Wednesday, December 25, 2024

పాక్‌పై ఎన్నికల క్రీనీడలు

- Advertisement -
- Advertisement -

ఆగస్టు 9న, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని గడువు కన్నా కొద్ది రోజుల ముందుగా రద్దు చేయడంతో రాజ్యాంగపరంగా సాధారణంగా 90 రోజులలోపు తప్పనిసరిగా జరపవలసిన ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పాకిస్తాన్ లో కీలక అధికార కేంద్రంగా మనుగడ సాగిస్తున్న సైన్యంకు సన్నిహిత మిత్రుడైన అన్వర్ ఉల్-హక్ కాకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తాత్కాలికంగా అధ్యక్షత వహిస్తుంది.అయితే, కొత్త జనాభా గణన ఫలితాల కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తుండడంతో ఎన్నికలు 2024కి ఆలస్యం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గద్దె దిగిన ప్రభుత్వ ఆదేశాల మేరకే జనగణన కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, సైన్యంతో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పెంపొందింప చేసుకున్న వైరం నుండి ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం మధ్య జరగాల్సిందే.రాజకీయ నాయకులు సైన్యంపై పైచేయి కోసం పోటీ తుండడంతో సాధారణ పౌరులు ఆశ్చర్యపరిచే హింసకు గురవుతున్నారు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం, అరెస్టులు, వేధింపులకు గురవుతున్నారు. ‘డిజిటల్ ప్రసంగం కోసం చట్టపరమైన నిర్బంధం కారణంగా సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై ప్రభావితం చేస్తుంది‘ అని ఓ హక్కుల న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు స్వేచ్చాయుతంగా ఎన్నికలు జరగడాన్ని ప్రశ్నార్ధకం చేయడంతో గందరగోళాన్ని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 2022లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి నాయకత్వం వహించిన ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస ఓటుతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయినప్పుడు ఈ ప్రత్యేక సంక్షోభానికి వేదిక ఏర్పడింది.ఖాన్ ప్రత్యర్థులు స్థానిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాన్ని కారణాలుగా పేర్కొన్నారు. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ గతంలో సైన్యం అండదండలతోనే ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే తాను పదవి కోల్పోయేందుకు సైనిక జోక్యంతో పాటు పాశ్చాత్య శక్తులను కారణంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ దేశ రాజకీయ వ్యవస్థపై తిరుగులేని తమ ఆధిపత్యంను నిరూపించుకోవడం సైన్యాధిపతులకు ఓ సవాల్ గా పరిణమించింది.ప్రతిపక్ష కూటమి అధికారం చేపట్టేందుకు ముందుగానే తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అనుసరించిన ఖాన్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సైన్యాన్ని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారు. అధికారులు అప్పటి నుండి ఖాన్‌పై వేధింపులు ప్రారంభించారు.

పన్నులు చెల్లించడంలో మోసం నుండి హత్య వరకు 150కి పైగా క్రిమినల్, సివిల్ కేసులను ఆయనపై దాఖలు చేశారు. పారామిలటరీ అధికారులు మే 2023లో ఖాన్‌ను అరెస్టు చేయడంతో పిటిఐ మద్దతుదారులు విస్తృతంగా నిరసనలు జరిపారు. సాంకేతికపరమైన కారణాలపై ఖాన్‌ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.అయితే అది ఆగస్టు ప్రారంభంలో అరెస్టు నుండి అతన్ని రక్షించలేకపోయింది. మరో కోర్టు అతనికి అవినీతికి పాల్పడినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఖాన్‌పై ప్రభుత్వ పదవులు చేపట్టడంపై ఐదేళ్ల నిషేధాన్ని గత సంవత్సరం విధించింది. ఈ పరిణామాలు సహజంగానే ప్రధాన ప్రతిపక్షం పీటీఐని ఒత్తిడిలకు గురిచేస్తున్నాయి.మే నుండి వేలాది మంది మద్దతుదారులు అరెస్టు కావడంతో డజన్ల కొద్దీ ప్రముఖులు పార్టీ నుండి నిష్క్రమించారు. కొందరు సైన్యం నుండి ఒత్తిడులకు గురవుతున్నారు. జూలైలో, పార్లమెంటేరియన్ల బృందం విడిపోయిన వర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి జనాభా లెక్కల ఫలితాల కోసం ఎన్నికల కమిషన్ దేశం యొక్క ఎన్నికల సరిహద్దులను తిరిగి నిర్ణయించే వరకు కొత్త ఎన్నికలు జరగవని అధికారం నుండి వైదొలిగిన కూటమి ప్రకటించింది.

