న్యూఢిల్లీ: నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాలు, తిరుగుబాటు బాధిత ప్రాంతాలలో ఘర్షణల సందర్భంగా గాయపడిన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని వైద్య చికిత్సల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు డిఆర్‌డిఓ ప్రత్యేకంగా రూపొందించిన బైక్ అంబులెన్సులను సిఆర్‌పిఎఫ్ సోమవారం ప్రవేశపెట్టింది. డిఆర్‌డిఓకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ 350 సిసి రాయల్ ఎన్‌ఫీల్ట్ క్లాసిక్ బైకులను అంబులెన్సులుగాడిజైన్ చేసింది. రక్షిత అంబులెన్సులుగా వ్యవహరించే 21 బైక్ అంబులెన్సులను సిఆర్‌పిఎఫ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, తిరుగుబాటు తాకిడికి గురయ్యే ప్రాంతాలలో ఘర్షణల సందర్భంగా గాయపడే పారామిలిటరీ సిబ్బందిని ఆసుపత్రులకు తరలించేందుకు ఈ బైక్ అంబులెన్సులను ఉపయోగిస్తామని సిఆర్‌పిఫ్ అధిపతి ఎపి మహేశ్వరి తెలిపారు. సిఆర్‌పిఎఫ్ బలగాలు మోహిరించి ఉన్న ప్రాంతాలలో స్థానికులకు కూడా ఇవి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెనుక సీటులో తరలించే సమయంలో వారికి అవసరమైన ఆక్సిజన్ కిట్, స్లైన్ సౌకర్యం అందుబాటులో ఉండేలా పరికరాలు అమర్చారు. ఈ ప్రాజెక్టు కోసం సిఆర్‌పిఎఫ్ రూ. 35.49 లక్షల నిధిని ప్రాథమికంగా మంజూరు చేసింది.