Friday, November 22, 2024

కేరళలో వర్షబీభత్సం

- Advertisement -
- Advertisement -
21 killed as heavy rains lash Kerala
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
 కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
 పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
 రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం

కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర ప్రాంతపు రాష్ట్రం కేరళను భారీవర్షాలు, తీవ్రస్థాయి వరదలు కుదిపేస్తున్నాయి. అరేబియా సముద్రంలో తలెత్తిన అల్పపీడనం ఈ ప్రకృతివైపరీత్యానికి దారితీసింది. ఈ జల ప్రళయం వంటి పరిణామం రాష్ట్రంలోని కొండప్రాంతాలకు పెను నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రంలోని రెండు మధ్య ప్రాంత జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల సంబంధిత ప్రమాదాలలో కనీసం 21 మంది దుర్మరణం చెందారని ఆదివారం అధికారులు తెలిపారు. కొట్టాయం జిల్లాలో 13 మంది, ఇదుక్కిలో ఎనమండుగురు వర్షాలు, వరదలకు బలి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గురించి రెవెన్యూ మంత్రి కె రాజన్ విలేకరులకు తెలిపారు. పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాలలో సైనిక బృందాలు కూడా సహాయక చర్యలకు దిగాయి.

కొండప్రాంతాల ప్రజల రక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఇదుక్కి, కొట్టాయం జిల్లాల్లో వరద నష్టం తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికే సహాయక బృందాలు ఈ జిల్లాల్లో శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. కుండపోత వానలతో కొండలపై నుంచి అత్యంత వేగంగా దూసుకువచ్చే వరదనీరుపలు ప్రాంతాల్లో జలపాతాలను తలపిస్తోంది. కొండచరియలు విరిగిపడటం, బురద పెళ్లలతో జనం విలవిలలాడుతున్నారు. ఇప్పటికైతే కొట్టాయంలోని కూట్టకయ్ ఇతర ప్రాంతాలలో 13 మృతదేహాలను వెలికితీశారు. ఇక ఇదుక్కి జిల్లాలోని కంజార్ ఇతర ప్రాంతాలలో ఎనిమిది భౌతికకాయాలను కనుగొన్నారు. ఇదుక్కి జిల్లాలోని కొక్కయార్ వద్ద మూడు శవాలను వెలికితీసినట్లు జిల్లా కలెక్టర్ షీబా జార్జి తెలిపారు. శనివారం కుండపోత వానలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలతో కొండప్రాంతాలు జనం ఆర్తనాదాలతో మార్మోగుతున్నాయి.

చాలా ప్రాంతాలలో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారని కలెక్టర్ తెలిపారు. పలు చోట్ల కొండలు గండిపడినట్లు కావడం, తెరిపిలేని వానలు, దట్టంగా బురద విస్తరించుకుని ఉండటంతో సహాయక చర్యలు వేగం పుంజుకోవడం లేదు. దీనితో పలు ప్రాంతాలలో గల్లంతయిన తమ వారి జాడకోసం ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఓ చోట ముగ్గురు పిల్లల శవాలు బురదలో పడి ఉన్నాయి. ఎనిమిది , ఏడు , మూ డేళ్ల వయస్సున్న పిల్లలు ఒకరి చేతులు పట్టుకుని విగతజీవులుగా పడి కన్పించడం హృదయవిదారకం అయింది. కేరళ ప్రతిపక్ష నేత విడి సతీశన్ ఇతర నేతలు వరదతాకిడి ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. కొక్కయర్, కూటికల్ ఇతర ప్రాంతాలో పరిస్థితి విషమించిందని, అక్కడ ఇప్పటివరకూ ఎటువంటి సహాయక చర్యలూ చేపట్టలేదని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.

కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం

కొట్టాయం జిల్లాలోని వరద బాధిత కూటికల్ ప్రాంతం లో ఓ కుటుంబం మొత్తం భారీ వరదలకు తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటం, వరదలతో ఓ ఇల్లు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇంటి యజమాని 40 ఏండ్ల వ్యక్తి, ఆయన భార్య, 75 ఏండ్ల తల్లి , ముగ్గురు పిల్లలు కొట్టుకుపోయారు. వీరిలో ఇప్పటివరకూ మూడు మృతదేహాలను బురదలో నుంచి వెలికి తీశారు. మరి రెండింటి కోసం అన్వేషిస్తున్నారు.

కేంద్రం నుంచి పూర్తిసాయం : ప్రధాని

కేరళలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటివిపత్కర పరిస్థితులలో పూర్తిసాయం ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని మోడీ వెనువెంటనే రాష్ట్ర సిఎంతో ఫోన్‌లో మాట్లాడారని, పరిస్థితిని తెలుసుకున్నారని వివరించారు. కేరళలో పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, రాష్ట్ర అవసరాల మేరకు కేంద్రం నుంచి సాయం అందుతుందని, సహాయక బృందాలను, సైనిక దళాలను రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్వీటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News