Wednesday, January 22, 2025

జమిలి ఎన్నికలు అక్కరకు వస్తాయా!

- Advertisement -
- Advertisement -

రాజకీయంగా ఒక సంక్షోభం ఎదురైతే దాని నుండి ప్రజల దృష్టి మళ్ళించడం కోసం మరో సంక్షోభాన్ని సృష్టించే ప్రక్రియకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంలో ఆమెను అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయంగా ఒక్కొక్క దారి మూసుకుపోతున్న సమయంలో ప్రజల దృష్టి మళ్ళించడం కోసం ‘జమిలి ఎన్నికలు’ ప్రక్రియను ఎంచుకున్నారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఒక విధంగా తిరుగులేని నాయకుడిగా ఏర్పరచుకున్న ప్రధాని మోడీ ప్రతిష్ఠకు గండి పడే విధంగా చేశాయి. ఆయన ప్రయోగించిన ‘హిందుత్వ రాజకీయం’ ఎదురు తిరిగింది. స్వయంగా గతంలో ఎన్నడూ, ఎక్కడా చేయని విధంగా బెంగళూరు నగరంలో రెండు రోజుల పాటు రోడ్ షోలు జరిపినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితులను అధిగమించాలనే ప్రయత్నాలు సహితం ఫలించిన సూచనలు కనిపించలేదు. పార్టీ జాతీయ కార్యవర్గంలో చేసిన మార్పులు ప్రజలలో ఎటువంటి ఉత్సాహం కలిగించలేకపో యాయి. మంత్రివర్గంలో భారీ మార్పులను తలపెట్టి కూడా అమలు జరిపే సాహసం చేయలేకపోతున్నారు.

భావోద్వేగాలతో ప్రజలను గెలవడం అన్ని సందర్భాలలో సాధ్యం కాదని కూడా ఇటీవల కాలంలో స్పష్టం అవుతున్నది. ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేశామని, త్వరలో మూడో పెద్ద వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతున్నా పేరుకుపోతున్న నిరుద్యోగం, అదుపులేని ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న ధనిక -పేద తారతమ్యాలు ప్రజల జీవనాలను అతలాకుతలం కావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థలు చితికిపోతున్నాయి. ఇక మణిపూర్, హర్యానాల్లో చెలరేగిన హింసాకాండ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం సామర్థ్యాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయి. మణిపూర్ హింసాకాండ గురించి పార్లమెంటులో చర్చకు కూడా సాహసించలేకపోయారు. సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను భయకంపితులను కావించే ప్రక్రియకు కర్ణాటక ఎదురు తిరిగిన్నట్లయింది. మహారాష్ట్రలో సహితం పరిమిత ప్రయోజనాలే చూపాయి. దక్షిణాదికి వ్యాప్తి చెందాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కర్ణాటకలో ఉన్న ఆధారం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.

ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేయలేవనే ధీమాతో ఉన్న బిజెపి అగ్రనాయకత్వ అంచనాలను తలకిందులు కావిస్తూ ‘ఇండియా’ కూటమి పేరుతో సీట్ల సర్దుబాట్లకు సిద్ధపడటం బిజెపి శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది. బిజెపి నేడు ముఖ్యంగా రాష్ట్రాలలో నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కీలక నాయకులపై పార్టీ శ్రేణుల నుండే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. చివరకు పార్టీలో పదవులు, ప్రభుత్వంలో నామినేట్ పదవులు అమ్ముకుంటున్నారని నిర్దుష్టమైన ఆరోపణలు వస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ నాయకత్వం కనిపిస్తున్నది. కొన్ని చోట్ల పోలీసు కేసుల వరకు వెళ్ళింది. ఇటువంటి సమయం లో అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఈ నెల 19 నుండి ఐదు రోజుల పాటు జరపాలని నిర్ణయించడం, ఆ మరుసటి రోజునే జమిలి ఎన్నికల గురించి అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడం చకచక జరిగిపోయాయి. భారీ ఎన్నికల సంస్కరణలు చేపట్టాలనే ఉద్దేశంతో కాకుండా ప్రస్తుత ప్రతికూల రాజకీయ పరిస్థితుల నుండి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగా స్పష్టం అవుతుంది.
డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైతే 2024 లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.

