Friday, September 20, 2024

బీహార్‌లో దళితుల ఇళ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

బీహార్‌లోని నవాదా జిల్లాలో భూ వివాదం కారణంగా దళిత వాడలోని 20కి పైగా ఇళ్లకు డుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా..బీహార్ ఆటవిక పాలనకు ఈ ఘటన మరో నిదర్శనమని కాంగ్రెస్, ఆర్‌జెడి ఆరోపించాయి. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 80కి పైగా దళితుల ఇళ్లు దగ్ధమైనట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే 21 ఇళ్లు దగ్ధమైనట్లు పోలీసులు తర్వాత నిర్ధారించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తమ వాడలోకి చొరపడిన దుండగులు అనేక దళిత కుటుంబాలపై దౌర్జన్యానికి పాల్పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పుపెట్టిన దుండగులు గాలిలో కాల్పులు కూడా జరిపారని వారు చెప్పారు.

అయితే దుండగులు గాలిలో కాల్పులు జరిపారన్న గ్రామస్తుల మాటలను ఎస్‌పి అభివ్ ధీమన్ తోసిపుచ్చారు. ఇలా ఉండగా నవాదా ఘటనపై సీనియర్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘటనా స్థలానికి స్వయంగా వెళ్లి దర్యాప్తును పర్యవేక్షించాలని అదనపు డిజిపి(శాంతి భద్రతలు)ని ఆదేశించారు. ఈ ఘటనను లోతుగా దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దళితుల ఇళ్ల దగ్ధం ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ దళితుల పట్ల జెడియు, బిజెపి సంకీర్ణ ప్రభుత్వ వివక్షకు ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు. నవాదాలోని మహా దళితుల కాలనీ మొత్తాన్ని దగ్ధం చేయడం బీహార్‌లో బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వెల్లడిస్తోందని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News