ఆందోళన కలిగిస్తున్న ఢిల్లీ, ముంబై
పెరుగుతోన్న క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలో ఇన్ఫెక్షన్లు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం 4.21 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా, 2067 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఢిల్లీ (632), కేరళ (488) ప్రభావమే మొత్తం కొత్త కేసులపై ఎక్కువగా కనిపిస్తోంది. ముంబైలో మార్చి 2 తర్వాత అత్యధిక కేసులు (85) నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం వంటి రాష్ట్రాలు కొవిడ్ కట్టడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళవారం కేంద్రం సూచించింది.
అలాగే గణాంకాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేరళ ప్రభుత్వానికి వెల్లడించింది. క్రితం రోజు ఒకే ఒక్క కరోనా మరణం నమోదు కాగా, నిన్న 40 మంది మరణించారు. కేరళ ప్రకటించిన మృతుల సంఖ్యే 34 గా ఉంది. ఇప్పటివరకు 5.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 1547 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు 12,340 కి పెరిగాయి. మొత్తం కేసుల్లో రికవరీల వాటా 98.76 శాతంగా ఉండగా, క్రియాశీల రేటు 0.03 శాతంగా కొనసాగుతోంది. ఇక మంగళవారం 17,23,733 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.