2019లో గెలుపొందిన పలు సీట్లను కోల్పోవటమే గాని కొత్తగా ఎక్కడా బలం పెంచుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలలో ప్రతికూలతలు ఎదురుకాగల సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్‌డిఎను విస్తరించి, బలోపేతం చేసే ప్రయత్నాలు తగు ఫలితాలు ఇవ్వడం లేదు. రెండంకెల లోక్‌సభ సీట్లను గెలుచుకునే పార్టీలు ఏవీ ఎన్‌డిఎలో ఇప్పుడు లేవు. సగానికి పైగా పార్టీలకు ఒక్క సీట్ కూడా లేదు. మూడవ వంతు పార్టీలు గత లోక్‌సభ ఎన్నికలలో అసలు పోటీ చేయలేదు. అందుకనే జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కలిపి జరపాలనే ఆలోచన బయలుదేరింది.ఇందులో రాజ్యాంగ, న్యాయ సంబంధ సమస్యలు అనేకం ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటగా భారత్ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేసే చర్యగా మారే ప్రమాదం ఉంది. మొన్ననే ఎన్నికలు జరిగిన కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం పొడిగిస్తారా? లేదా రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరుపుతారా? ఇటువంటి సంక్లిష్ట సమస్యలు అనేకం ఎదురయ్యే అవకాశం ఉంది.
అర్ధ శతాబ్దపు కాలంగా జమిలి ఎన్నికల గురించిన వాదనలు వినిపిస్తున్నా నిర్దుష్టమైన ప్రతిపాదనలు ఇప్పటి వరకు దేశం ముందు కు రాలేదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నామని ప్రకటించి అజెండా రూపొందించే పనిలో పడటం, జమిలి ఎన్నికల గురించిన కమిటీకి మాజీ రాష్ట్రపతి నేతృత్వం వహిస్తారని చెప్పి కమిటీ సభ్యుల గురించి మంతనాలు జరపటం గమనిస్తే ఇవ్వన్నీ నిజమైన రాజకీయ, ఎన్నికల సంస్కరణలకు జరుపుతున్న ప్రయత్నాలుగా కనిపించడం లేదు. ఎన్నికల నిర్వహణకు పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితాను ఇప్పటి వరకు రూపొందించలేకపోతున్నాము. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా ఉండటం లేదు. 2018లో ఎన్నికలు జరిగిన తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్నా ఇంకా సుమారు 40 మంది సభ్యులు అనర్హత పిటీషన్లను ఎదుర్కొంటున్నారు.వాటిని అసెంబ్లీ పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చే తీర్పులకు ప్రయోజనం ఏమిటి?

భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరెవ్వరికీ లేనంతటి భారీ మెజారిటీ లోక్‌సభలో వున్నప్పటికీ రాజీవ్ గాంధీ అభద్రతాభావానికి లోనై, పార్టీలో తిరుగుబాటు ఎదుర్కోవడం కోసం హడావుడిగా ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. ఆ చట్టం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయడంతో ఆయనను తిరిగి ఆ పదవిలో ఉంచలేకపోతున్నామని స్వయంగా సుప్రీంకోర్టు పేర్కొనడం ద్వారా ఆ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగ పరుస్తున్నారో వెల్లడించింది. అదే విధంగా పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ అవసరాల కోసం ఓ ‘సంక్షోభ నివారణ’ ప్రక్రియగా జమిలి ఎన్నికలను తీసుకు వస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం మాదిరిగా ఓ ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఈ విషయమై రాజకీయ ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు తగు ప్రయత్నం జరగలేదు. కేవలం ఓ కమిటీ వేయడం ద్వారా ప్రయోజనం ఉండదు.

పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులలో మూడో వంతు మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లలో పేర్కొంటున్నారు. ఆ కేసులలో హత్యలు, మానభంగాలు వంటి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. అటువంటి సభ్యులతో మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకోవడంతో ఉపయోగం ఏమిటి? పార్లమెంట్, అసెంబ్లీలు అన్ని మొక్కుబడిగా సమావేశం అవుతున్నాయి. బిల్లులపై లోతయిన చర్చలు జరగడం లేదు. చట్ట సభలలో లోతయిన చర్చల పట్ల అధికార పక్షాలే కాకుండా, ప్రతిపక్షాలు సహితం ఆసక్తి చూపడం లేదు. మరోవంక పలువురు గవర్నర్లు అసెంబ్లీల తీర్మానాలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇటువంటి వ్యవహారాలపై ముందుగా దృష్టి సారించాలి. మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి లోతయిన సమీక్ష జరగాల్సి ఉంది. ప్రపంచంలో మరే ప్రజాస్వామ్య దేశాలలో ఎరుగని విధంగా నిరంకుశమైన చట్టాలు మన దేశంలో అమలులో ఉన్నాయి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం, ఇడి అటువంటివే. వీటిపై ఇప్పటి వరకు పార్లమెంట్ ఒక్కసారి కూడా లోతయిన చర్చ జరపలేదు. ప్రజల హక్కులు కాపాడవలసిన హక్కుల కమిషన్‌లు అధికారంలో ఉన్నవారి భజన బృందాలుగా మారుతున్నాయి. ఇవ్వన్నీ ఓ ప్రజాస్వామ్య దేశంగా భారత్ కీర్తి ప్రతిష్ఠలను పెంచబోవని గుర్తించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News