Monday, November 18, 2024

ఎన్‌సిఇఆర్‌టి తొందరపాటు!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంలో బిజెపి బుర్రలో పుట్టిన పురుగే దేశాన్ని ఇక నుంచి ఇండియా అని పిలవడం మానుకోవాలన్నది. అందుకు బదులుగా భారత్ అని మాత్రమే సంబోధించాలని దేశ పాలక పార్టీ అప్పుడు సంకల్పించింది. ఆ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందు ఆహ్వానాల్లో ఆమె తనను తాను భారత రాష్ట్రపతిగా చెప్పుకొన్నారు. ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే సంప్రదాయానికి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ గా పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోడీ ఇండోనేసియా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయనను ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని అలవాటు ప్రకారం పేర్కొనడానికి బదులు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని అన్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష కూటమి తన పేరును ‘ఇండియా’ గా వచ్చేలా పెట్టుకొన్నందున బిజెపికి వణుకు పుట్టి మొత్తంగా దేశం పేరునే మార్చాలనే దురాలోచన కలిగిందని అనుకొన్నారు. అది అక్కడితో ఆగిపోయిందనుకొంటే పొరపాటని రుజువు చేస్తూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) బుధవారం నాడు ఒక కీలక నిర్ణయం తీసుకొన్నది.

దేశంలోని విద్యాలయాల్లో గల అన్ని తరగతుల పాఠ్యగ్రంథాల్లోనూ ఇండియా అని వున్న చోట దానికి బదులుగా భారత్ అని చేర్చాలని నిర్ణయించింది. ఆ మేరకు ఎన్‌సిఇఆర్‌టి కమిటీ ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇండియా అనే పేరు రాజ్యాంగంలోనే వుంది. ఇండియా అనే భారత్ అని రాజ్యాంగం మొదటి అధికరణలోనే స్పష్టంగా పేర్కొన్నారు. దాని లోంచి ఇండియాను తొలగించినప్పుడు కదా ఆచరణలో ఆ పని జరగవలసింది! రాజ్యాంగంలోని ఇండియాను తొలగించాలంటే ఆ మేరకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగాలి. అది జరగకుండానే పాఠ్యపుస్తకాలను సవరించే అధికారం బిజెపి పాలకులకు ఎక్కడ వుంది? రాజ్యాంగం పట్ల తమకు బొత్తిగా గౌరవం లేదని వారు పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా ఉదాహరణ. ఇండియా అనే పేరు ఈస్టిండియా కంపెనీ నెలకొన్న తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిందని ఎన్‌సిఇఆర్‌టి కమిటీ అధినేత సిఐ ఇసాక్ చెప్పారు. అయితే అదే నోటితో ఇండియా పదానికి 5000 సంవత్సరాలకు మించిన చరిత్ర వుందని కూడా ఆయన అన్నారు.

నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే భారత్ కంటే ఇండియా అనే పేరే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వాడుకలో వున్నది. దేశ ప్రజల్లో జాతీయతా స్పృహను మితిమించి చొప్పించడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి అందరికీ తెలిసిందే. ప్రజల కనీస అవసరాల పట్ల బొత్తిగా బాధ్యత లేని బిజెపి పాలకులు ఇటువంటి అనవసరమైన రాద్ధాంతాలు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకొనే వ్యర్థ పోకడలను ఆశ్రయిస్తున్నారు. భారత్ అనే పదాన్ని కూడా చారిత్రక మూలాల స్పృహతో కంటే పౌరాణిక మూలాల అవగాహనతోనే వారు అభిమానిస్తున్నారు. సిందూ నదీ ప్రాంతం కాబట్టి ఇండియా అన్నారు. ఇండియా అనే ఇంగ్లీషు పేరు మూలాలు గ్రీకులో వున్నాయని చెబుతారు. మెగస్తనీస్ రాసిన ఇండియా నుంచి వచ్చిందనే అభిప్రాయమూ వుంది. ఏమైనప్పటికీ ఇండియా పేరును పాఠ్యగ్రంథాల్లోంచి తొలగించడానికి ఇది సరైన సమయం కాదు, ఇప్పుడు అనుసరించింది సరైన పద్ధతి కూడా కాదు. ఎన్‌సిఇఆర్‌టి ఆదేశాల సమాచారం మీడియాకు వెల్లడైన తర్వాత ఆ సంస్థ నాలుక కరచుకొని ఇంకా అటువంటి ఉత్తర్వులను ఇవ్వలేదని వివరణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఎన్‌సిఇఆర్‌టి కమిటీ నిర్వాకం ఇంతటితో ఆగిపోలేదు. దేశ చరిత్రను కూడా హిందూత్వ దృష్టితో మార్చివేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. ప్రాచీన భారత చరిత్రను హిందూ రాజుల విజయాలతో నింపాలని సూచించింది.

ఇంత వరకు వారి ఓటములనే చరిత్రకెక్కించారని అందుకు బదులుగా హిందూ రాజుల విజయాలను ఘనంగా చూపించాలని నిర్ణయించినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇంతకంటే చరిత్ర పట్ల అపచారం వేరొకటి వుంటుందా? గతాన్ని అధ్యయనం చేసే వారే భవిష్యత్తును నిర్వచించగలరు అని అంటారు. ఈ దృష్టితో చూసినప్పుడు చరిత్ర అనేది వాస్తవాల వక్రీకరణ ఎంత మాత్రం కాకూడదు. బిజెపి పాలకులు కోరుతున్నట్టు భారత దేశ పురాతన చరిత్రను హిందుత్వీకరిస్తే అది అబద్ధాల పుట్టగా మారే ప్రమాదమున్నది. అప్పుడు వాస్తవ చరిత్ర తెలుసుకోడానికి మన విద్యార్థులు వేరే గ్రంథాలను ఆశ్రయించవలసి వస్తుంది. వలస పాలకుల నాటి నిర్ణయాలన్నింటినీ ద్వేషించడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా చరిత్ర విషయంలో అనవసర జోక్యం మంచిది కాదు. కాని బిజెపి పాలకులకు ఈ హితవు బొత్తిగా చెవికెక్కదు. యుద్ధాల్లో, ఘర్షణల్లో విజేతలు రాసుకొన్నదే చరిత్ర అనే అభిప్రాయం వుంది. దానిని పూర్తిగా కొట్టి పారేయలేము. అందుచేత లోతైన అధ్యయనం, పరిశోధన ద్వారా లభించిన సమాచారం ఆధారంగా చరిత్ర నిర్మాణం జరగడం ఆరోగ్యకరమైన పద్ధతి. ఆ పద్ధతిని పాటించడం ద్వారా కూర్చిన చరిత్రను గౌరవించడం మన విధి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News