Friday, January 3, 2025

రాశి ఫలాలు-2024… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

- Advertisement -
- Advertisement -

మేషం:-ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది.ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు,శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి,పరపతి పెరుగుతుంది.విద్య,ఉద్యోగ  విషయాలలో అభివృద్ధి కానవస్తుంది.పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికరంగా(జాబ్సాటిఫికేషన్)ఉంటుంది.

వ్యవసాయ రంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి.వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు,పత్తి,ఆవాలు,అపరాల వ్యాపారాలు ఈ రాశివారికి ఈ సంవత్సరం లాభిస్తాయి.

రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి.కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయి అవుతుంది.ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు(ప్రమోషన్)వచ్చేఅవకాశాలు గోచరిస్తున్నాయి.

కళా సాంస్కృతిక,క్రీడారంగాలలో మీ ప్రతిభాపాటవాలు గుర్తింపునకు నోచుకుంటాయి. నూనె,ఖనిజసంబంధమైన వృత్తివ్యాపారాలు లాభాల బాటపడతాయి.

నూతన గృహాలు,వాహనయోగ్యత ఈ సంవత్సరం ముడిపడతాయి.విలువైన వస్తువులను,స్థిరచర ఆస్తులను అమ్మడం,కొనుగోలులో జాగ్రత్త వహించాలి.టెండర్ల విషయంలో అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.క్రీడలు,రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి.మీ నైపుణ్యానికి,ప్రతిభకి,మంచి గుర్తింపు లభిస్తుంది.

======================================================

వృషభ:- ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఆర్ధిక విషయాలు లాభిస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.మొత్తంమీద శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది.జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి,మానసిక సంతోషం లభిస్తుంది.

గురువు ద్వాదశ రాశి సంచారం,తదుపరి జన్మరాశి సంచారం.శని దశమ స్థానచలనం, కేతువు పంచమ స్థానచలనం,రాహువు లాభస్థానమందు,గురు,శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.

మీరు గతంలో చేసిన,చేస్తున్న,పెట్టుబడులు జీవితంలో పురోగాభివృద్ధిని కలిగిస్తాయి.రాజకీయపరంగా అనుకూలంగా ఉంది.రాజకీయ నాయకులకి కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చును.క్రిందిస్థాయినుండి వచ్చేవారికీ రాజకీయపరంగా అనుకూలంగా ఉంటుంది.రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది.కార్మికవర్గానికి అనుకూలంగా ఉంటుంది.గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది.ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం.మోకాళ్ళు, వెన్నునొప్పులు,దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సినీ పరిశ్రమ,పత్రికారంగంవారికి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును.

విద్యార్ధినీవిద్యార్ధులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం.ద్వాదశ రాశులలో గురుగ్రహ సంచారం కొంత ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తోంది.

ఎవరి అండదండలు అందడం లేదని మీలో పట్టుదల పెరిగి మనోవాంఛ నెరవేరడానికి ఎవరి సహకారం లేకుండానే మీకు మీరుగా స్వయంకృషితో ఎదుగుతారు.దైవానుగ్రహం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.

 

=====================================================

మిథునం:-ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది.ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లభిస్తాయి.ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం.విదేశీయాన శుభ ఫలితాలు యోగిస్తున్నాయి.ప్రజాసంబంధాలు వృద్ధిచెందుతాయి.రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తిఉద్యోగాలపరంగా స్థిరత్వం పొందడం అవసరం.దీనివలన ఆర్ధికంగా లాభపడతారు.

ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి.అధికారుల మన్ననలు పొందుతారు. ధైర్యంచేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.అవి కొంతవరకు మీకు లాభాలు తెచ్చిపెడతాయి.

వైద్యవిద్యలను అభ్యసించాలనుకునేవారికి అనుకూలమైన కాలం.మీ కోరిక నెరవేరుతుంది.  పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.కందులు,ధాన్యం,చిరుధాన్యాల పంటవేసే రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది.వృత్తిపరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి.విదేశీ సంబందిత విషయాలు లాభిస్తాయి.

పబ్లిక్ సర్వీసులలో ఉన్నవారికి,అలంకరణ సామగ్రి,బ్యూటీపార్లర్లు నడిపేవారికి, సినీ పరిశ్రమ,విలేఖరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ప్రభుత్వపరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి.డాక్టర్లకు మంచి ఆర్ధిక లాభాలు.చిన్నవ్యాపారస్తులకు శని గ్రహ ప్రభావం వలన అనుకులమైన కాలం.ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం.చర్మ,కాలేయ,గుండెసంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శుభకార్యాల విషయంలో ఆర్ధికపరంగా కొంత భయపడతారు.సంతానానికి ఎలాంటి సంబంధం వస్తుందోనని కొంత దిగులు పడతారు.మీ మనోధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన వాతావరణంలోకి మలుచుకోవడంలో దోహదపడుతుంది.

