Saturday, January 25, 2025

ఉత్తరాది చేతిలో దేశ భవిత!

- Advertisement -
- Advertisement -

సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు ఏమనుకొంటున్నారో తెలియజేసే గీటురాయి కానున్నాయి. ఇటీవల వెలువడిన కొన్ని జనాభిప్రాయ మచ్చులు మాత్రం బిజెపి హ్యాట్రిక్ ఖాయమని జోస్యం చెప్పాయి. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాదిరిగా వరుసగా మూడు సార్లు దేశాన్ని ఏలిన ఘనతను మోడీ మూటగట్టుకోగలరని అంచనా వేశాయి. 2023 డిసెంబర్ 18న వెలువడిన ద టైమ్స్ నౌ -ఇటిసి సర్వే బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమికి 2019 నాటి బలం కంటే అతి కొద్ది తక్కువ సంఖ్యలో లోక్‌సభలో స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టింది. 543 స్థానాలున్న లోక్‌సభలో ఎన్‌డిఎకి 323 స్థానాలు ఖాయమని, 28 జాతీయ, ప్రాంతీయ పక్షాల కూటమి ‘ఇండియా’ 163 సీట్లతోనే సరిపెట్టుకోవలసివస్తుందని ఈ సర్వే అభిప్రాయపడింది. ‘ఇండియా’ కూటమికి కేంద్ర బిందువుగా వున్న కాంగ్రెస్ పార్టీ 52- 72 స్థానాల వద్ద చతికిల బడుతుందని జోస్యం చెప్పింది.

పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. దేశం లోపల, బయట కూడా ఈ ఎన్నికలపై విశేషమైన ఆసక్తి వ్యక్తమవుతున్నది. 10 సంవత్సరాల పాటు సాగిన ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అనుభవించిన నిరంకుశ పోకడలు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణుల రీత్యా బిజెపి ఓడిపోవాలనే కాంక్ష కొన్ని వర్గాల ప్రజల్లో గూడు కట్టుకొన్నది. భారతీయ జనతా పార్టీ మాత్రం మూడో ముచ్చట కోసం ఆరాటపడుతున్నది. ప్రజాస్వామిక రాజ్యాంగ పాలనా విధానానికి పూర్తిగా తలకొరివి పెట్టి హిందుత్వ ఏలుబడిని సువ్యవస్థితం చేయాలని చూస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతి వంటి చట్టాలతో బిజెపి దేశాన్ని మెజారిటీ మతతత్వ, మితవాద దుర్గంగా మార్చదలచిందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన చెందుతున్నారు. దానిని విడివిడిగా ఎదుర్కొని జయించడం అసాధ్యమని తెలుసుకొన్న ప్రతిపక్షాలు ఉమ్మడి బలంతో ఓడించాలనుకొని ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి) అనే పేరుతో ఏకమయ్యాయి.

2023 డిసెంబర్ 3న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరిపిన ది టైమ్స్ నౌ ఇటిసి సర్వే ఉత్తరాది బిజెపి బిగిపట్టులో వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హిందీ రాష్ట్రాలు దానికి తిరుగులేని ముల్లెగా మారాయని స్పష్టం చేసింది. 80 లోక్‌సభ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఒక్క బిజెపికే 70- 74 స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది. 2019లో యుపిలో బిజెపి కూటమి ఎన్‌డిఎ స్కోరు 64 కాగా, బిజెపికి స్వయంగా 62 వచ్చాయి. మొన్న ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపి ఓటమి ఖాయమనుకొన్న జోస్యం ఆశ్చర్యకరంగా తల్లకిందులైంది. అయితే ఇదే విధంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ గెలుచుకొన్నది. కాని ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది నెగ్గలేకపోయింది. అదే పరిస్థితి తిరిగి తలెత్తితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి దెబ్బ తినవచ్చు.

అయితే ఒక సారి సంభవించింది మళ్ళీ అలాగే జరుగుతుందన్న హామీ లేదు. యుపిలో సమాజ్ వాది పార్టీ కేంద్రంగా సామాజిక న్యాయశక్తులు, ఉమ్మడి ప్రతిపక్ష కూటమి సాధించగలిగేది ఏమీ ఉండదా అనే ప్రశ్న పెద్ద ఎత్తున తలెత్తుతున్నది. కేంద్రంలోని, ఆ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాల పట్ల పాలక వ్యతిరేక ఓటు మచ్చుకైనా ఉండదా, అక్కడి ఓటంతా రామార్పణమేనా? అయితే ప్రతిపక్ష కూటమి ప్రముఖ నేతల్లో ఒకరైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ తాజాగా చేసిన ఒక విశ్లేషణ ప్రస్తావించుకోదగినది. ఆయనను కేవలం ప్రతిపక్ష నేతగా చూడడానికి బదులు అనుభవజ్ఞుడైన నాయకుడుగా పరిగణించడం విజ్ఞత అనిపించుకొంటుంది. దేశంలోని రాజకీయ పరిస్థితి బిజెపికి అనుకూలంగా లేదని ఆయన అన్నారు. ఈసారి 400 స్థానాలు తథ్యమని కమలం పార్టీ వ్యక్తం చేస్తున్న ధీమాను పవార్ తోసిప్పుచారు. బిజెపి 2014లో అధికారంలోకి వస్తూ చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని, ప్రజలను పచ్చి మోసం చేసిందని,

అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేదని శరద్ పవార్ కారణాలు పూసగుచ్చారు. నిరుద్యోగం ప్రబలిపోయిందని దీని పర్యవసానమే డిసెంబర్ 13 నాటి పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన అని, రైతుల అదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ వంచన చేశారని వగైరా బిజెపి వైఫల్యాలను ఎత్తి చూపారు. షిరిడీలో మొన్న గురువారం నాడు తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పవార్ చెప్పింది ముమ్మాటికీ నిజం. అది కాదనలేని చేదు వాస్తవం. కాని ఉత్తరాది ప్రజలు తమ సమస్యల వెలుగులో తీర్పు ఇస్తారో, మతోన్మాద ఊబిలో కూరుకుపోయి వ్యవహరిస్తారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News