Friday, December 20, 2024

నేడు రెండో విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ శుక్రవారం 89 నియోజకవర్గాలలో జరగనుండగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి సిట్టింగ్ ఎంపీలు హేమ మాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ ఆయా నియోజకవర్గాలలో హ్యాట్రిక్ విజయం కోసం తలపడుతున్నారు. ఏడు దశలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో భాగంగా తొలి దశ పోలింగ్ గత శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 స్థానాలలో జరిగింది. సుమారు 65.5 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండవ దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం జగరనున్నాయి. కేరళలోని మొత్తం 20 సీట్లు, కర్నాటకలోని మొత్తం 28 సీట్లలో 14 సీట్లు, రాజస్థాన్‌లో 13 సీట్లు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ లోని చెరో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లోని 7 సీట్లు, అద్సం, బీహార్,లోని చెరో 5 సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోని చెరో 3 సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కశ్మీరులోని ఒక్కో సీటుకు శుక్రవారం పోలింగ్ జరగనున్నది.

కేరళలోని వయనాడ్‌కు చెందిన సిట్టింగ్ ఎంపి రాహుల్ గాంధీ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సిపిఐ అభ్యర్థి లన్నీ రాజా, బిజెపి అభ్యర్థి కె సురేంద్రన్‌తో రాహుల్ తలపడుతున్నారు. 2019 ఎన్నికలలో 7 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రాహుల్‌ను ఆ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థి పిపి సునీర్ ఢీకొన్నారు. కాగా..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం స్థానాన్ని నాలుగవసారి కైవశం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(బిజెపి, పన్నియన్ రవీంద్రన్(సిపిఐ) తపలడుతున్నారు. 2014 నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అలనాటి సినీ నటి హేమ మాలిని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ముకేష్ ధంగర్‌ను ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని కోట స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ గుంజల్‌ను ఢీకొంటున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ స్థానం నుంచి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కరన్ సింగ్ జోహియార్దా పోటీ చేస్తున్నారు. బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపి తేజస్వి సూర్య కాంగ్రెస్ అభ్యర్థిని సౌమ్యా రెడ్డితో తలపడుతున్నారు. కాగా..ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గడచిన 30 ఏళ్లుగా బిజెపి కంచుకోటగా నిలిచిన రాజ్‌నంద్‌గావ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై బిజెపి సిట్టింగ్ ఎంపి సంతోష్ పాండే పోటీ చేస్తున్నారు. 2004 నుంచి మీరట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్‌ను తప్పించిన బిజెపి ఈసారి టివి రామాయణ్ సీరియల్‌లో రాముడిగా నటించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న అరుణ్ గోవిల్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఇలా ఉండగా కేరళలోని అలప్పుళ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ఈ ఒక్క స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ కోల్పోయింది. ఇక్కడ సిపిఎం గెలిచింది.

2019 వరకు ఈ స్థానాన్ని వేణుగోపాల్ వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి ఆయన గెలుపొందారు. తిరిగి 2009, 2014లో ఇక్కడి నుంచే వేణుగోపాల్ గెలుపొందారు. ఆయనకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రమోషన్ ఇవ్వడంతో 2019లో ఆయన పోటీ చేయలేదు. కాగా..సినీ నటుడు సురేష్ గోపి బిజెపి అభ్యర్థిగా కేరళలోని త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా కె మురళీధరన్(కాంగ్రెస్), విఎస్ సునీల్ కుమార్(సిపిఎం) బరిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News