 

======================================================

కర్కాటకం:- ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడే ఆర్ధికపరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు.విద్యాసంబంధమైన విషయాలు,గృహసంబందమైన విషయాలు,విదేశీ సంబందమైన విషయాలు సానుకూలపడతాయి.భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం.ఎవర్ని నమ్మాలో,ఎవర్ని నమ్మకూడదో అంచనా వేసుకోవడం కష్టతరం అవుతుంది.దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు.

ఈ రాశివారికీ అష్టమ శని నడుస్తున్నందువలన అఘోర పాశుపత హోమం అలాగే  శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.నల్ల నువ్వులు దానం ఇవ్వండి.

సాంకేతికపరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం.దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉన్నతవిద్యను అభ్యసించేవారికీ,పిహెచ్ డి చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు.

గురువు దశమ లాభ స్థానాలలో సంచారం,శని అష్టమ స్థాన సంచారం,రాహు-కేతు భాగ్య  తృతీయ,భాగ్యస్థానాలలో సంచారం,కుజగ్రహ సంచారం,గురు,శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి.విదేశాలలో చదువుకునేవారికి అనుకూల కాలం.

గురుగ్రహ అనుగ్రహంవలన ఆర్ధికపరమైన అంచనాలు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు అవుతాయి.రాజకీయపరంగా కొందరి ఓటమికి మీరే కారణం అని నిందలు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.దీనికి కారణం మీ అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది.

రాహు-కేతు ప్రభావం వలన మంత్రానుష్టానం బలం లాభిస్తుంది.సనాతన ధర్మంపట్ల ఆకర్షితులు అవుతారు.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీకు నూతన ఉత్యాహాన్ని అందిస్తుంది.

వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నవారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది.  ఆడంబరాలను చూసి మోసపోకుండా,కుటుంబ నేపధ్యం(చరిత్ర),జాతకం చూసి వివాహం చేసుకోండి.అదేవిధంగా అన్నిరకాల విషయాలు లోతుగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.దీనికి కారణం బుధ,గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం.

గురుదృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు.పెద్దల ద్వారా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది.వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  సుగంధ ద్రవ్యాలు,అపరాల పంటలు వేసే రైతులకు అనుకూలమైన కాలమని చెప్పవచ్చు.కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది.

 

======================================================

సింహ:- ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఆర్ధిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు.అంతంతమాత్రంగానే గోచరిస్తున్నది.సంవత్సరం ప్రధమార్ధంకన్నా ద్వితీయార్ధం ‘మే’ తదుపరి ఆర్ధికపరమైన విషయంలో అనుకూలంగా ఉంటుంది.వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది.వృత్తిఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు అందుకుంటారు.గురువు భాగ్యంలో దశమ స్థాన సంచారం వలన ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.జీవితాశయాన్ని సాధించుకోవడానికి, ఎంతో కొంత ఆర్ధిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలవల్ల కొంతవరకు మంచి ఫలితాలను అందుకుంటారు.

విద్యార్ధులు నూతన విద్యను అభ్యసించడానికి,దరఖాస్తు పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును.

రాజకీయపరమైన విషయాలలో మీ ఆలోచనలు తలక్రిందులు అవుతాయి.రాజకీయ సంకటస్థితి ఏర్పడుతుంది.మిమ్మల్ని అడ్డంపెట్టుకొని రాజకీయలబ్ధి పొందుతారు. నమ్మించి మోసం చేసేవారు చుట్టూ ఉంటారు.జాగ్రత్త వహించండి.గెలుపోటముల వలన రాజకీయ నిశ్శబ్దత అలముకుంటుంది.

మీ ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.జాగ్రత్తపడండి.చర్మ సంబంధ రుగ్మతలు,రక్తహీనత,నీరుచేరుట,చెవి సంబంధిత,మోకాళ్ళ నొప్పులు, అస్తమా,మనఃస్థిమితం లేకపోవడంవంటి అనారోగ్య సమస్యలబారిన పడకుండా జాగ్రత్త వహించండి.

