేగంగా 50 పరుగులు సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. మరోవైపు సికిందర్ రజా విధ్వంసక శతకంతో జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెలరేగి ఆడిన సికందర్ 54 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు.మరోవైపు సీన్ విలియమ్స్ కూడా కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో తనవంతు పాత్ర పోషిచాడు.
దూకుడగా ఆడిన విలియమ్స్ 58 బంతుల్లోనే పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. ఇటు విలియమ్స్, అటు సికందర్ రజా దూకుడుగా ఆడడంతో జింబాబ్వే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు విక్రంజీత్ సింగ్, మాక్స్ డౌడ్ శుభారంభం అందించారు. డౌడ్ పది ఫోర్లతో 88 పరుగులు చేశాడు. విక్రంజీత్ 9 ఫోర్లతో 88 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ఎడ్వర్డ్ 8 ఫోర్లతో వేగంగా 83 పరుగులు చేశాడు. సాకిబ్ జుల్ఫికర్ 34 (నాటౌట్) కూడా ధాటిగా ఆడడంతో నెదర్లాండ్స్ స్కోరు 315 పరుగులకు చేరింది.