డిసెంబరులోగా తమ పనులు పూర్తవుతాయని ఎన్నికల కమిషన్ చెప్పడంతో పీటీఐపై విరుచుకు పడేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వంకు మరింత సమయం దొరికినట్లయింది. రాజకీయ గందరగోళంతో హింస చెలరేగుతోంది. మరోవంక, ఉగ్రవాద ముప్పు పాకిస్తాన్ ను కలవరంకు గురిచేస్తున్నది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ జూలై చివరలో డజను మందిని హతమార్చింది.
అధికారం నుండి వైదొలిగిన సంకీర్ణంలో భాగస్వామి అయిన జమియాత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ నిర్వహించిన సదస్సుపై దారుణంగా బాంబు దాడి చేసింది. తదుపరి దాడులు అస్థిరతకు ఆజ్యం పోయవచ్చు. ఎన్నికల్లో మరింత ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి అలజడులు సైన్యానికి ఒక సాకుగా మారే అవకాశం ఉంది. పాకిస్థాన్‌పై డిజిటల్ నియంత్రణలు కఠినతరం కావడం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.241 మిలియన్ల జనాభా గల దేశంలో 87 మిలియన్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. కానీ ఆ దేశంలో అధికారులు ఇంటర్నెట్‌పై గట్టి నియంత్రణను కలిగి ఉంటారు. రాజకీయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడే పౌరుల సామర్థ్యాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటారు.

ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం కీలకం. అభ్యర్థులు, రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవడానికి, వారి అభిప్రాయాలను పంచుకోవడానికి, ఎలా ఓటు వేయాలో తెలుసుకోవడానికి ప్రజలు దానిపై ఆధారపడతారు. అయితే అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఈ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఉదాహరణకు, గత మేలో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ దేశవ్యాప్తంగా మొబైల్ కనెక్టివిటీని పరిమితం చేసింది. ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదేవిధంగా వ్యవహరించారు. సోషల్ నెట్‌వర్క్‌లు కూడా ప్రభావితమయ్యాయి.గత సెప్టెంబర్‌లో లైవ్-స్ట్రీమ్ చేసిన పిటిఐ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా యూట్యూబ్ అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసింది. మరోవంక, సోషల్ మీడియా వినియోగదారులపై క్రూరమైన వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2023లో, సోషల్ మీడియా ద్వారా సైన్యాన్ని విమర్శించినందుకు ఓ పిటిఐ మద్దతుదారుడికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

మహిళా జర్నలిస్టులు, ముఖ్యంగా రాజకీయాలను కవర్ చేసే వారు, తమ రిపోర్టింగ్ కోసం తరచుగా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో వేధింపులకు, బెదిరింపులకు గురవుతున్నారు. పిటిఐ వ్యతిరేక సంకీర్ణం తాము అధికారం నుండి నిష్క్రమించేందుకు ముందు వివాదాస్పద బిల్లుల ప్యాకేజీని ఆమోదించింది. ఒకటి, ఇ-సేఫ్టీ బిల్లు, అనేక రకాల ఆన్‌లైన్ కంటెంట్‌ను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి కొత్త అధికారాన్ని రూపొందించడానికి అనుమతిస్తుంది.ఇప్పటికే ఉన్న అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేయడంలో ప్రభుత్వం దుర్భరంగా వ్యవహరిస్తున్నది. ఫిబ్రవరిలో, ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా అపవిత్రమైనదిగా భావించే కంటెంట్‌ను తీసివేయడానికి నిరాకరించడంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు వికీపీడియాను బ్లాక్ చేసింది. అధికారులు పిటిఐని అణచివేసే విధంగా ఆన్‌లైన్‌లో స్వేచ్ఛా భావవ్యక్తీకరణను లక్ష్యంగా చేసుకోవడంతో పాకిస్తాన్‌లో ఇప్పటికే పెళుసుగా ఉన్న ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడింది. రాబోయే ఎన్నికల ఆ దేశ అందుకనే ఎన్నికల నిర్వహణకు గల 90 రోజుల గడువు పాకిస్తాన్ ప్రజాస్వామ్య మనుగడకు కీలకమని చెప్పవచ్చు.

ఈ వ్యవధిని ఆసరాగా తీసుకొని సైన్యం తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ప్రజల గొంతును మరింతగా అణిచివేసేటట్లు వ్యవహరించే అవకాశం ఉంది. మొదటి నుండి పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం ఒక వంక సైన్యం నుండి, మరోవంక ప్రజా మద్దతు కోల్పోతున్న రాజకీయ నాయకత్వం నుండి సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంది.అయితే ఆ దేశ ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కోరుకొంటున్నారు. ప్రతి ఐదు మందిలో ముగ్గురు అన్ని రకాలైన ప్రభుత్వ వ్యవస్థలకన్నా ప్రజాస్వామ్యం మేలైనదని విశ్వసిస్తున్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. వారి బలమైన ఆకాంక్షలే అనేక వత్తిడుల మధ్య పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగేందుకు దారితీస్తుంది. అయితే, అత్యధిక ప్రజలు స్వేచ్ఛాయుత ఎన్నికల పట్ల మొగ్గు చూపుతున్నప్పటికీ తమ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, శాంతిభద్రతల నిర్వహణ సామర్థ్యం పట్ల ప్రతికూల అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News