నిర్మాణ సంబంధమైన విషయాలు నత్తనడకన సాగుతాయి.మీరు తక్కువగా అంచనా వేసినవారు ముందుపధంలో సాగుతారు.తృణధాన్యాలు,పండ్లు,చింత,పెసలు,అపరాలు పండించే రైతులకు అనువైన కాలం.అదేవిధంగా ఇత్తడి,కంచు,ఇనుము,లోహపు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది.

ఈ సంవత్సరం ఈ రాసివారు మహాపాశుపతహోమం,ప్రతి శనివారాలు వెంకటేశ్వరస్వామికి అర్చన చేయడంవలన మంచి ఫలితాలు అందుకుంటారు.ముఖ్యంగా ఆదిత్యహృదయం నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

=======================================

కన్య:-ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది.పనులు నిదానంగా అవుతాయి.ప్రతి ముఖ్యమైన పనులు,కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు చూసుకుంటూ చేస్తేకానీ సఫలీకృతం కావు.సరైన గురువులను ఆశ్రయించి,సలహాలు, సంప్రదింపులు చేయడంద్వారా సత్ఫలితాలు పొందగలుగుతారు.

ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటికీ ఇంకా ముందుకువెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది.కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి మీ శక్తివంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగించి ప్రశాంతతను నెలకొల్పుతారు.రానురాను సనాతన ధర్మంపట్ల ఆకర్షితులు అవుతారు.రచన,పత్రిక,మీడియా,కమ్యూనికేషన్ల రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం.భాగస్వాములు మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేల్కొని తప్పులు జరగకుండా చూసుకోండి.ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు,సహనం చాలా అవసరం.వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం ఒకరినొకరు అర్ధం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి.భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి తెగతెంపులు చేసేవారు ఉంటారు.అలాంటివారితో జాగ్రత్త వహించండి. భార్యాభర్తల ఇరువురి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి.

ముఖ్యంగా ఈ సంవత్సరం మీ జన్మరాశిలో కేతుసంచారం,సప్తమంలో రాహుగ్రహ సంచారం,కుంభంలో శనిగ్రహ సంచారం,అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.

అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది.కొంత ఆలస్యమైనా మంచి సంబంధం వచ్చిందని సంతోషం వ్యక్తపరుస్తారు.వివాహ విషయంలో పూర్తిగా కుటుంబపరంగా అన్నివిషయాలు తెలుసుకున్న తరువాతనే ముందుకువెళ్ళడం శ్రేయస్కరం.

ప్రజా సంబంధాలు పెంచుకుంటారు.మితిమీరిన నమ్మకం మీకు హాని కలుగచేస్తుంది. కళాత్మకరంగం,ఆర్కిటెక్చర్లకు మీరు చేసిన కృషికి గాను గుర్తింపు లభిస్తుంది.యోగ, మెడిటేషన్,దైవచింతన పట్ల ఆకర్షితులవుతారు.వాటివలన ప్రయోజనాన్ని పొందుతారు.స్నేహితులకోసం,బంధువులకోసం,సన్నిహితుల కొరకు మీ పరపతిని, ధనాన్ని ఉపయోగిస్తారు.విదేశాలకు వెళ్ళేవారికి అనుకూలమైన కాలం.

షష్ఠమ శనివలన దీర్ఘకాలిక వ్యాదులు ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయి.

 

===============================================

తుల:-ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఈ సంవత్సరం ఈ రాశివారు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఆధ్యాత్మికంగా వెళ్లడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి.అన్ని విషయాలలో భ్రమ లేకుండా పని చేయడం మంచిది.

హోటల్ వ్యాపారం,తినుబండారాల వ్యాపారాలలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులనుండి కొంత ఇబ్బందిపడే అవకాశం ఉంది.ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు.ఉన్నతస్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. ఎంతోకాలంగా చేస్తున్న వృత్తిలో కానీ,వ్యాపారంలోగాని పనివేళలో మార్పులు కనిపిస్తాయి.వృత్తిపరంగా స్థానచలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది.

 

మే నెలవరకు ఆర్థికపరంగా కొంతవరకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఋణ సంబంధమైన విషయాలలో అప్పులు చేయకుండా ఉండడం మంచిది.

అందరికన్నా ఎక్కువగా ఈ రాశివారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తిలో,అందరూ చేసే సమయాలకన్నా వార్డ్ వర్క్, ఆడ్ అవర్స్ లో  పని చేసే సందర్భాలు రావచ్చు.

వ్యవసాయ సంబంధ విషయాలు బాగుంటాయి.విద్యాసంస్థలు నడుపుతున్న వారికి పని చేస్తున్న వారికి కొంతవరకు అపనిందలు,ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశోధనరంగంలో ఉన్నవారికి అంతరిక్ష రంగంలో పనిచేసే వారికి అకౌంటెంట్లకు, జ్యోతిష్కులకు అనుకూల కాలం.

