Wednesday, January 22, 2025

2023లో రసవత్తరంగా రాజకీయం

- Advertisement -
- Advertisement -

స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన కారు పార్టీ
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను హైదరాబాద్ ఆదుకున్నా కలిసిరాని కాలం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రణాళికలు
అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న బిఆర్‌ఎస్ అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్ : 2023లో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌కు 2023 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచి విజయఢంకా మోగించిన బిఆర్‌ఎస్ పార్టీ, 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం భారీ స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై కారు పార్టీ రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. అయితే సాధారణంగా ప్రతీ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీకి వెళ్లిన ప్రతీసారి గెలుస్తామని ఆశించే పోటీలో నిలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అప్పటి టిఆర్‌ఎస్, ప్రస్తుత బిఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చివరి వరకు భారీ మెజార్టీతో గెలుస్తామనే విశ్వాసంతోనే ఉంది. అయితే ఫలితాలు కొంత నిరాశ పరిచినా ఏమాత్రం బాధపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు బిఆర్‌ఎస్ మళ్లీ పోరాట మార్గాన్ని ఎంచుకుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీగా బిఆర్‌ఎస్ తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ధీటుగా సమాధానం చెప్పిన బిఆర్‌ఎస్ భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కేడర్ నిరాశ పడకుండా ప్రజల తరఫున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్రను నిర్వహించేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి.. సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.

1.85 శాతం ఓట్లతో అధికారానికి దూరం
2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కేవలం 1.85 శాతం ఓట్లతోనే అధికారానికి దూరమయ్యింది. బిఆర్‌ఎస్ ఈ ఎన్నికలు ఘోర అపజయం కాదు…స్వల్ప తేడాతో బిఆర్‌ఎస్ అధికారానికి దూరమయ్యింది. దాదాపు ఏడెనిమిది సీట్లు నాలుగైదు వేల ఓట్ల మెజారిటీతో పోయాయని ఇటీవల కెటిఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు జిల్లాల్లో సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం విజయధుంధుబి మోగించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీకి ఉన్న పట్టు సడలకుండా బిఆర్‌ఎస్ అధిష్టానం గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. బిఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలను విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తమ పట్టు నిలుపుకునేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో బిఆర్‌ఎస్ పటిష్టంగా ఉన్నదని, 2 శాతం కంటే తక్కువ ఓట్లతోనే అధికారం కోల్పోయిన విషయాన్ని పార్టీ కేడర్‌కు వివరిస్తూ అధినాయకత్వం పార్టీ కేడర్‌ను ఉత్సాహపరుస్తోంది. రానున్న పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లోను గులాబీ జెండాను ఎగిరేసేందుకు అందరమూ కలిసికట్టుగా పనిచేద్దామని బిఆర్‌ఎస్ అధిష్టానం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్ ఫోకస్
వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఫలితాలు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకుని నెమ్మదిగా కోలుకుంటున్నారు. మరికొన్ని రోజులలో కెసిఆర్ పార్టీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎన్నికల ప్రణాళిక ఏంటి, ఎలాంటి వారిని బరిలో దింపాలి అనే అంశాలపై కెసిఆర్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.

పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంతో పనిచేసినప్పటికీ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేడర్ ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్సాహం పనిచేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కెటిఆర్, హరీశ్‌ రావులతో పాటు పలువురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరును సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేసిన విధంగా రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియానే విసృతంగా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ పార్టీ వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News