 

============================================

వృశ్చిక:- ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.వస్తు, వాహనాలు గృహాలు కొనుగోళ్లు చేస్తారు. ఇంటికోసం చేసే లోన్ ప్రయత్నం ఫలిస్తుంది,  క్రెడిట్ కార్డు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అప్పు త్వరగా తీర్చడానికి ప్రయత్నం చేయండి. గృహంలో శుభ కార్యాలు జరగడానికి సరైన కాలం.

ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ట,సప్తమ,గురు సంచారం,పంచమ రాహు సంచారం లాభస్థానంలో కేతుసంచారం అభివృద్ధిని సూచిస్తుంది.ఆర్థికపరమైన సమస్యలనుండి బయటకు రావడానికి మీరు చేసిన కృషి ఫలిస్తుంది.మీ సంపాదనలో కొంతభాగం మీ సంతానాభివృద్ధికే ఖర్చు పెడతారు.కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది.

భాగస్వాముల వ్యాపారం ప్రథమార్ధంలోకన్నా ద్వితీయార్థంలో లాభిస్తాయి.సమాజంలో మంచి అభివృద్ధి పథంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు.అన్యభాషలను నేర్చుకోవడంలో మీ సృజనాత్మకతను ఉపయోగించడంవలన వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉండును.సినీరంగంలో ఉన్నవారికి అనుకూలంగా వుంది.

మీ సంపాదన కారణంగా కుటుంబం,స్నేహితులకుకొంతదూరంగా ఉంటున్నామనే ఆలోచన మీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది.ఒంటరితనం కొంత బాధపెడుతుంది.

మీకు వచ్చిన సంపాదనలో కొంత దానధర్మాలకు,వృద్ధాశ్రమాలకు,అన్న సమారాధనలకు ఖర్చుపెట్టడం వలన కేతుగ్రహ అనుగ్రహాన్ని పొందగలుగుతారు.దూరప్రాంతాలు,  తీర్థయాత్రల కొరకు కొంత ఖర్చుపెట్టడం మంచిది.

సంతానంకోసం ప్రయత్నించేవారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.గణితవేత్తలకు, అకౌంటెంట్లు,సినిమాపరిశ్రమలో ఉన్నయాక్టర్స్, న్యాయవాదులకు అనుకూల కాలం.

====================================================

ధనస్సు:-ఈ రాశివారికి సంవత్సరం చాలా బాగుంది.అనుకూలమైన గురుగ్రహ ప్రభావంచేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు.జీవితసాధనకు సంబంధించి గురుగ్రహ అనుగ్రహంచేత మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది.

గురువు పంచమ,షష్ఠమ స్థాన సంచారం.రాహువు చతుర్థ స్థానం చలనం,కేతువు దశమ స్థానచలనం,శని తృతీయ స్థానచలనం,శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.

విద్యా సంబంధ విషయాలు,వాహన కొనుగోలు,నూతన గృహాలకు ప్రయత్నించేవారికి అనుకూల కాలం.కుటుంబంలో శుభ కార్యాలకు ధనాన్ని విరివిగా హెచ్చిస్తారు.

మీరు పనిచేసే విద్యాసంస్థలు,కార్యాలయాలలో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి.జాగ్రత్త వహించండి.ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు,టీచర్లకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది.భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

సోదర సహోదరి వర్గానికి చెందినవారు అభివృద్ధిలోకి వస్తారు.శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు.అవివాహితులకు వివాహకాలం.వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకొని,ఒకటికి రెండుసార్లు అన్ని విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి.పూల తోటలు,పండ్ల తోటలు,అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అలంకరణ సామాగ్రి,బ్యూటీపార్లర్,ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల కాలం.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించండి.

 

======================================================

మకర:- ఈ సంవత్సరం కొంతవరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారగంలో ఉన్నవారికి కొంతవరకు అనుకూలకాలం అని చెప్పవచ్చు.విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం.ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది.సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు.జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి.

స్పెక్యులేషన్ లాభిస్తుంది.సుగంధ వ్యాపారాలు,వస్త్ర వ్యాపారం,సౌందర్య సామాగ్రి,వైద్య పరికరాలు అమ్మేవారు,చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా ఉంది.మీ ఆధ్వర్యంలో ఉన్నఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి, అభివృద్ధిని సాధిస్తాయి.అన్నిటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచన మీకు ప్రశాంతతను ఇస్తుంది.ఈ సమాజంలో నీతి నిజాయితీ, మంచితనం కన్నా ధనమే మిన్న, ధనం ముఖ్యపాత్ర వహించడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది.దానివల్లనే వేదనకు గురి అవుతారు.

ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొని జీవిత గమ్యం,సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి మంచి అనుకూలమైన సమయం.

 

కేతుగ్రహ సంచారం జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉండును.సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం.మితిమీరిన ఆత్మవిశ్వాసం వలన స్వయంకృతాపరాధాలవలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.కావున రాహుగ్రహశాంతికై రాహుకాల దీపం లేదా రాహు జపం చేయడం అవసరం.

రాజకీయ వ్యక్తులకు అనుకూలమైన కాలం.ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామికి అర్చన చేయడంవలన మంచి ఫలితాలు అందుకుంటారు.ముఖ్యంగా శనిస్తోత్రం,గోవింద నామాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

=====================================================

కుంభ:-ఈ రాశివారికి ఈ సంవత్సరం తృతీయ చతుర్ధ రాశులలో గురు గ్రహ సంచారం జన్మరాశిలో శని గ్రహ సంచారం,గురు శుక్ర మౌడ్యాలు,ద్వితీయంలో రాహు సంచారం, అష్టమంలో కేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలను నిర్ణయిస్తున్నాయి.

ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.మీ కుటుంబపరంగా అభివృద్ధి బాగుంటుంది.ఆర్థికపరమైన విషయాలు,విద్యాసంబంధమైన విషయాలు,కుటుంబసంబంధ విషయాలు,స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. షేర్ మార్కెట్ వారికి అనుకూలం.బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు వాహనాలు తీసుకునేవారికి అనుకూల కాలం.మీరు నడిపే విద్యాసంస్థలలో,ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది.జాగ్రత్తలు వహించడంద్వారా ఆర్థిక పురోగాభివృద్ధి పొందుతారు.

సంతానంకోసం చూసేవారికి అనుకూలంగా ఉంటుంది.కుటుంబంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి,ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉండడం మంచిది.

జీవిత భాగస్వాముల మధ్య వేరొకరి ప్రమేయం లేకుండా ఉండుట మంచిది.మరొకరి హస్తం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి.వృత్తివ్యాపారపరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.ఫిక్సెడ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు.కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇంటెలిజెన్సీలో ఉన్నవారికి, సి.ఐ.డి, మీడియారంగాలలోనివారికి అనుకూల కాలం.

రాజకీయ వేత్తలకు,రైతులకు జాగ్రత్తలు అవసరం.రాజకీయపరంగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మెళకువ అవసరం.మోకాళ్ళనొప్పులు దీర్ఘకాలిక రోగాలు,నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్త అవసరం.ముఖ్యంగా ఈ సంవత్సరం శని,గురు సంబంధ కార్యక్రమాలు జపాలు చేయడంవలన గత సంవత్సరంకన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందటానికి అవకాశాలు ఉంటాయి.

 

======================================================

 

మీన:-ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ఉద్యోగ, వ్యాపారంలో బాధ్యతలు అధికమవుతాయి.సమాజంలోని కొంతమంది చేసిన రాజకీయాలవలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి.సొంతంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మేలు చేస్తాయి.అందరూ బాగుండాలనే మీ ధోరణి ముందుకు నడిపిస్తుంది.మీ శ్రమ ఫలిస్తుంది.వృథా ప్రయాణాలు అధికమవుతాయి.ఒక్కో సంధర్బంలో వృథా ప్రయాస అవుతుంది.జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

షుగర్,జీర్ణవ్యవస్థ,మోకాళ్ళ నొప్పులు,ఎన్.టి,నరాల బలహీనత,అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.చేతిలో చిల్లిగవ్వకూడా లేకపోయినప్పటికీ అనుకున్న సమయానికి ఋణం ద్వారా డబ్బులు సంపాదిస్తారు.అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు.సంతానం విషయంలో కొంత కష్టపడతారు.

ఆర్ధికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది.ఎంత ఉన్నా లేదనే భావన ఉంటుంది.

రాజకీయపరంగా అభివృద్ధి ఉంటుంది.ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. కుటుంబవరంగా తీర్థయాత్రలు చేస్తారు.ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు.ఉన్నత స్థాయిలో ఉన్నవారికి పరీక్షా కాలం.కోర్టు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.అనుకోని సంఘటనలు ఎదురైనా ధృఢసంకల్పంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు.ముఖ్యంగా నిత్యం హనుమాన్ చాలీసా,మన్యుసూక్తం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

 

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

 

 

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News